Ashwin: ఆ గడ్డు రోజులను ఇప్పటికీ మరిచిపోలేను: రవిచంద్రన్ అశ్విన్‌

టీమ్‌ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) మరో అరుదైన ఘనత సాధించాడు. ఐదు వందల వికెట్ల మైలురాయిని అందుకొన్నాడు.

Published : 17 Feb 2024 04:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌ (Ravichandran Ashwin) అవతరించాడు. అనిల్ కుంబ్లే 619 వికెట్లతో అశ్విన్‌ కంటే ముందున్నాడు. అయితే, అత్యంత వేగంగా ఈ మైలురాయికి చేరుకున్న మొదటి భారత క్రికెటర్ అశ్వినే. అయితే, తన కెరీర్‌లోనూ చీకటి దశను దాటి వచ్చినట్లు అశ్విన్‌ వెల్లడించాడు. 2018, 2019లో జట్టు నుంచి వైదొలగాల్సి వచ్చిందని.. అప్పుడే తన కెరీర్‌ ముగిసిందనే భావనకు వచ్చినట్లు గుర్తు చేసుకున్నాడు.

‘‘జీవితంలో ఎత్తు పల్లాలు ఉండటం సహజం. నేను కెరీర్‌లో అట్టడుగుకు వెళ్లిన రోజులూ ఉన్నాయి. 2018-19 కాలంలో అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నా. అప్పటికే నేను ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచా. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా ఉన్నా. కానీ, ఒక్కసారిగా కిందకి పడిపోయా. అదే నా జీవితంలో చీకటి సమయం. కొంతకాలం నేను క్రికెట్‌కు దూరంగా ఉందామని భావించా. ఆటను ఆస్వాదించే స్థితిలో లేను. కానీ, ఎవరి వల్ల ఇలా జరిగిందని మాత్రం చెప్పలేను. నాకంటూ మంచి రోజులు వస్తాయని నమ్ముతా. నా కుటుంబం, భార్యతో మాట్లాడటం, మంచి సినిమాలు చూడటం, సమయానికి నిద్రపోవడం చేశా. 

ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలనే దానిపైనే ఆలోచిస్తూ ఉండేవాడిని. కానీ, ఆ గడ్డు రోజులను ఇప్పటికీ మరిచిపోలేను. అలా ఎందుకు జరిగిందో తెలియదు. అదే సమయంలో గాయపడటం కూడా ఇబ్బందిగా మారింది. ఇప్పుడు ఈ 500 వికెట్లు తీసిన తర్వాత.. ఇదంతా మామూలే అని చెప్పడం అబద్ధమే అవుతుంది. దీనికోసం చాలా కష్టపడ్డా. కరోనా మహమ్మారి సమయంలో జీవితంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నా. మళ్లీ తిరిగి ఆడాలని బలంగా కోరుకున్నా. ఆటపై ఆసక్తిని కోల్పోయిన పరిస్థితి నుంచి బయటపడ్డా. గత మూడేళ్ల నుంచి క్రికెట్‌ ఆడుతున్న తీరు కూడా మార్చేశా’’ అని అశ్విన్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని