Andre Russell: ‘జాతీయ జట్టుకు ఆడమని ఎవరిని అడుక్కోం’..విండీస్‌ కోచ్‌; రసెల్‌ సైలెంట్‌ పంచ్‌

దిగ్గజాల నిష్క్రమణ తర్వతా విండీస్‌ జట్టు బలహీనపడుతూ వచ్చింది

Published : 13 Aug 2022 17:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్: దిగ్గజాల నిష్క్రమణ తర్వాత విండీస్‌ క్రికెట్‌ జట్టు బలహీనపడుతూ వచ్చింది. అయితే, టీ20 ఫార్మాట్‌లో మాత్రం చెలరేగి రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఫార్మాట్‌లోనైనా విండీస్‌ ఆటగాళ్లు అభిమానులను అలరిస్తారనుకుంటే... ఒక్కొక్కరుగా లాభదాయకమైన లీగ్‌లు ఆడేందుకు జాతీయజట్టుకు అందుబాటులో ఉండటంలేదు.  విండీస్‌ క్రికెట్‌ బోర్డు సైతం ఆటగాళ్లకు వేతనాలు సరిగా ఇవ్వట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సునీల్‌ నరైన్‌, ఆండ్రీ రసెల్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్ల ఎక్కడ ఫ్రాంచైజీ లీగ్‌లు జరిగితే అక్కడ వాలిపోతున్నారు. భారత టీ20 లీగ్‌తో పాటు, టీ10, పాక్‌ ప్రిమియర్‌ లీగ్‌, శ్రీలంక లీగ్‌ ఏ టోర్నీ అయినా సరే ఆడేస్తున్నారు. మరోవైపు విండీస్‌ వరుస వైఫల్యాలు చవిచూస్తోంది. జట్టులో సీనియర్లు లేని లోటు స్పష్టంగా కనబడుతోంది. 

ఈ క్రమంలోనే నరైన్‌, ఆండ్రీ రసెల్‌ను ఉద్దేశించి విండీస్‌​ కోచ్‌ ఫిల్‌ సిమ్మన్స్‌  ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ‘కీలక ఆటగాళ్లకు విండీస్‌జట్టుకు దూరం కావడం నన్ను బాధించింది. కానీ, జాతీయజట్టుకు ఆడమని మేము ఆటగాళ్లని  అడుక్కోవాలని అనుకోవట్లేదు. రాబోయే టీ20 ప్రపంచ‌కప్‌ కోసం అత్యుత్తమ ప్లేయర్లను బరిలోకి దించడానికి బోర్డు తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే, క్రికెటర్లు డబ్బు కోసం దేశాన్ని కాదని ఫ్రాంచైజీ లీగ్‌‌‌లకే మొగ్గు చూపుతున్నారు’అని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై  ఆండ్రీ రసెల్‌  స్పందించాడు. ఫిల్‌ సిమ్మన్స్‌ ఆర్టికల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ''ఇలాంటిది వస్తుందని నేను ముందే ఊహించాను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సైలెంట్‌గా ఉండడమే మేలు.'' అంటూ రసెల్‌ చేసిన కామెంట్‌ వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని