తొలి సంపాదనతో ఏం చేశానంటే: రోహిత్‌

టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఉపసారథి రోహిత్‌ శర్మ పైకి కనిపించడు కానీ అతడిలో హాస్యం పాలు కాస్త ఎక్కువే! మీడియా సమావేశాల్లో విలేకరుల ప్రశ్నలకు అతడు పంచ్‌లు పేలుస్తున్నప్పుడు ఈ కోణం దర్శనమిస్తుంది....

Published : 04 Aug 2020 00:49 IST

విలేకరులకు తిరిగిచ్చే సమయం అదొక్కటే కదా మరి!

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఉపసారథి రోహిత్‌ శర్మ పైకి కనిపించడు కానీ అతడిలో హాస్యం పాలు కాస్త ఎక్కువే! మీడియా సమావేశాల్లో విలేకరుల ప్రశ్నలకు అతడు పంచ్‌లు పేలుస్తున్నప్పుడు ఈ కోణం దర్శనమిస్తుంది.

ప్రస్తుతం మ్యాచులు లేకపోవడంతో రోహిత్‌ సోషల్‌ మీడియాలో అభిమానులను అలరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ గంటపాటు వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఓ అభిమాని హిట్‌మ్యాన్‌ హాస్య చతురతపై ‘మీడియా సమావేశాల్లో మీకంత హాస్యం ఎలా వస్తుంది’ అని ప్రశ్నించాడు. అందుకు రోహిత్‌ చిలిపిగా సమాధానం ఇచ్చాడు. ‘ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లను నేను ఆస్వాదిస్తాను. ఎందుకంటే విలేకరులకు తిరిగిచ్చే సమయం అదొక్కటే కదా మరి’ అని అన్నాడు.

 ముందుతరం బౌలర్లలో గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ అంటే తనకు ఇష్టమని రోహిత్‌ చెప్పాడు. 2019 ప్రపంచకప్‌లో చేసిన ఐదు శతకాల్లో దక్షిణాఫ్రికాపై చేసిన 122 పరుగుల ఇన్నింగ్స్‌ అంటే మక్కువ అన్నాడు. భిన్నమైన వాతావరణంలో ప్రమాదకరమైన బౌలింగ్‌ ఎదుర్కొన్నానని తెలిపాడు. తనకు మొదట పేచెక్‌ రాలేదని సమీపంలోని సొసైటీ తరఫున మ్యాచ్‌ ఆడితే రూ.50 ఇచ్చారని వెల్లడించాడు. అందరిలాగే తానూ ఆ రూ.50తో రహదారి పక్కన స్నేహితులతో కలిసి వడాపావ్‌ తిన్నానని పేర్కొన్నాడు. సచిన్‌ తెందూల్కర్‌పై రాసిన ‘ది మేకింగ్‌ ఆఫ్‌ ఏ క్రికెటర్‌’ తన జీవితాన్ని మలుపు తిప్పిందని హిట్‌మ్యాన్‌ గుర్తుచేసుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని