గుజరాత్‌, దిల్లీ ఎన్నికల వేళ.. భాజపా, ఆప్‌ మధ్య ఆరోపణల పర్వం

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హత్యకు కుట్ర జరుగుతోందని ఆమ్‌ఆద్మీ పార్టీ మరోసారి ఆరోపించింది. ఇందులో భాజపా ఎంపీ మనోజ్‌ తివారీ పాత్ర ఉందని.. వీటిపై పూర్తి దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేసింది.

Published : 26 Nov 2022 00:20 IST

దిల్లీ: గుజరాత్‌తోపాటు దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగుతోన్న వేళ.. భాజపా, ఆమ్‌ఆద్మీ పార్టీ మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) చంపేందుకు కుట్ర జరుగుతోందని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా పేర్కొన్నారు. ఎన్నికల్లో ఆప్‌ చేతిలో ఓటమి భయంతోనే భాజపా ఇటువంటి కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇందులో భాజపా నేత మనోజ్‌ తివారీ (Manoj Tiwari) పాత్ర ఉందని.. ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ భద్రతపై ఆందోళన కలుగుతోందంటూ భాజపా నేత మనోజ్‌ తివారీ వ్యాఖ్యానించడం ఈ వివాదానికి కారణమయ్యింది.

‘అరవింద్‌ కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన (మనోజ్‌ తివారీ) మాట్లాడిన భాషలోనే అర్థమవుతోంది. కేజ్రీవాల్‌పై దాడి చేయాలని ఆయన అనుచరులకు బహిరంగంగా చెబుతున్నారు. ఇదంతా పక్కా ప్రణాళికతోనే జరుగుతోంది. ఈ బెదిరింపులు చేస్తోన్న మనోజ్‌ను వెంటనే అరెస్టు చేసి, దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం’ అని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా (Manish Sisodia) పేర్కొన్నారు. మరోవైపు కేజ్రీవాల్‌ హత్యకు జరుగుతోన్న కుట్రపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆమ్‌ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌ వెల్లడించారు.

సిసోదియా చేసిన ఆరోపణలను భాజపా నేత మనోజ్‌ తివారీ తోసిపుచ్చారు. ‘పాత స్క్రిప్ట్‌నే సిసోదియా చదువుతున్నారు. ఓవైపు సిసోదియా అరెస్టు అవుతారంటూ కేజ్రీవాల్‌ చెబుతుంటే.. కేజ్రీవాల్‌ను చంపాలని భాజపా చూస్తోందంటూ సిసోదియా చెప్పడం విడ్డూరం. అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు’ అని మనోజ్‌ తివారీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా భాజపా, ఆప్‌ నేతల ఆరోపణలపై స్పందించిన దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా.. నేతల ఆరోపణలన్నింటిపై దృష్టి సారించాలని పోలీస్‌ కమిషనర్‌కు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని