Uddhav Thackeray: గవర్నర్‌ల నియామకానికి ప్రాతిపదిక ఏంటి?: ఉద్ధవ్‌ ఠాక్రే

రాష్ట్రపతికి ప్రతినిధిగా వ్యవహిరంచే గవర్నర్‌ నియామకంలో స్పష్టమైన ప్రమాణాలు ఉండాలని శివసేన ( ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే) అధ్యక్షుడు  ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు.

Published : 04 Dec 2022 01:04 IST

ముంబయి: రాష్ట్రపతికి ప్రతినిధిగా వ్యవహరించే గవర్నర్‌(Governor) నియామకంపై స్పష్టమైన ప్రాతిపదికలు లేవని శివసేన (ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే( Uddhav Thackeray)  అన్నారు. వివిధ రాష్ట్రాలకు గవర్నర్‌ నియామక ప్రక్రియలో స్పష్టమైన ప్రమాణాలు ఉండాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీలా ప్రముఖులను విమర్శించే సంస్కృతికి ఆజ్యం పోసినట్లవుతుందని విమర్శించారు. మహారాష్ట్రకు చెందిన ఛత్రపతి శివాజీ, జ్యోతీబాపూలే, సావిత్రిబాయ్‌ పూలే లాంటి మహోన్నత వ్యక్తులను గవర్నర్‌ కించపరచడం సరికాదన్నారు. ‘‘రాష్ట్రపతి ప్రతినిధిగా రాష్ట్రంలో గవర్నర్‌ వ్యవహరిస్తుంటారు. అలాంటి బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగే వ్యక్తి నియామకంపై కచ్చితమైన ప్రమాణాలు ఉండాలి. అలాంటి నిబంధనలు తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నా’’ అని ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు.

ముంబయిలో ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. యువతరానికి స్ఫూర్తిగా నిలిచే వ్యక్తులను విమర్శించే వారిని ఎదుర్కొనేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఉద్యమాన్ని కేవలం మహారాష్ట్ర బంద్‌ వరకే పరిమితం చేయబోమని, త్వరలోనే దీనిపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు విషయంపైనా ఆయన స్పందించారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే చొరవ తీసుకోవడం లేదని విమర్శించారు. మహారాష్ట్ర మంత్రులను బెళగావికి ఆహ్వానించబోమంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై చేసిన ప్రకటనపై శిందే మౌనం వహించారని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు వ్యవహారాల సమన్వయ సమితి సభ్యులుగా నియమించిన మంత్రులు చంద్రకాంత్‌ పాటిల్‌, శంభూరాజ్‌ దేశాయ్‌ బెళగావికి వెళ్లాలని నిర్ణయించగా.. ఇది సరైన విధానం కాదని కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై కొట్టిపారేసిన విషయం తెలిసిందే. ‘‘ముఖ్యమంత్రి శిందే.. ఎమ్మెల్యేలతో కలిసి గువాహటి వెళ్లి.. బెళగావితోపాటు కర్ణాటకలో మరాఠా భాష మాట్లాడుతున్న ప్రాంతాల వారిని మహారాష్ట్రలో కలపాలంటూ కామాఖ్య దేవిని వేడుకో ’’ అని ఠాక్రే అన్నారు. శివసేన పార్టీ చీలిపోలేదని.. రోజు రోజుకూ మరింత బలం పుంజుకుంటోందని ఠాక్రే వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని