Madhyapradesh Elections: ‘గ్వాలియర్‌-చంబల్‌’ సంగ్రామంలో విజయం ఎవరిదో?

కీలక గ్వాలియర్‌-చంబల్‌ ప్రాంతంలో తమ సత్తా చాటేందుకు భాజపా, కాంగ్రెస్‌తోపాటు బీఎస్పీ కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి?

Updated : 29 Oct 2023 22:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మధ్యప్రదేశ్‌లో (MadhyaPradesh Assembly elections) అధికారాన్ని నిలబెట్టుకునేందుకు భాజపా (BJP) తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 2018 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఎదురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే కులహింసకు కేంద్ర బిందువుగా మారిన గ్వాలియర్‌-చంబల్‌ (Gwalior-chambal) రీజియన్‌లోని మురైనా జిల్లాపై దృష్టి కేంద్రీకరించింది. ఈ జిల్లాలో 6 అసెంబ్లీ స్థానాలే ఉన్నా.. వాటి ప్రభావం దాదాపు 34 నియోజవర్గాలపై ఉంటుంది. ఈ క్రమంలో ఆయా స్థానాల్లో భాజపా, కాంగ్రెస్‌తో పాటు బీఎస్పీ కూడా ఆచితూచి అడుగేస్తున్నాయి.

భాజపా సత్తా చాటుతుందా?

గ్వాలియర్‌-చంబల్‌ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఎక్కువ. అంతేకాకుండా రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో దాదాపు 16 శాతం మంది వీళ్లే. బ్రాహ్మణులు కూడా అధిక సంఖ్యాకులు. వీరిలో చాలా వరకు భాజపాకే ఓటు వేస్తారు. 2018 ఎన్నికలకు ముందు మురైనా జిల్లాలో కులాల మధ్య చెలరేగిన హింసాత్మక దాడుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ ప్రాంతంలో భాజపా తీవ్ర వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది.  గ్వాలియర్‌-చంబల్‌ ప్రాంతంలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 స్థానాలను కాంగ్రెస్‌ ఎగరేసుకుపోయింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 35 స్థానాలను ఎస్టీలకు కేటాయించగా.. అందులో 17 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగురవేసింది. అందులో మురైనా జిల్లాలోని అంబా నియోజవర్గం కూడా ఉంది. కానీ, ఫలితాలు వెల్లడైన తర్వాత ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తన మద్దతు దారులతో కలిసి భాజపాలో చేరిపోయారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న భాజపా.. ఈసారి దళితులు, మైనార్టీ ఓటర్లను ఆకర్షించేలా పలు పథకాలను తీసుకొచ్చింది. బుందేల్‌ఖండ్‌ రీజియన్‌లో రవిదాస్‌ మెమోరియల్‌ నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయించింది. దళిత సామాజిక వర్గంలో రవిదాసియా వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. వారందర్నీ ఆకర్షించేందుకే భాజపా ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.

బ్రాహ్మణవర్గాల అయిష్టత

చిరకాలంగా భాజపాకి అనుకూలంగా ఉండే బ్రాహ్మణుల నుంచి ఈసారి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇన్నేళ్లుగా పార్టీకి మద్దతిస్తున్నా.. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని ఒకింత అసహనం వ్యక్తమవుతోంది. దీనికి తోడు దళితులను ఆకర్షించేందుకు భాజపా ప్రయత్నాలు ముమ్మరం చేయడం కూడా బ్రాహ్మణుల వ్యతిరేకతకు కారణమవుతోంది. బ్రాహ్మణులతోపాటు గుజ్జర్‌ సామాజిక వర్గానికి చెందిన ప్రజల్లోనూ భాజపాపై అసహనం వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో కొన్ని నామినేటెడ్‌ పదవులను, పార్టీలోని కీలక స్థానాలను ఠాకూర్‌ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే ఇస్తున్నారన్న వాదన ఉంది. దీంతో బ్రాహ్మణులు, గుజ్జర్ల లాంటి వర్గాల ప్రజలు జాతీయ స్థాయిలో భాజపాకి అనుకూలంగా ఉన్నప్పటికీ.. రాష్ట్ర స్థాయిలో వ్యతిరేకించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యను భాజపా ఎలా పరిష్కరించుకుంటుందో చూడాలి.

కాంగ్రెస్‌కూ కష్టమే..

ఎలాగైనా విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు ఈసారి ఈ ప్రాంతంలో అంత అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. బీఎస్పీ, ఎస్పీ, ఆమ్‌ఆద్మీ పార్టీలు కూడా తమ శాయశక్తులా పోరాటం చేస్తుండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశాలున్నాయి. వీటన్నింటికీ తోడు కాంగ్రెస్‌కు రెబల్స్‌ సమస్య వెంటాడుతోంది. క్షేత్ర స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో మురైనా జిల్లాలోని సుమవలి నియోజకవర్గ అభ్యర్థిని హస్తం పార్టీ మార్చాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీయే విజయం సాధించింది. మరోవైపు భాజపా ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును ఉపయోగించుకుంటోంది. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి దళిత వర్గానికి చెందినవారేనని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. దళితులకు న్యాయం జరుగుందనే భావనను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే  ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు వ్యతిరేకంగా ఖర్గే ఈ ఏడాది తొలినాళ్లలో ‘జన్‌ ఆక్రోశ్‌’ యాత్రను ప్రారంభించారు.

బీఎస్పీనీ కొట్టిపారేయలేం

చంబల్‌ ప్రాంతంలో దళిత జనాభా ఎక్కువగా ఉన్నందున బీఎస్పీ ప్రభావం కూడా కనిపిస్తుంది. ఉమ్మడి మధ్యప్రదేశ్‌లో 1993 ఎన్నికల్లో 10 స్థానాలను కైవసం చేసుకున్న బీఎస్పీ 1998 ఎన్నికల్లో 8 స్థానాలను గెలుచుకుంది. క్రమంగా తన ప్రభావాన్ని కోల్పోయిన బహుజన పార్టీ 2008 ఎన్నికల్లో 7 స్థానాలు, 2013 ఎన్నికల్లో 4 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. 2018 ఎన్నికల్లో బీఎస్పీ 2 స్థానాల్లో విజయం సాధించగా.. ఎస్పీ-బీఎస్సీ కూటమి నుంచి గుణ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన లోకేంద్ర సింగ్‌రాజ్‌పుత్‌  2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆ తర్వాత  2020లో సంజీవ్‌ కుష్వాహా భాజపా జెండా పట్టుకున్నారు. ఈ ప్రభావం తాజా ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంతలాభం కోసం పార్టీలు మారుతుంటే.. ఎందుకు ఓట్లేయాలన్న వాదన వినిపిస్తోంది. 

అంబా తీరే వేరు!

మురైనా జిల్లా ప్రస్తావనకు వచ్చినప్పుడు కచ్చితంగా అందులోని అంబా నియోజకవర్గం గురించి చెప్పుకోవాల్సిందే. ఇక్కడ పార్టీతో సంబంధం లేదు. ఎప్పుడైనా సిట్టింగ్‌ ఎమ్మెల్యే కమలేశ్‌ జాతవ్‌దే విజయం. 2013 వరకు దాదాపు 2 దశాబ్దాల పాటు ఈ నియోజకవర్గం భాజపా కంచుకోట.  2013లో భాజపా టికెట్‌పై గెలిచిన కమలేశ్‌.. 2018లో కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో భాజపా మూడో స్థానానికి పడిపోయింది. అయితే, 2020లో జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి ఆయన మళ్లీ భాజపా గూటికి చేరిపోయారు. అనంతరం జరిగిన ఉపఎన్నికల్లోనూ మళ్లీ విజయం సాధించారు. అయితే, తాజా ఎన్నికల్లో కమలేశ్‌పై వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చౌహాన్‌పై సందేహం

ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తీవ్రప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఆయనపై ప్రజలకు నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. భాజపా జాతీయ స్థాయి నాయకుల్ని బరిలోకి దించిన నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటారన్న భావన తగ్గుతోంది. క్షేత్రస్థాయిలో చౌహాన్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతోనే అధిష్ఠానం కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌, ఫగ్గన్‌ సింగ్‌ కులస్తేలతోపాటు పలువురు జాతీయస్థాయి నాయకుల్ని రంగంలోకి దింపిందని ప్రచారం జరుగుతోంది. వీటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొని విజయం సాధించాలని భాజపా, గతంలో భాజపా కొట్టిన దెబ్బకు ప్రతీకారం తీర్చుకోవాలని కాంగ్రెస్‌  తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని