Updated : 10 Jun 2021 15:12 IST

డింకో సింగ్‌.. ఈ పేరు గుర్తుపెట్టుకోండి!

కష్టాలపై పంచ్‌ విసిరిన భారత బాక్సింగ్‌ మార్గదర్శి

కొందరి జీవితాలు అంతే..! బతికినంత కాలం ఒడుదొడుకులే ఎదురవుతాయి. కాలం కఠిన పరీక్షలు పెడుతూనే ఉంటుంది. ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిస్తుంది. పేరు ప్రతిష్ఠలు వచ్చేస్తాయి. అంతలోనే విషాదం చుట్టు ముడుతుంది. కష్టాలెన్నొచ్చినా.. కన్నీళ్లు ఎన్ని ఉబికినా.. పరమార్థం తెలుసుకున్నవారు పనిపూర్తి చేసి దివిటీగా మారతారు. యువతకు ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి వ్యక్తే, బాక్సర్‌ ‘డింకో సింగ్‌’.


బాక్సింగ్‌ మార్గదర్శి

విజేందర్‌ సింగ్‌.. బాక్సింగ్‌లో భారత్‌కు తొలి ఒలింపిక్‌ పతకం అందించిన విజేత. మేరీకోమ్‌.. ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌. శివ థాపా, దేవేంద్రో సింగ్‌, పింకి జాంగ్ర, కవితా చాహల్‌, సతీశ్‌ కుమార్‌, మన్‌ప్రీత్‌ సింగ్‌, సుమిత్‌ సంగ్వాన్‌, మృణాల్‌ భోసలే, జరీన్‌ ఖాన్‌.. అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన బాక్సర్లు. దేశంలో ఇప్పుడు ఒలింపిక్స్‌కు అన్ని విభాగాల్లో పోటీపడగల బాక్సర్లు ఉన్నారు. పదుల సంఖ్యలో అర్హత సాధిస్తున్నారు.  ఆసియా, కామన్వెల్త్‌, ప్రపంచ బాక్సింగ్‌లో వరుసగా పతకాలు కొల్లగొడుతున్నారు. వీరందరికీ మార్గదర్శి ‘డింకో సింగ్‌’. ఆయనను ఆదర్శంగా తీసుకొనే మేరీకోమ్‌ అసాధ్యాలను సుసాధ్యం చేసింది. ‘మాగ్నిఫిసెంట్‌ మేరీ’గా కీర్తి పొందింది.


అనాథగా పెరిగారు

1990ల్లో భారత్‌లో బాక్సింగ్‌ను పట్టించుకొనే వారే కరవు. అలాంటి సంధిదశలో ఆవిర్భవించిన విజేత ‘డింకో సింగ్‌’. తన పంచ్‌లతో యువతను ఉర్రూతలు ఊగించాడు. 1998 ఆసియా క్రీడల్లో అతడు సాధించిన స్వర్ణ పతకం విలువ ఒలింపిక్స్‌కు ఏమాత్రం తక్కువ కాదు! 1979, జనవరి 1న మణిపూర్‌లో ఓ కుగ్రామంలో డింకోసింగ్‌ జన్మించాడు. బాల్యం నుంచీ కష్టాలతోనే సహచర్యం. తల్లిదండ్రులు చనిపోయాక అనాథ శరణాలయంలో పెరిగాడు. ప్రత్యేక ప్రాంతాల క్రీడా పథకం ద్వారా అతడిలో దాగున్న ప్రతిభ బయటకు వచ్చింది. శాయ్‌ ట్రైనర్‌, మేజర్‌ ఓపీ భాటియా అతడిని గుర్తించి శిక్షణ ఇప్పించారు. అందుకు తగ్గట్టే 1989లో అంబాలాలో జరిగిన సబ్‌ జూనియర్‌ జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అతడు విజేతగా నిలిచాడు. కోచ్‌లు, సెలక్టర్ల దృష్టిని తనపైకి మళ్లించాడు. అప్పుడతని వయసు కేవలం పదేళ్లు.


గమ్యం వైపు అడుగులు

జాతీయ పోటీల్లో డింకో సింగ్‌కు ఎదురులేకుండా పోయింది. కష్టాలు ఎన్ని ఎదురైనా అతడి లక్ష్యం మాత్రం చెక్కుచెదరలేదు. గమ్యం వైపు వడివడిగా అడుగులేశాడు. 1998లో బ్యాంకాక్‌ వేదికగా జరిగిన ఆసియా క్రీడలు అతడి కెరీర్‌తో పాటు భారత బాక్సింగ్‌ చరిత్రను మలుపుతిప్పాయి. 1997లో అతడు అంతర్జాతీయ బాక్సింగ్‌లో అరంగేట్రం చేశాడు. బ్యాంకాక్‌లో కింగ్స్‌కప్‌లో విజయ దుందుభి మోగించాడు. నిర్వాహకులు ఆ టోర్నీలోనే అత్యుత్తమ బాక్సర్‌గా అతడిని ఎంపిక చేశారు. ఆ తర్వాతి ఏడాది ఆసియా క్రీడలకు ఎంపికై సాధన చేయడం మొదలుపెట్టాడు. అంతలోనే అతడికి అనుకోని అవాంతరం ఎదురైంది. కొద్దిరోజుల ముందే బ్యాంకాక్‌ వెళ్లాల్సిన క్రీడా బృందంలోంచి అతడి పేరును తొలగించారు.


మోగించిన విజయ ఢంకా 

‘డింకో సింగ్‌’ ఆశలు చెదిరిపోవడంతో మద్యానికి బానిస అయ్యాడు. సోయి తెలియకుండా పడిపోయేవాడు. బ్యాంకాక్‌ పంపకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. ఆ తర్వాత పేరును చేర్చగా.. అతడు అద్భుతమే చేశాడు. 54 కిలోల బాంటమ్‌వెయిట్‌ విభాగంలో ఒలింపిక్‌ పతక విజేతలను ఓడించి విజేతగా ఆవిర్భవించాడు.  టోర్నీకి ముందు అతడు 51కిలోల నుంచి 54కు మారడం గమనార్హం. అయినా, సెమీస్‌లో ప్రపంచ నం.3 వాంగ్‌ ప్రాజెస్‌ సొనటయ (థాయ్‌లాండ్‌)ను మట్టికరిపించి సంచలనం సృష్టించాడు. అతడి విజయాన్ని చూసి భారత్‌ పరవశించిపోయింది. ఏదో మాయాజాలం చేస్తాడని ఆశించింది. అందుకు తగ్గట్టే ఫైనల్లో ప్రపంచ నం.5 తైమూర్‌ తుల్యకోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)ను చిత్తు చేశాడు. నాలుగో రౌండ్లోనే ప్రత్యర్థి చేతెలెత్తేయడం గమనార్హం. అన్ని విభాగాల్లోనూ డింకో ఆధిపత్యం చెలాయించి స్వర్ణం ముద్దాడాడు. అదే ఏడాది అర్జున అందుకున్నాడు. 2000 ఒలింపిక్స్‌లో మాత్రం క్వార్టర్స్‌ దాటలేకపోయాడు.


క్యాన్సర్‌.. కరోనా..కామెర్లు

డింకో పోరాటం అక్కడితో ఆగిపోలేదు. కాలం పెట్టిన పరీక్షలనూ మళ్లీ ఎదుర్కోవాల్సి వచ్చింది. మిగతా బాక్సర్లకు భిన్నంగా ఇండియన్‌ నేవీలో చేరాడు. పేరు, డబ్బుల కోసం పాకులాడలేదు. శాయ్‌ కేంద్రంలో బాక్సింగ్‌ కోచ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2013లో పద్మశ్రీ అందకున్నాడు. ఇంతలోనే క్యాన్సర్‌ అతడిపై దాడి చేసింది. గత రెండేళ్లుగా ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. కరోనాతో గతేడాది లాక్‌డౌన్‌ పెట్టినప్పుడు రేడియేషన్‌ థెరపీ ఆగిపోయి ఇబ్బంది పడ్డారు. ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా దిల్లీకి తరలించి ఆయనకు చికిత్స అందించాల్సి వచ్చింది. క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆయనకు చాలా సహాయం చేశారు. అక్కడ్నుంచి మణిపూర్‌కు  తిరిగొచ్చేటప్పుడు కొవిడ్‌-19 సోకింది. నెల రోజులకు పైగా ఆస్పత్రిలో చికిత్స పొందారు. అప్పుడే కామెర్లు రావడంతో క్యాన్సర్‌ చికిత్స సజావుగా సాగలేదు.  42 ఏళ్ల వయసులో గురువారం (2021, జూన్‌ 10) ఆయన కన్నుమూశారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని