Andhra News: ఏనుగమ్మ ఏనుగు.. ఎందుకమ్మా ఈ పరుగు!

రెండేళ్ల క్రితం చైనాలో ఓ ఏనుగుల గుంపు తమ స్థావరాలను వదిలి ఏడాదికి పైగా వందల కిలోమీటర్ల 

Updated : 07 Apr 2022 10:15 IST

2 నెలల్లో 200 కి.మీ. పైగా ప్రయాణం 
మూడు గజరాజుల విజయ విహారం 

ఈనాడు డిజిటల్, చిత్తూరు- న్యూస్‌టుడే, రేణిగుంట: రెండేళ్ల క్రితం చైనాలో ఓ ఏనుగుల గుంపు తమ స్థావరాలను వదిలి ఏడాదికి పైగా వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తిన విషయం తెలిసిందే. గజరాజుల సమూహం ఓ యాత్రలా అడవుల్నీ, ఊళ్లను చుట్టి.. చివరకు సొంత ఆవాసాలకు చేరుకున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని చిత్తూరు జిల్లాలో కూడా ఇదే తరహాలో మూడు ఏనుగులు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ యాత్రను ప్రారంభించాయి. పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్య అభయారణ్యం నుంచి ప్రయాణాన్ని ప్రారంభించి బుధవారం నాటికి రేణిగుంట మండలం ఎర్రమరెడ్డిపాళెం చేరుకున్నాయి. ఇవి దాదాపు 200 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అభయారణ్యం, అడవులు, గ్రామాలు, నదులను దాటి వచ్చిన ఈ కరి సమూహం తదుపరి ప్రయాణం ఎటో తెలియడం లేదు. శేషాచలం అభయారణ్యం వైపు వెళతాయా? లేదంటే తిరిగి కౌండిన్యకు చేరుకుంటాయా? అనే ఆసక్తి నెలకొంది. 

ప్రారంభించింది ఒక్క ఏనుగే  

సాధారణంగా ఏనుగులు ఆహారం, నీరు, ఆవాసం కోసం కొత్త ప్రాంతాలను వెతుక్కుంటూ గుంపుగా వెళతాయి. కౌండిన్య అభయారణ్యంలో సరైన వనరులు లేకపోవడంతో గతేడాది ఓ ఏనుగు మరో రెండింటిని కూడగట్టి చెరకు సాగు ఎక్కువగా ఉండే వెదురుకుప్పం, కార్వేటినగరం, పుత్తూరు తదితర తూర్పు ప్రాంతాలకు తీసుకెళ్లింది. వాటిలో ఒకటి దురదృష్టవశాత్తు నారాయణవనం మండలంలో విద్యుదాఘాతంతో మరణించింది. కొంతకాలం తర్వాత తిరిగి రెండు గజరాజులు వేర్వేరుగా కౌండిన్యకు చేరుకున్నాయి. గతేడాది విహారాన్ని ప్రారంభించిన ఏనుగే.. ఈ ఏడాది మరో రెండింటిని జత చేసుకొని ఐరాల, పూతలపట్టు, పెనుమూరు, వెదురుకుప్పం, కార్వేటినగరం, పుత్తూరు, నగరి వరకు తీసుకెళ్లింది. అటు నుంచి తమిళనాడుకు వెళ్లగా అక్కడి అటవీ శాఖ సిబ్బంది తరమడంతో.. మూడు గజరాజులు దారి తప్పి వడమాలపేట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, రేణిగుంట మండలాల్లో తిరుగుతున్నాయి. ఇప్పటివరకూ అవి ఎవరికీ హాని కలిగించకపోవడం ఊరట కలిగిస్తోంది. అన్నదాతలు మాత్రం పంట నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని