‘సాగు చట్టాలను రద్దు చేయాల్సిందే’

చైనాతో తలెత్తిన ఉద్రిక్తతల విషయంలో యావత్‌ భారత్‌ ప్రధాని మోదీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని రాజ్యసభలో కాంగ్రెస్‌పక్ష నేత గులాం నబీ ఆజాద్‌ తెలిపారు. కానీ, సాగు చట్టాల్ని మాత్రం రద్దు చేసి తీరాల్సిందేనని డిమాండ్‌ చేశారు.............

Published : 03 Feb 2021 14:20 IST

రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌

దిల్లీ: రైతుల ఆందోళన విషయంలో కేంద్ర ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గాల్సిందేనని రాజ్యసభలో కాంగ్రెస్‌పక్ష నేత గులాం నబీ ఆజాద్‌ చెప్పారు. కొత్త సాగు చట్టాల్ని రద్దు చేసి తీరాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాజ్యసభలో సాగు చట్టాలపై మాట్లాడుతూ బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆందోళన, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడారు. జనవరి 26న జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆజాద్‌ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యగా ఆ ఘటనను అభివర్ణించారు. అయితే, ఈ దుశ్చర్యతో సంబంధం లేని ప్రజలు, రైతు నేతల్ని మాత్రం శిక్షించొద్దన్నారు. లేదంటే అది మరో ఉద్యమానికి దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపిన ఆజాద్‌.. స్వాతంత్ర్యోద్యమ సమయంలో మహాత్మా గాంధీ చేసిన ఖేడా సత్యాగ్రహం, నీలిమందు రైతుల ఉద్యమాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే జనవరి 26న జరిగిన ఘటన తర్వాత అదృశ్యమైన యువరైతుల ఆచూకీ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు. చైనాతో తలెత్తిన ఉద్రిక్తతల విషయంలో యావత్‌ భారత్‌ ప్రధాని మోదీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని తెలిపారు.

మరోవైపు రెండున్నర నెలలుగా రైతులు చేస్తున్న ఉద్యమం వల్ల దిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్రం పార్లమెంటుకు వెల్లడించింది. దిల్లీతో పాటు పొరుగురాష్ట్రాల ప్రజానీకం సైతం అనేక ఇక్కట్ల పాలవుతున్నారని పేర్కొంది. రైతుల ఆందోళన వల్ల ఆర్థికంగానూ నష్టం వాటిల్లుతోందని చెప్పింది. మరోవైపు సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై రాజ్యసభలో 15 గంటల పాటు చర్చించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. అంతకు ముందు రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. నూతన సాగు చట్టాలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు.. ముగ్గురు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీలను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్‌ చేశారు. 

ఇవీ చదవండి...

రైతుల ఆందోళనపై రాజ్యసభలో 15గంటల చర్చ

రైతు ఉద్యమానికి థన్‌బర్గ్‌, రిహానా మద్దతు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని