తృణమూల్‌లో గరంగరం.. ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ విధానంపై కాక

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

Updated : 12 Feb 2022 11:00 IST

నేడు అత్యవసర సమావేశానికి మమత నిర్ణయం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అటు పార్టీ పాతకాపులు, ఇటు కొత్త తరం నేతల మధ్య విభేదాలు అంతకంతకూ పెరుగుతుండడం,  ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ విధానంపై పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తుండడం, దీనికితోడు తృణమూల్‌కు, ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ‘ఐప్యాక్‌’కు మధ్య అగాథం ఏర్పడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మమత అత్యవసర అత్యున్నత సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం జరిగే ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఆరుగురు అగ్రనేతలకు మాత్రమే ఆహ్వానం అందినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మమత మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ, సెక్రటరీ జనరల్‌ పార్థ ఛటర్జీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రతా బక్షి, మంత్రులు ఫిర్హాద్‌ హకీం, అరూప్‌ బిశ్వాస్, చంద్రిమా భట్టాచార్య ఆహ్వానితుల జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నాయి. ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ విధానంపై పార్టీలో రెండు వర్గాల నేతలు గత కొన్నిరోజులుగా బహిరంగంగా భిన్న ప్రకటనలు చేయడంపై మమత అసహనంతో ఉన్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సీనియర్‌ నేత వెల్లడించారు. శనివారం జరిగే సమావేశంలో దీనిపై పార్టీ వైఖరి గురించి స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారని తెలిపారు. దీంతోపాటు ఈ నెల 28న జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

అభిషేక్‌ వర్గంపై సీనియర్ల అసంతృప్తి
పార్టీని అంతర్గతంగా పునర్వ్యవస్థీకరించాలని అభిషేక్‌ బెనర్జీ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందుకోసం ఐప్యాక్‌ సాయంతో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ విధానాన్ని తెరపైకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన వర్గానికి చెందిన కొందరు నేతలు పార్టీలో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ శుక్రవారం ట్విటర్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే దీన్ని మంత్రి హకీం సహా సీనియర్‌ నేతలు ఖండించారు. పార్టీ ఇలాంటి విధానాన్ని అంగీకరించదని, కొందరు నేతలు తప్పుదారి పట్టించే ప్రకటనలు ఇస్తున్నారని మండిపడ్డారు. కాగా మంత్రి పదవిలో ఉన్న హకీం కోల్‌కతా నగర మేయర్‌గానూ ఉన్నారు.

ఐప్యాక్‌ తప్పుదారి పట్టిస్తోంది: చంద్రిమా
మరో సీనియర్‌ నేత చంద్రిమా భట్టాచార్య ట్విటర్‌ ఖాతాలోనూ తొలుత ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ విధానానికి అనుకూలంగా ట్వీట్‌ వెలువడింది. ఆ తర్వాత కాసేపటికి ఆమె దాన్ని ఖండించారు. ఆ ట్వీట్‌ తాను చేయలేదని, తన ట్విటర్‌ ఖాతాను ఐప్యాక్‌ బృందమే నిర్వహిస్తోందని, దాన్ని దుర్వినియోగం చేస్తూ తాజా ట్వీట్‌ చేసిందని చంద్రిమా ప్రకటించారు. ఆమె వ్యాఖ్యలను ఐప్యాక్‌ బృందం తిప్పికొట్టింది. తృణమూల్‌ ట్విటర్‌ ఖాతా కానీ, ఆ పార్టీ నేతల ఖాతాలను కానీ తాము నిర్వహించడం లేదని తెలిపింది. ఐప్యాక్‌ వ్యాఖ్యలతో ప్రశాంత్‌ కిశోర్‌కు, తృణమూల్‌కు మధ్య దూరం పెరిగిందన్న విషయం నిర్ధారణ అవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బెంగాల్, మేఘాలయ, ఒడిశాలలో తృణమూల్‌ తరఫున తాము పనిచేయాలనుకోవడం లేదని ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవల మమతకు టెక్ట్స్‌ మెసేజ్‌ పంపారని, ఆమె దీనికి ధన్యవాదాలు అని బదులిచ్చారని ఆనందబజార్‌ పత్రిక పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని