Published : 05 Jul 2022 05:55 IST

ముగ్గురు భాజపా ఎంపీలపై కాంగ్రెస్‌ కేసులు

రాహుల్‌పై నకిలీ వీడియో వ్యవహారంలో మరో ఎమ్మెల్యేపైనా ఎఫ్‌ఐఆర్‌

దిల్లీ: రాహుల్‌గాంధీపై నకిలీ వీడియోకు సంబంధించి వ్యవహారంలో ముగ్గురు భాజపా ఎంపీలపై కేసు నమోదు చేసినట్టు కాంగ్రెస్‌ పార్టీ సోమవారం వెల్లడించింది. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌ సహా ఎంపీలు సుబ్రత్‌ పాఠక్‌, భోలాసింగ్‌, యూపీ ఎమ్మెల్యే కమలేశ్‌ సైనీలపై ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు తెలిపింది. ఈ నేతలపై దిల్లీతో పాటు... ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ కేసులు పెట్టినట్టు కాంగ్రెస్‌ మీడియా, ప్రచార విభాగాధినేత పవన్‌ ఖెడా, సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి సుప్రియా శ్రీనతె వెల్లడించారు. కేరళలోని వయనాడ్‌లో తన కార్యాలయంపై దాడి చేసినవారిని చిన్నపిల్లలుగా పేర్కొంటూ, వారికి వ్యతిరేకంగా తనకు ఎలాంటి దురుద్దేశం లేదని రాహుల్‌గాంధీ ఇటీవల వీడియో సందేశమిచ్చారు. అయితే, ఓ టీవీ ఛానెల్‌... రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన టైలర్‌ కన్హయ్యలాల్‌ హంతకులను ఉద్దేశించి రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ప్రసారం చేసిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. తర్వాత ఆ సంస్థ ఇందుకు బహిరంగ క్షమాపణలు కూడా చెప్పింది. అయితే, రాహుల్‌ వీడియోను భాజపా నేతలు సామాజిక మాధ్యమంలో తప్పుడు ప్రచారానికి వినియోగించారని, తద్వారా దేశంలో మత విద్వేషాలకు పాల్పడ్డారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

కన్హయ్య హంతకుడితో భాజపాకు సంబంధమేంటి?

కన్హయ్య హత్య కేసులో నిందితుడు రియాజ్‌ అత్తారి, శ్రీనగర్‌లో చిక్కిన ఉగ్రవాది తాలిబ్‌ షాలు భాజపా నేతలతో దిగిన ఫొటోలను ఖెడా మీడియాకు చూపించారు. వారితో భాజపాకు ఏం సంబంధముందని ప్రశ్నించారు. కాషాయపార్టీ దేశంలో విద్వేషాగ్నులను వ్యాప్తి చేయడమే కాకుండా తమ పార్టీలో ఉగ్రవాదులను కూడా ప్రోత్సహిస్తోందని, హింస, మతోన్మాదాన్ని ప్రేరేపించేందుకు ఆ పార్టీ ఎంతవరకైనా వెళ్తుందని ఆరోపించారు.

‘రాథోడ్‌ది దేశద్రోహ చర్య...’

మత సామరస్యాన్ని దెబ్బతిసే ఉద్దేశంతో నకిలీ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచడం ద్వారా రాథోడ్‌ దేశ ద్రోహానికి పాల్పడ్డారని శ్రీనతె పేర్కొన్నారు. ‘‘తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేవారిని భాజపా అందలం ఎక్కిస్తుండటమే ఈ సమస్యకు కారణం. దిల్లీ అల్లర్ల సందర్భంగా ప్రస్తుతం కేంద్ర సమాచార, ప్రచారశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. ఆ తర్వాతే ఆయనకు పదోన్నతి లభించింది. హైదరాబాద్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ... శాంతి పరిరక్షణ విషయమై ఒక్కమాట కూడా మాట్లాడలేదు’’ అని ఆమె మండిపడ్డారు. ‘‘ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వ అధికారిక ట్విటర్‌ హ్యాండిళ్లలో దేశ భద్రతపై అనేక పోస్టులు పెడుతున్నారు. మరి భాజపా నుంచి దేశానికి ఎదురవుతున్న బెదిరింపుల నుంచి ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారు? ఏం చర్యలు తీసుకున్నారు?’’ అని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని