Updated : 24 Jun 2021 06:31 IST

WTC Final: వాళ్లకు గద.. మనకు వ్యథ

 చేజారిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌

కివీస్‌దే టైటిల్‌.. ఫైనల్లో 8 వికెట్లతో విజయం

రెండో ఇన్నింగ్స్‌లో 170కే భారత్‌ ఆలౌట్‌

సౌథాంప్టన్‌

రెండేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు.. మరెన్నో అడ్డంకులు..!

కఠోర శ్రమ, అద్భుత నైపుణ్యం, అసాధారణ పోరాటం ఆయుధాలుగా అన్ని సవాళ్లనూ, అడ్డంకులనూ అధిగమించి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన కోహ్లీసేన.. ఆఖరి మెట్టుపై తడబడింది! 

ప్రాక్టీస్‌ లేమి.. ప్రత్యర్థికి కలిసొచ్చే పరిస్థితులు.. కూర్పులో తప్పటడుగులు.. అనిశ్చిత వాతావరణం.. కీలక సమయంలో ప్రధాన బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం.. వెరసి టెస్టు క్రికెట్లో తొలి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పెద్దగా విజయావకాశాలు కనిపించని స్థితిలో మ్యాచ్‌ను డ్రా చేసుకుని సంయుక్త విజేతలుగా అయినా నిలుస్తారని ఆశిస్తే.. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ పట్టుదల ప్రదర్శించలేకపోయారు. టాప్‌-5 బ్యాట్స్‌మెన్‌ కలిసి వందైనా చేయని స్థితిలో ప్రత్యర్థి ముందు స్వల్ప లక్ష్యమే నిలిచింది. బౌలర్లేమీ అద్భుతాలు చేయలేకపోయారు. హడావుడి లేకుండా తనదైన శైలిలో ప్రశాంతంగా లక్ష్యాన్ని ఛేదించి టెస్టు క్రికెట్‌లో తొలి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది విలియమ్సన్‌ సేన.

రెండేళ్ల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ప్రయాణంలో  భారత్‌కు సిరీస్‌ ఓటమి రుచి చూపిన ఏకైక జట్టు న్యూజిలాండ్‌. ఇప్పుడు ఆ జట్టే భారత్‌ ప్రపంచ ఛాంపియన్‌ కాకుండా అడ్డుకుంది. రిజర్వ్‌ డే అయిన బుధవారం ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్‌ 8 వికెట్ల తేడాతో కోహ్లీసేనను ఓడించి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. 8 వికెట్లు చేతిలో ఉండగా.. 32 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్‌.. రెండు సెషన్లు ఆడి మ్యాచ్‌ను డ్రా చేసుకుంటుందనుకుంటే.. రెండో సెషన్‌ మధ్యలోనే ఇన్నింగ్స్‌ను ముగించేసింది. భారత్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా (15), కోహ్లి (13) తీవ్ర నిరాశకు గురి చేశారు. రహానె (15) సైతం విఫలమయ్యాడు. రిషబ్‌ పంత్‌ (41; 88 బంతుల్లో 4×4) ఒక్కడు పోరాడినా.. అది సరిపోలేదు. 170 పరుగుల వద్ద రెండో  ఇన్నింగ్స్‌ను ముగించిన భారత్‌.. ప్రత్యర్థికి 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అశ్విన్‌ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టినా.. కేన్‌ విలియమ్సన్‌ (52 నాటౌట్‌; 89 బంతుల్లో 8×4), రాస్‌ టేలర్‌ (47 నాటౌట్‌; 100 బంతుల్లో 6×4) తమ అనుభవాన్ని చూపిస్తూ భారత్‌ ఆశలకు గండికొట్టారు. వీళ్లిద్దరూ అభేద్యమైన మూడో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 217 పరుగులకు ఆలౌట్‌ కాగా.. కివీస్‌ 249 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కీలక వికెట్లతో భారత్‌ను గట్టి దెబ్బ తీసిన కైల్‌ జేమీసన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. వర్షం వల్ల దాదాపు రెండున్నర రోజుల ఆటకు నష్టం వాటిల్లడంతో రిజర్వ్‌ డే అయిన ఆరో రోజు మ్యాచ్‌ను కొనసాగించారు. చివరి రోజు వర్షం పడినా భారత్‌ డ్రాతో గట్టెక్కేది. కానీ వరుణుడు కివీస్‌ విజయానికి అడ్డు పడలేదు.

ఆశలు రేపిన అశ్విన్‌: 52 ఓవర్లు.. 139 పరుగులు. కివీస్‌ గెలుపు సమీకరణమిది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ఇంకో పది ఓవర్లు సాగి ఉంటే, మరో 30 పరుగులు జమ అయి ఉంటే.. భారత్‌కు ఓటమి ముప్పు ఉండేదే కాదేమో! అయితే చాలా తేలికైన లక్ష్యాన్ని ఛేదించడానికి కూడా కివీస్‌ ఎంతో కష్టపడేలా చేశారు భారత బౌలర్లు. నిజానికి ఛేదన ఆరంభమయ్యాక గంట పాటు ఆ జట్టు వికెట్‌ కోల్పోలేదు. 13 ఓవర్లకు 33/0తో నిలిచిన కివీస్‌.. తేలిగ్గా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. అయితే అశ్విన్‌ తక్కువ వ్యవధిలో ఓపెనర్లు లేథమ్‌ (9), కాన్వే (19)లను ఔట్‌ చేసి ప్రత్యర్థిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. భారత్‌లో ఆశలు రేపాడు. బంతి బంతికీ పరీక్ష పెడుతున్న అశ్విన్‌ను బెదరగొట్టాలని ముందుకొచ్చి ఆడిన లేథమ్‌ స్టంపౌట్‌ అయిపోగా.. కాన్వే అతడి బౌలింగ్‌లోనే వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. స్వల్ప వ్యవధిలో ఓపెనర్ల నిష్క్రమణతో కివీస్‌ ఆత్మరక్షణలో పడింది. విలియమ్సన్‌, టేలర్‌ ఇద్దరూ క్రీజులో కుదురుకోవడానికి కష్టపడ్డారు. అయితే వీళ్లిద్దరూ కాస్త నిలదొక్కుకోగానే షాట్లు ఆడారు. 23-27 మధ్య నాలుగు ఓవర్లలో 5 ఫోర్లు రావడంతో ఒక్కసారిగా వీరిపై ఒత్తిడి తొలగిపోయింది. కివీస్‌ విజయానికి 55 పరుగులు అవసరమైన స్థితిలో బుమ్రా బౌలింగ్‌లో టేలర్‌ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో పుజారా వదిలేశాడు. తర్వాత బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కోటా ఓవర్లు 6 మిగిలుండగానే కివీస్‌ విజయాన్నందుకుంది.

మళ్లీ అతడే: అంతకుముందు ఆరో రోజు ఉదయం 64/2తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌.. ఇంకో 106 పరుగులే జోడించి 8 వికెట్లు కోల్పోయింది. ఒక దశలో భారత్‌ పరిస్థితి చూస్తే కివీస్‌ ముందు 100 లక్ష్యమైనా నిలుస్తుందా అనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో భారత్‌ పతనాన్ని శాసించిన జేమీసన్‌ మరోసారి గట్టి దెబ్బ తీశాడు. అతడి ధాటికి టీమ్‌ఇండియా 109/5కు చేరుకుంది. ముందు రోజు సాయంత్రం పట్టుదలతో క్రీజులో నిలిచిన పుజారా (ఓవర్‌నైట్‌ 12), కోహ్లి (ఓవర్‌నైట్‌ 8).. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. వీళ్లిద్దరినీ జేమీసన్‌ స్వల్ప వ్యవధిలో పెవియలిన్‌ చేర్చాడు. ఈ దశలో పంత్‌.. రహానె, జడేజా (16)లతో కలిసి పోరాడాడు. వీరితో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే జడేజా ఔటైపోయాక.. పంత్‌ కూడా ఎక్కువసేపు నిలవలేదు. భారీ షాట్‌ ఆడబోయి అతను వెనుదిరగడంతో భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది. అతను ఔటయ్యాక ఇంకో 14 పరుగులకే ఇన్నింగ్స్‌కు తెరపడింది. చివర్లో షమి మూడు ఫోర్లు కొట్టి కాస్త స్కోరు పెంచాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 217; న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 249

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ ఎల్బీ (బి) సౌథీ 30; గిల్‌ ఎల్బీ (బి) సౌథీ 8; పుజారా (సి) టేలర్‌ (బి) జేమీసన్‌ 15; కోహ్లి (సి) వాట్లింగ్‌ (బి) జేమీసన్‌ 13; రహానె (సి) వాట్లింగ్‌ (బి) బౌల్ట్‌ 15; పంత్‌ (సి) నికోల్స్‌ (బి) బౌల్ట్‌ 41; జడేజా (సి) వాట్లింగ్‌ (బి) వాగ్నర్‌ 16; అశ్విన్‌ (సి) టేలర్‌ (బి) బౌల్ట్‌ 7; షమి (సి) లేథమ్‌ (బి) సౌథీ 13; ఇషాంత్‌ నాటౌట్‌ 1; బుమ్రా (సి) లేథమ్‌ (బి) సౌథీ 0; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (73 ఓవర్లలో ఆలౌట్‌) 170; వికెట్ల పతనం: 1-24, 2-51, 3-71, 4-72, 5-109, 6-142, 7-156, 8-156, 9-170; బౌలింగ్‌: సౌథీ 19-4-48-4; బౌల్ట్‌ 15-2-39-3; జేమీసన్‌ 24-10-30-2; వాగ్నర్‌ 15-2-44-1

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లేథమ్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అశ్విన్‌ 9; కాన్వే ఎల్బీ (బి) అశ్విన్‌ 19; విలియమ్సన్‌ నాటౌట్‌ 52; టేలర్‌ నాటౌట్‌ 47; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (45.5 ఓవర్లలో 2 వికెట్లకు) 140; వికెట్ల పతనం: 1-33, 2-44; బౌలింగ్‌: ఇషాంత్‌ 6.2-2-21-0; షమి 10.5-3-31-0; బుమ్రా 10.4-2-35-0; అశ్విన్‌ 10-5-17-2; జడేజా 8-1-25-0
 

మళ్లీ నిరాశే..

టీమ్‌ఇండియా కెప్టెన్‌ కోహ్లీకి మరోసారి నిరాశ తప్పలేదు. సారథిగా ఐసీసీ ట్రోఫీని ఖాతాలో వేసుకుందామనుకున్న అతనికి ఆశాభంగమే ఎదురైంది. అండర్‌-19లో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన అతను.. సీనియర్‌ స్థాయిలో విఫలమవుతున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో అతని సారథ్యంలో సెమీస్‌ వరకూ వచ్చిన జట్టు.. కివీస్‌ చేతిలోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ అదే జట్టు చేతిలో ఓటమి ఎదురైంది.

వేలు విరిగినా వాట్లింగ్‌ కీపింగ్‌

చివరి టెస్టు మ్యాచ్‌ ఆడిన కివీస్‌ వికెట్‌ కీపర్‌ వాట్లింగ్‌ పోరాటస్ఫూర్తి కనబరిచాడు. బుధవారం మొదటి సెషల్లో విలియమ్సన్‌ త్రోను అందుకునే ప్రయత్నంలో వాట్లింగ్‌ కుడి ఉంగరం వేలు విరిగింది. ‘‘మొదటి సెషన్‌లో వాట్లింగ్‌ ఉంగరం వేలు స్థానభ్రంశం చెందింది. లంచ్‌ విరామంలో వైద్యం చేయించుకున్న అనంతరం అతను మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు’’ అని న్యూజిలాండ్‌ క్రికెట్‌ తెలిపింది.

71

డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు. 14 మ్యాచ్‌ల్లో అతను 71 వికెట్లు పడగొట్టాడు.

1675

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్స్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా ఆస్ట్రేలియా ఆటగాడు లబుషేన్‌ నిలిచాడు. 13 మ్యాచ్‌ల్లో అతను 1675 పరుగులు చేశాడు. భారత్‌ తరపున రహానె (1159) ఎక్కువ పరుగులు చేశాడు.

విలియమ్సన్‌, అతని జట్టుకు అభినందనలు. గొప్ప నిలకడ ప్రదర్శించిన వాళ్లు.. హృదయం పెట్టి ఆడి ఫలితం రాబట్టారు. మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. వాళ్లు ఈ విజయానికి అర్హులు. తొలి రోజు వర్షంతో తుడిచిపెట్టుకు పోవడంతో పరిస్థితులు మాకు ప్రతికూలంగా మారాయి. తొలి ఇన్నింగ్స్‌లో అంతరాయం కలగకుంటే మరిన్ని పరుగులు చేసేవాళ్లం. రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 30 పరుగులు తక్కువగా చేశాం. నలుగురు ఫాస్ట్‌బౌలర్లతో ఆడాలంటే ఓ పేస్‌ ఆల్‌రౌండర్‌ ఉండాలి. మా బౌలింగ్‌ విభాగంపై నమ్మకంతో ఉన్నాం. అందుకే ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగాం.

- కోహ్లి

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని