AIR INDIA: గగనతలంలో ఆగిపోయిన ఇంజిన్‌.. ముంబయిలో అత్యవసర ల్యాండింగ్‌

ఎయిర్‌ఇండియా విమానం గురువారం పెను ప్రమాదం నుంచి బయటపడింది. ముంబయి నుంచి బెంగళూరు పయనమైన ఎ320నియో విమానం.. టేకాఫ్‌ అయిన 27 నిమిషాలకే తిరిగి ముంబయి

Updated : 21 May 2022 09:19 IST

దిల్లీ: ఎయిర్‌ఇండియా విమానం గురువారం పెను ప్రమాదం నుంచి బయటపడింది. ముంబయి నుంచి బెంగళూరు పయనమైన ఎ320నియో విమానం.. టేకాఫ్‌ అయిన 27 నిమిషాలకే తిరిగి ముంబయి విమానాశ్రయానికి చేరుకుంది. గగనతలంలో ఉండగానే ఒక ఇంజిన్‌ పనిచేయడం ఆగిపోయిందని, వెంటనే పైలట్‌ విమానాన్ని వెనక్కి మళ్లించారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) విచారణ జరుపుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎయిర్‌ ఇండియాకు చెందిన ఎ320నియో విమానానికి రెండు సీఎఫ్‌ఎమ్‌ లీప్‌ ఇంజిన్లు ఉంటాయి. ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం ఉదయం 9.43 గంటలకు ఎ320నియో విమానం బయలుదేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇంజిన్‌ పనిచేయడం ఆగిపోయిందని గుర్తించిన పైలట్‌ వెంటనే 10.10 గంటలకు ముంబయి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై ఎయిర్‌ ఇండియా ప్రతినిధి స్పందించారు. ‘ఎయిర్‌ ఇండియా సంస్థ భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తుంది. మా సిబ్బంది ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనే నైపుణ్యం కలిగి ఉంటారు. ఇంజినీరింగ్‌ అధికారులు వెంటనే సమస్యను పరిశీలించడం ప్రారంభించారు. ప్రయాణికులను వెనువెంటనే వేరే విమానంలో బెంగళూరుకు చేర్చాం’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని