Harmanpreet Kaur: ఆ 63 పరుగులు నాకు చాలా ప్రత్యేకం : హర్మన్‌ప్రీత్ కౌర్‌

త్వరలో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేయగలననే నమ్మకం ఉందని టీమిండియా బ్యాటర్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన..

Published : 03 Mar 2022 01:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : త్వరలో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేయగలననే నమ్మకం ఉందని టీమిండియా బ్యాటర్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్‌ మ్యాచులో సెంచరీ బాదడంతో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని ఆమె పేర్కొన్నారు. తాజాగా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆమె పలు విషయాలు వెల్లడించారు.

‘గతంలో నేను నెలకొల్పిన 171 పరుగుల రికార్డు గురించి చాలా మంది మాట్లాడుతుంటారు. అందుకేనేమో జట్టుకు అవసరమైనప్పుడు ఆడిన 30, 40 పరుగుల కీలక ఇన్నింగ్సులు గురించి ఎవరూ పట్టించుకోరు. గతంలో నేను చేసిన పరుగుల ఆధారంగా నా ప్రదర్శనను అంచనా వేసుకోవాలనుకోవడం లేదు. జట్టులో నా పాత్రేంటో తెలుసు. జట్టు కోసం ఎప్పుడూ గొప్ప ఇన్నింగ్సులు ఆడాలనుకుంటాను. ఒక బ్యాటర్‌గా పరుగులు చేయలేకపోతే చాలా బాధగా ఉంటుంది. ఆడిన ప్రతిసారి అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాను. అయితే, కొన్నిసార్లు పరిస్థితులు కలిసి రాకపోవచ్చు. అలాంటి సమయాల్లోనే మనపై తీవ్ర విమర్శలు వస్తుంటాయి. త్వరలో ప్రారంభం కానున్న ప్రపంచకప్‌లో మెరుగ్గా రాణించగలననే నమ్మకం ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో సెంచరీ (104) సాధించడంతో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. అలాగే, న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి వన్డే మ్యాచులో నమోదు చేసిన అర్ధ శతకం (63) నాకు చాలా ప్రత్యేకం. ఈ ఇన్నింగ్స్‌తో మళ్లీ మునుపటి ఫామ్‌ను అందుకున్నాను. నాలుగో స్థానంలో ఆడటం నాకు చాలా సౌకర్యంగా ఉంటుంది. కానీ, కొన్నిసార్లు జట్టు అవసరాలకు అనుగుణంగా వేరే స్థానాల్లో కూడా ఆడాల్సి రావచ్చు. ఈ విషయం గురించి మేం చర్చించాం. కానీ, ప్రస్తుతానికైతే ఐదో స్థానంలోనే బ్యాటింగ్‌ చేస్తాను. భవిష్యత్తులో అవసరమైతే నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొన్నారు.

* ఆఖర్లో వేగం పెంచాలి..

‘మా బ్యాటింగ్‌ విభాగం కాస్త మెరుగ్గా రాణించాల్సి ఉంది. టాప్‌ 5 బ్యాటర్లు ఆఖరి వరకు క్రీజులో ఉండి.. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాలి. ఇటీవల మా జట్టు కనీసం 250కి పైగా పరుగులు చేస్తోంది. అయితే, ఆఖరి పది ఓవర్లలో ఎక్కువగా పరుగులు రాబట్టలేకపోతున్నాం. ఆఖర్లో మరింత వేగంగా ఆడాల్సిన అవసరం ఉంది’ అని హర్మన్ ప్రీత్‌ చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని