Andhra News: ఇలాంటి గ్యాంబ్లింగ్‌ ఎవరూ చేయలేదు... జగన్‌ పాలనపై ఉండవల్లి కామెంట్‌

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన జగన్‌ పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి ఎందుకు అప్పగించడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ప్రశ్నించారు...

Updated : 16 Apr 2022 06:32 IST

విశాఖపట్నం: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన జగన్‌ పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి ఎందుకు అప్పగించడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విశాఖలో ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌లో మాట్లాడారు. ‘‘జాతీయ ప్రాజెక్టును కేంద్రం కట్టి ఇవ్వాలి. చంద్రబాబు  ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించిన జగన్‌... ఇప్పుడు ఎందుకు  అదే కొనసాగిస్తున్నారు. ఈయన ప్రభుత్వం రాగానే కేంద్రానికి స్వాధీనం చేయాలి. ఆంధ్రాలో భాజపా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. ఎందుకు ఇక్కడ అనవసరంగా డబ్బులు ఖర్చుపెట్టడమని కేంద్రం భావిస్తోంది. మన ఎంపీలు గట్టిగా అడగలేరు. ఇప్పటి వరకు ఎప్పుడైనా పార్లమెంట్లో అడిగారా?. ఏపీ పునర్విభజన చట్టం ఎందుకు అమలు చేయట్లేదని కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు.

ప్రజలకు డబ్బులు ఇచ్చాను. వాళ్లు నాకు ఓటు వేయాలి. ఇదే జగన్‌ విధానం. అసలు క్విడ్‌ ప్రోకో అంటే ఇదే. ఓటు వేయని వారికి పథకాలు ఇవ్వరు. ఈ విధానంలో జగన్‌ సక్సెస్‌ అవుతారా? ఫెయిల్‌ అవుతారా? అనేది ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఇలాంటి  గ్యాంబ్లింగ్‌ ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. ఎంతకాలం డబ్బులు పంచగలడు, ఎక్కడ్నుంచి తేగలడు. కేంద్రం నిధుల మళ్లింపుపై విచారణ జరుగుతోందట.  విచారణలో ఫలితం ఏమొచ్చినా.. జగన్‌ ఏమీ ఫీల్‌ కారు. ఎందుకంటే.. పేద ప్రజలకు ఇచ్చానంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంవల్లే విద్యుత్‌ సంక్షోభం ఏర్పడింది’’ అని ఉండవల్లి అరుణ్ కుమార్‌ అన్నారు.

పవన్‌ కల్యాణ్ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది...

‘‘బ్రదర్‌ అనిల్‌ నన్ను కలిసినా ఎలాంటి రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదు. అనిల్‌తో కొంత సాన్నిహిత్యం ఉంది.. అందువల్లనే వచ్చి కలిశారు. 2014 తర్వాత రాష్ట్రంలో  నేరుగా క్యాస్ట్‌ వార్‌ జరుగుతోంది. పవన్‌ కల్యాణ్ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అది ఎవరికి కలిసి వస్తుందో చెప్పలేం. ఇంకా ఎన్నికలు రెండేళ్లు ఉన్నాయి. రాజకీయశక్తుల పునరేకీకరణ జరుగుతూనే ఉంటుంది. రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ సీఎం. ఆయనతో పాటు 30మంది సేల్స్‌మెన్‌లు ఉండేవారు. ఆయన చీఫ్‌ సేల్స్‌మెన్‌. అయితే, ఆయన దగ్గరకు వచ్చిన వారు వేరే కౌంటర్‌కి వెళ్లకుండా చూసుకునేవారు. ప్రజలతో మళ్లీ రెండోసారి కూడా ఓటు వేయించుకుని ముఖ్యమంత్రి అయ్యారు. ఆ టైమ్‌ స్వర్ణయుగం. అయనకు అన్నీ కలిసొచ్చాయి. వైకాపాలో సర్వస్వం జగనే. పక్కా బిజినెస్‌గా నడుపుతున్నారు. దీనివల్ల మనకు ఏం లాభం అన్నది చూసుకునే ప్రతీది చేస్తున్నారు. మొన్న దిల్లీ వెళ్లినప్పుడు ప్రధానిని కలిసి రాష్ట్రానికి కావాల్సిన జాబితా ఇచ్చామని విడుదల చేసిన దాంట్లో ప్రత్యేక హోదా ప్రస్తావన ఎక్కడుంది. జగన్‌ పాదయాత్ర నడిచిందే ప్రత్యేక హోదాపైన. పోలవరం చట్టంలోనే ఉంది. చట్టాన్ని యధాతథంగా అమలు చేయమని కోరడానికి ఎమిటి భయం. అదీ అడగలేకపోతున్నారు’’ అని ఉండవల్లి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని