Rahul Vs BJP: రాహుల్‌.. అటువంటి దాడులకు రాజీవ్‌ గాంధీనే పితామహుడు!

ఇటీవల పంజాబ్‌లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులను స్థానిక భక్తులు కొట్టి చంపిన విషయం తెలిసిందే.

Published : 22 Dec 2021 01:24 IST

రాహుల్‌ గాంధీ విమర్శలను తిప్పికొట్టిన భాజపా

దిల్లీ: ఇటీవల పంజాబ్‌లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులను స్థానికులు కొట్టి చంపిన విషయం తెలిసిందే. దేశంలో గత కొంతకాలంగా ఈ తరహా దాడులు పెరుగుతున్నాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘కొట్టి చంపడం (Lynching) అనే పదం 2014కు ముందు ఆచరణలో లేదు.. ధన్యవాదాలు మోదీజీ’ అంటూ ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇలా ప్రధానమంత్రిని విమర్శిస్తూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. 1984 సిక్కులపై జరిగిన దాడులను తెరపైకి తెచ్చిన భాజపా.. అటువంటి దాడులకు పితామహుడు రాజీవ్‌ గాంధీనే అంటూ ఎదురుదాడికి దిగింది.

ఇటీవల పంజాబ్‌ స్వర్ణ దేవాలయంతో పాటు కపూర్తలా గురుద్వారాలో చోటుచేసుకున్న రెండు ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశంలో ఇటువంటి దాడులు పెరుగుతున్నాయంటూ కాంగ్రెస్‌ విమర్శలు మొదలుపెట్టింది. వీటిపై రాహుల్‌ గాంధీ తాజాగా చేసిన వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా మండిపడింది. అసలు 1984నాటి ఘటనలో వందల సంఖ్యలో ఓ వర్గానికి చెందినవారు ప్రాణాలు కోల్పోయిన విషయంతో పాటు 1989లో భాగల్పూర్‌ అల్లర్లనూ కేంద్రమంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే గుర్తుచేశారు. కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు కారణమైనట్లు చెప్పుకొనే నాటి ఘటనల్లో ఓ వర్గానికి చెందిన వారిని అత్యంత దారుణంగా చంపేశారని.. అవి కొట్టి చంపడం (లించింగ్‌) కాదా అంటూ కేంద్ర మంత్రి కాంగ్రెస్‌ను నిలదీశారు.

ఇక భాజపా ఐటీ విభాగం చీఫ్‌గా ఉన్న అమిత్‌ మాలవీయ కూడా రాహుల్‌ గాంధీ విమర్శలకు దీటుగా స్పందించారు. నాటి దాడుల ఘటనలకు పితామహుడు రాజీవ్‌ గాంధీనే అని అభివర్ణించారు. ఈ సందర్భంగా అప్పట్లో రాజీవ్‌ గాంధీ చేసిన ఓ ప్రసంగాన్ని అమిత్‌ మాలవీయ తన ట్విటర్‌లో జత చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ హయాంలోనే దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇటువంటి దాడులెన్నో జరిగాయంటూ అమిత్‌ మాలవీయ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని