IPL 2021 Corona: ఐపీఎల్‌పై మళ్లీ కరోనా పడగ

భారత్‌లో కరోనా మహమ్మారి ధాటికి అర్ధంతరంగా ఆగిపోయి, ఇటీవలే యూఏఈలో పునఃప్రారంభమైన ఐపీఎల్‌కు.. అక్కడా వైరస్‌ దెబ్బ తప్పలేదు. లీగ్‌ మొదలైన మూడు రోజులకే

Updated : 23 Sep 2021 07:05 IST

నటరాజన్‌కు పాజిటివ్‌

ఐసోలేషన్‌కు శంకర్‌, మరో అయిదుగురు

దుబాయ్‌

భారత్‌లో కరోనా మహమ్మారి ధాటికి అర్ధంతరంగా ఆగిపోయి, ఇటీవలే యూఏఈలో పునఃప్రారంభమైన ఐపీఎల్‌కు.. అక్కడా వైరస్‌ దెబ్బ తప్పలేదు. లీగ్‌ మొదలైన మూడు రోజులకే అక్కడ ఓ ఆటగాడు కొవిడ్‌-19 బారిన పడటం కలకలం రేపింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫాస్ట్‌బౌలర్‌ నటరాజన్‌ కరోనా పాజిటివ్‌గా తేలాడు. దీంతో వెంటనే అతణ్ని ఐసోలేషన్‌కు పంపారు. నటరాజన్‌తో గత కొన్ని రోజుల్లో సన్నిహితంగా మెలిగిన ఆరుగురికి పరీక్షలు నిర్వహించగా.. వాళ్లందరికీ నెగెటివ్‌ రావడం ఊరటనిచ్చే విషయం. నటరాజన్‌ కరోనా బారిన పడ్డప్పటికీ బుధవారం సన్‌రైజర్స్‌-దిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ను యధావిధిగా కొనసాగించారు. ‘‘నటరాజన్‌కు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. జట్టు నుంచి అతణ్ని దూరంగా పెట్టారు.   అతడికి లక్షణాలేమీ కనిపించడం లేదు. నటరాజన్‌తో సన్నిహితంగా ఉన్న అందరికీ బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు పరీక్షలు నిర్వహించాం. అందరికీ నెగెటివ్‌ వచ్చింది. కాబట్టి మ్యాచ్‌ను యధావిధిగా జరపాలని నిర్ణయించాం’’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. నటరాజన్‌తో సన్నిహితంగా ఉన్న వాళ్లలో అతడి సొంత రాష్ట్రం తమిళనాడుకు చెందిన విజయ్‌ శంకర్‌తో పాటు సన్‌రైజర్స్‌ జట్టు మేనేజర్‌ విజయ్‌ కుమార్‌, ఫిజియో శ్యామ్‌ సుందర్‌, వైద్యురాలు అంజన, లాజిస్టిక్స్‌ మేనేజర్‌ తుషార్‌ ఖేద్కర్‌, నెట్‌ బౌలర్‌ పెరియస్వామి ఉన్నట్లు తెలిసింది.

11 రోజుల తర్వాత..: భారత్‌ నుంచి యూఏఈ చేరుకున్న 11 రోజుల తర్వాత నటరాజన్‌కు కరోనా సోకినట్లు తేలడం ఆందోళన రేకెత్తిస్తున్న విషయం. యూఏఈలో అడుగు పెట్టి ఒకట్రెండు రోజుల్లోపు అతను పాజిటివ్‌గా తేలి ఉంటే భారత్‌లో లేదా ప్రయాణ సమయంలో అతడికి వైరస్‌ సోకినట్లు భావించేవారు. కానీ బయో బబుల్‌లో అడుగు పెట్టిన పది రోజుల తర్వాత పాజిటివ్‌గా తేలడంతో బుడగ అంత సురక్షితంగా లేదని అర్థమవుతోంది. బబుల్‌ లోపల ఒకసారి వైరస్‌ బయటపడితే.. అదుపు చేయడం కష్టమవుతుంది. తొలి అంచె ఐపీఎల్‌ రద్దవడానికి అదే కారణం. మరి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. ఐపీఎల్‌ నియమావళి ప్రకారం నటరాజన్‌ పది రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండి, రెండుసార్లు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చాక జట్టు బబుల్‌లోకి రావాల్సి ఉంటుంది. 30 ఏళ్ల నటరాజన్‌ గాయం కారణంగా ఐపీఎల్‌ తొలి అంచెకు పూర్తిగా దూరమయ్యాడు. ఇటీవలే కోలుకుని జట్టుతో కలిసి అతణ్ని ఇప్పుడు కొవిడ్‌ దెబ్బ కొట్టింది. రెండో అంచెకు బెయిర్‌స్టో సేవల్ని కోల్పోయిన సన్‌రైజర్స్‌కు ఇది మరో ఎదురు దెబ్బే. ఐపీఎల్‌ తొలి అంచెలో సన్‌రైజర్స్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహా కరోనా బారిన పడటం తెలిసిందే. మొదట కోల్‌కతా ఆటగాడు వరుణ్‌ చక్రవర్తి పాజిటివ్‌గా తేలగా, సాహాకు కూడా వైరస్‌ సోకినట్లు తేలగానే లీగ్‌ను ఆపేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని