పాతవి ఎత్తేస్తాం.. కొత్తవి తెస్తాం!

సంప్రదాయ కోర్సులకు స్వస్తి పలికి.. కొత్త కోర్సులు ప్రారంభించేందుకు రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్‌ కళాశాలలు తహతహలాడుతున్నాయి. డిమాండు లేని కోర్సులను ఎత్తివేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

Published : 28 May 2022 06:31 IST

నూతన కోర్సుల అనుమతులకు 99 కళాశాలల దరఖాస్తు
30 నుంచి పరిశీలనకు జేఎన్‌టీయూ అంగీకారం

ఈనాడు, హైదరాబాద్‌: సంప్రదాయ కోర్సులకు స్వస్తి పలికి.. కొత్త కోర్సులు ప్రారంభించేందుకు రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్‌ కళాశాలలు తహతహలాడుతున్నాయి. డిమాండు లేని కోర్సులను ఎత్తివేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌లో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టేందుకు పెద్దసంఖ్యలో కళాశాలలు జేఎన్‌టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి.

విద్యార్థుల డిమాండును బట్టి..
ప్రధానంగా కృత్రిమ మేధ-మెషిన్‌ లెర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌, ఐవోటీ, ఐటీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఆసక్తి చూపిస్తున్నాయి. విద్యార్థుల డిమాండ్‌ దృష్ట్యా కళాశాలలు ఆ మేరకు అనుమతి కోరుతున్నాయి. మూణ్నాలుగేళ్లుగా ఈ ధోరణి బాగా ఎక్కువైంది. సీట్ల సంఖ్యను కుదించుకోవడం లేదా కోర్సులు ఎత్తివేయాలన్నా.. కొత్త కోర్సులు తీసుకురావాలన్నా.. జేఎన్‌టీయూ నుంచి తప్పకుండా నిరభ్యంతరపత్రం (ఎన్‌వోసీ) తీసుకోవాలి. ఈసారి కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం, అప్పటికే ఉన్న సంప్రదాయ కోర్సులు  ఎత్తివేసేందుకు ఏకంగా 99 కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి.
* ఈ నెల 30, 31, జూన్‌ 1 తేదీల్లో ఆయా కళాశాలలు బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ (బీవోజీ) మినిట్స్‌, సొసైటీ తీర్మానం, సమ్మతిపత్రం, గత మూడేళ్లలో విద్యార్థుల ప్రవేశాల వివరాలతో హాజరు కావొచ్చని వర్సిటీ రిజిస్ట్రార్‌ మంజూర్‌హుస్సేన్‌ వివరించారు.

చాలాచోట్ల పేరుకే ఇంజినీరింగ్‌...
ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం సంప్రదాయ కోర్సులు కొనసాగిస్తూ కొత్త కోర్సులు తీసుకురావాలని జేఎన్‌టీయూ సూచిస్తోంది. మూడేళ్లలో 25శాతం కంటే తక్కువ అడ్మిషన్లు అయిన కోర్సులు మూసివేసేందుకు కళాశాలలకు వెసులుబాటు ఉంటుంది. అయితే మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌ వంటి కోర్సులు పూర్తిగా మూసివేసి.. కేవలం కంప్యూటర్‌ సైన్స్‌, అనుబంధ కోర్సుల నిర్వహణకే మొగ్గు చూపుతున్నాయి. దీనివల్ల పేరులోనే ఇంజినీరింగ్‌ ఉంటుంది తప్ప కళాశాలలో ఉండటం లేదని జేఎన్‌టీయూ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. కళాశాల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతులు తెచ్చుకుంటున్నాయి. ఈసారి జేఎన్‌టీయూ ముందుగానే స్పందించి కళాశాలల వాదన వినాలని నిర్ణయించింది. ఏయే కళాశాలలకు ఎన్‌వోసీలు లభిస్తాయో.. త్వరలో తేలనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని