Rishabh Pant: అలా చేయొద్దు.. డగౌట్‌లో పంత్‌ జెర్సీని వేలాడదీయడంపై బీసీసీఐ అసంతృప్తి..!

దిల్లీ(Delhi Capitals) ఆడిన మొదటి మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌(Rishabh Pant) జెర్సీని డగౌట్‌లో ప్రదర్శించడంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమచారం. భవిష్యత్‌లో ఇలాంటివి చేయకూడదని ఆ జట్టును సున్నితంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Updated : 04 Apr 2023 12:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) కోలుకుంటున్న విషయం తెలిసిందే.  దీంతో ఐపీఎల్‌ (IPL)లో దిల్లీ(Delhi Capitals)కి కెప్టెన్‌ బాధ్యతలను పంత్‌ నుంచి  డేవిడ్‌ వార్నర్‌(david warner)కు తాత్కాలికంగా బదిలీ చేశారు.  అయితే గాయాల కారణంగా ఐపీఎల్‌కు దూరమైన పంత్‌ను మ్యాచ్‌లు చూసేందుకు డగౌట్‌కి తీసుకొస్తామని ఆ జట్టు యాజమాన్యం తెలిపింది. ఈ నేపథ్యంలో  లఖ్‌నవూతో ఆడిన తొలి మ్యాచ్‌లో అతడి జెర్సీ నం.17ను డగౌట్‌లో ప్రదర్శించింది. అయితే.. ఈ విషయంపై బీసీసీఐ(BCCI) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

జట్టు సభ్యుల్లో ఉత్సాహం నింపేందుకు..  పంత్‌ తమతోనే ఉన్నాడని చెప్పేందుకు తొలి మ్యాచ్‌ సందర్భంగా అతడి జెర్సీని డగౌట్‌లో వేలాడదీశారు. ఈ చర్యపై బీసీసీఐ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘ఇది చాలా తీవ్రమైన చర్య. ఇలాంటివి అంతిమ విషాదం లేదా రిటైర్మెంట్‌ సందర్భంలోనే చేస్తారు. ఇక్కడ పంత్‌ బాగున్నాడు. అందరూ ఊహించినదానికంటే వేగంగా కోలుకుంటున్నాడు. మంచి ఉద్దేశంతోనే వారు అలా చేసినప్పటికీ.. భవిష్యత్‌లో వాటిని పునరావృతం చేయవద్దు’ అని బీసీసీఐ సున్నితంగా చెప్పినట్లు ఓ ఐపీఎల్‌ ప్రతినిధి తెలిపారు. పంత్‌ జెర్సీని ప్రదర్శించాలనే నిర్ణయం జట్టు హెడ్‌ కోచ్‌ పాంటింగ్‌దని తెలుస్తోంది.

మరోవైపు దిల్లీ ఆడే తదుపరి మ్యాచ్‌కు పంత్‌ను స్వయంగా డగౌట్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హోమ్‌గ్రౌండ్‌లో గుజరాత్‌తో జరిగే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అతడు రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ భద్రతా, అవినీతి నిరోధక విభాగం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ‘దిల్లీ జట్టులో పంత్‌ ఎప్పుడూ భాగమే. మంగళవారం గుజరాత్‌తో మ్యాచ్‌ను అతడు డగౌట్‌ నుంచి వీక్షించేందుకు అవకాశాలు ఉన్నాయి. బీసీసీఐ అనుమతిస్తే అతడు డగౌట్‌లో భాగమవుతాడు’ అని ఐపీఎల్‌ ప్రతినిధి తెలిపారు.

గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్‌ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ కారణంగా అతడు పలు సిరీస్‌లతో పాటు ఐపీఎల్‌కూ దూరమయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని