Ashwin: లైన్‌ అండ్‌ లెంగ్త్‌ మాత్రమే సరిపోదు.. వీడియో ఎనలిస్ట్‌ల వల్లే కఠిన సవాళ్లకు సిద్ధమవుతా: అశ్విన్‌

తన వందో టెస్టు మ్యాచ్‌లో భారత సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ అదరగొట్టేశాడు. ఏకంగా 9 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.

Published : 11 Mar 2024 11:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో (IND vs ENG) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ రవిచంద్రన్ అశ్విన్. ఐదు మ్యాచుల్లో 156 ఓవర్లు వేసిన అశ్విన్‌ 26 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండుసార్లు 5 వికెట్ల ప్రదర్శన ఉండటం విశేషం. ఈ భారత బౌలర్‌ను ఎదుర్కోవడం ఇంగ్లిష్‌ బ్యాటర్లకు కష్టంగా మారింది. ఐదో టెస్టు సందర్భంగా జో రూట్..  ‘‘అశ్విన్‌తోనే ఓ మాట చెబుతా. అతడు సంధించిన బంతులు ఒక్కోటి వైవిధ్యంగా ఉంటాయి. అంతకుముందు వేసిన బంతిలా కాకుండా కొత్తగా సంధిస్తాడు’’ అని వ్యాఖ్యానించాడు. దానిపై క్రికెట్ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ ఆసక్తికర కామెంట్లు చేశాడు. తాజాగా అశ్విన్‌  కూడా సన్నీ వ్యాఖ్యలపై స్పందించాడు. 

‘‘సన్నీ భాయ్‌.. వీడియో విశ్లేషకుల నుంచి మీరు తీసుకొనే ఫుటేజీని చూస్తే చాలాకాలం దానికోసమే గడిపినట్లు అనిపిస్తుంది. మీరు ఎన్నో టాప్‌ జట్లపై ఆడారు. మీ బ్యాటింగ్‌ను చూసి కొందరు బ్యాటర్లు తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటారు. ఎవరి స్టైల్‌ వారికున్నప్పటికీ.. టెక్నిక్‌పరంగా అంతా ఒకటే. ఇక బౌలర్లుగా మేం కూడా మంచి లెంగ్త్‌ కోసం వర్కౌట్ చేస్తాం. అద్భుతమైన బ్యాటర్లను ఔట్‌ చేయాలంటే కేవలం లైన్‌ అండ్ లెంగ్త్‌ మాత్రమే సరిపోదు. విభిన్నంగా బంతులను సంధించాల్సిన అవసరం ఉంది. అదృష్టం కొద్దీ నేను ఇలా ప్రయోగాలు చేసేవారి జాబితాలో ఉన్నా. దాని కోసం వీడియో ఫుటేజీలను తెప్పించుకుని ప్రాక్టీస్‌ చేసేవాడిని. అందుకే, నా బౌలింగ్‌ మెరుగ్గా కావడంలో వీడియో ఎనలిస్ట్‌ల పాత్ర కూడా కీలకమే’’ అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో మ్యాచ్ .. అశ్విన్‌ కెరీర్‌లో వందో టెస్టు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో అతడు 9 వికెట్లు పడగొట్టాడు.

అశ్విన్‌.. నీ కెరీర్‌కే హైలైట్‌: గావస్కర్

‘‘నిత్య విద్యార్థిగా ఉండటం నీ కెరీర్‌కే హైలైట్‌. ప్రతి మ్యాచ్‌ నుంచి పాఠాలు నేర్చుకుంటావు. వైవిధ్యమైన బౌలింగ్‌తో వికెట్లను తీయడంపై  దృష్టి పెట్టడం అభినందనీయం. విభిన్నమైన రన్నప్‌.. విభిన్నమైన బౌలింగ్‌ యాక్షన్‌ను చూసేందుకూ ఆసక్తికరంగా ఉంటుంది. స్పిన్‌ను సమర్థంగా అడ్డుకొనే బ్యాటర్లూ నీ బౌలింగ్‌లో మాత్రం ఇబ్బంది పడతారు. జో రూట్‌ నుంచి ఇలాంటి మాటలే మనం విన్నాం’’ అని సునీల్ గావస్కర్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని