IND vs SL: ఆ నో బాల్స్‌కు అసలు బాధ్యులు వారే: గౌతమ్‌ గంభీర్‌

టీమ్‌ఇండియా యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌(Arshdeep Singh) నో బాల్స్‌ అంశంపై గౌతమ్‌ గంభీర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. దీనికి అసలు బాధ్యులు వేరని తెలిపాడు.   

Published : 06 Jan 2023 19:09 IST

పుణె: శ్రీలంకతో రెండో టీ20(IND vs SL 2023)లో అర్ష్‌దీప్‌ సింగ్‌ ఏకంగా 5 నో బాల్స్‌ వేయడం ఆమోదయోగ్యం కాదంటూ మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. అనారోగ్యం కారణంగా చాలా కాలం పాటు జట్టుకు దూరమైన ఈ యువ పేసర్‌ తిరిగి తన రిథమ్‌ను అందుకోవడానికి కష్టపడాల్సి వస్తోందన్నాడు. 

ముంబయి వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌ ఆడకపోయినా రెండో టీ20తో అర్ష్‌దీప్‌(Arshdeep Singh) సత్తా చాటుతాడని అభిమానులు భావించారు. అయితే, ఇప్పటికీ తన నో బాల్స్‌ వేసే బలహీనతను వదిలించుకోకపోవడం అతడి కెరీర్‌కు ముప్పుగా మారుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ 5 నో బాల్స్‌ వేసిన తర్వాత పాండ్య మరోసారి అతడికి అవకాశం ఇచ్చే ధైర్యం చేయలేకపోయాడు. ఆ తర్వాత ఉమ్రాన్‌ మాలిక్‌, శివం మావి సైతం ఒక్కో నో బాల్‌ను వేసి ఈ సంఖ్యను 7కి పొడిగించారు. 

ఈ అంశంపై గంభీర్‌ మాట్లాడుతూ.. ‘‘ఒక మ్యాచ్‌లో 7 నో బాల్స్‌ ఆడటం అంటే ఒక అదనపు ఓవర్‌ ఆడినట్టే. కానీ, ఇక్కడ విషయం అది కాదు. కొన్ని సార్లు చెత్త బంతులు ఆడటం సహజమే. కానీ, అర్ష్‌దీప్‌ మునుపటి రిథమ్‌ను అందుకోలేకపోతున్నాడు. సుదీర్ఘ విరామం తీసుకుని వచ్చిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకూడదు. ముందు దేశీయ క్రికెట్‌ ఆడుతూ ఆ రిథమ్‌ను ఒడిసిపట్టాలి. ఎందుకంటే, ఇలా నో బాల్స్‌ ఆడటం ఏమాత్రం ఆమోదించదగినది కాదు. నిజానికి బౌలర్లను ఆ దిశగా నడిపించాల్సిన బాధ్యత బౌలింగ్‌ కోచ్‌ది. సాధన సమయంలోనే వారు ఈ విధంగా ఆడి ఉంటారు. అప్పుడే ఈ విషయంలో కఠినంగా ఉండాలి. నెట్స్‌లో నో బాల్స్‌ వేసినప్పుడే కోచ్‌ ఆటగాళ్లను కట్టడి చేస్తే మ్యాచ్‌లో ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. 7 నో బాల్స్‌తో పాటుగా 30 పరుగుల వరకు అర్పించడం పెద్ద నష్టాన్ని కలిగించింది’’ అంటూ గంభీర్‌ తెలిపాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని