Uddhav Thackeray: స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: ఉద్ధవ్‌ ఠాక్రే

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు శివసేన (యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు.

Updated : 10 Jan 2024 20:28 IST

ముంబయి: ఏక్‌నాథ్‌ శిందే వర్గమే అసలైన శివసేన అంటూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ తీసుకున్న నిర్ణయంపై ఉద్ధవ్‌ ఠాక్రే తీవ్రస్థాయిలో స్పందించారు. స్పీకర్‌ నిర్ణయం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే కుట్రగా పేర్కొన్నారు.  స్పీకర్‌ నిర్ణయం ప్రకటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్పీకర్‌ నిర్ణయాన్ని శివసేన (యూబీటీ) వర్గం సుప్రీంకోర్టులో సవాల్‌ చేయనున్నట్లు చెప్పారు.  ‘‘స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ను కూర్చోబెట్టిన తీరు చూస్తే ఆయన కుమ్మక్కైనట్లు తేలిపోయింది. ఆయన ప్రకటించిన నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే పన్నాగమనే సందేహం నిన్ననే వ్యక్తం చేశాను. సుప్రీంకోర్టులో ధిక్కరణ కేసు వేయాలా.. లేదా అనేది చూస్తాం. ఒకవేళ మా పార్టీ రాజ్యాంగం చెల్లకపోతే.. మరి మమ్మల్ని ఎందుకు అనర్హులుగా ప్రకటించలేదు? సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందన్న విశ్వాసం మాకు పూర్తిగా ఉంది. మహారాష్ట్ర ప్రజలకు, శివసేనకు సుప్రీంకోర్టులో పూర్తి న్యాయం జరుగుతుంది’’ అని ఉద్ధవ్‌ అన్నారు. 

ఇదంతా భాజపా కుట్ర: సంజయ్‌ రౌత్‌

శిందే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ వెల్లడించిన నిర్ణయంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ స్పందించారు. ఇదంతా భాజపా కుట్ర.. ఏదో ఒకరోజు బాలాసాహెబ్‌ ఠాక్రే ఏర్పాటు చేసిన శివసేనను అంతం చేయాలన్నది వారి కల అన్నారు. అయితే, ఈ ఒక్క నిర్ణయంతో శివసేన ముగిసిపోదని.. తాము సుప్రీంకోర్టులో తేల్చుకుంటామన్నారు.

‘సుప్రీం’లో న్యాయం జరుగుతుందని ఉద్ధవ్‌ ఆశిస్తున్నారు: పవార్‌

స్పీకర్‌ నిర్ణయంపై ఉద్ధవ్‌ ఠాక్రే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని ఎన్సీపీ అగ్రనేత శరద్‌పవార్‌ అన్నారు. అక్కడ న్యాయం జరుగుతుందని ఉద్ధవ్‌ ఠాక్రే  ఆశిస్తున్నారని  చెప్పారు. సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తామని అంబాదాస్‌ దాన్వే  చెప్పారన్నారు. సుభాష్‌ దేశాయ్‌ కేసులో పార్టీ ఆర్గనైజేషన్‌ చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని పవార్‌ గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని