CWG 2022: కొవిడ్‌ అని తేలినా ఫైనల్‌ మ్యాచ్‌ ఆడిన ఆసీస్‌ స్టార్‌..ఎలా!

కామన్వెల్త్‌ గేమ్స్‌ మహిళల క్రికెట్‌ ఫైనల్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 

Published : 09 Aug 2022 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌ మహిళల క్రికెట్‌ ఫైనల్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అసలే మెగా ఈవెంట్..ఆపై ఫైనల్‌ మ్యాచ్‌.ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. కానీ ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ తహ్లియా మెక్‌గ్రాత్ ఏకంగా కొవిడ్‌ పాజిటవ్‌ సోకినా మ్యాచ్‌ ఆడేసింది. క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి. ఇలా ఒక క్రికెటర్‌కి  కొవిడ్‌ అని తెలిసి మ్యాచ్‌ ఆడించడం. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా..! మ్యాచ్‌ రోజు ఉదయం నిర్వహించిన కొవిడ్‌19 పరీక్షలో  మెక్‌గ్రాత్‌కు పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆమె మ్యాచ్‌కు దూరం అవుతుందని అంతా భావించారు. అయితే, పెద్దగా కొవిడ్‌ లక్షణాలు లేకపోవడంతో మెక్‌గ్రాత్‌ ఫైనల్‌లో ఆడేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఐసీసీ అనుమతి కోరింది. మెక్‌గ్రాత్‌ను తుది జట్టులో ఆడించాలా? వద్దా? అనే విషయంపై మ్యాచ్‌ రిఫరీ, అధికారులు తీవ్ర చర్చలు  జరిపారు. దీంతో టాస్ దాదాపు 12 నిమిషాలు ఆలస్యమైంది.

అయితే, చివరకు వారి నుంచి కొన్ని ప్రత్యేక నిబంధనలతో కూడిన అనుమతి రావడంతో మెక్‌గ్రాత్‌ మ్యాచ్‌ ఆడింది. మ్యాచ్‌ ప్రారంభ సమయంలో జట్టు సభ్యులు జాతీయగీతం ఆలపించినప్పుడు ఆమె వారికి దూరంగా ఉంది. ఆ తరవాత ఆసీస్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు డగౌట్‌లో సహచర ఆటగాళ్లతో కూర్చోకుండా ఒంటరిగా మాస్క్‌ వేసుకొని వేరే దగ్గర కూర్చొంది. ఇక 2 వికెట్లు పడిన అనంతరం బ్యాటింగ్‌ కూడా చేసింది. అయితే, ఈ సమయంలో ఆమె మాస్క్ ధరించలేదు. నాలుగు బంతుల్లో రెండు పరుగులు చేసి, రాధా యాదవ్ డైవింగ్ క్యాచ్‌కు బ్యాక్‌వర్డ్ పాయింట్ వద్ద ఔటయ్యంది. రెండు ఓవర్లు బౌలింగ్‌ కూడా చేసింది. ఇక ఫీల్డీంగ్‌లో షపాలీవర్మ క్యాచ్‌ను అందుకొంది. అయితే, ఈ సమయంలో సహచర ఆటగాళ్లతో కలిసి ఆమె సంబరాలు చేసుకోలేదు. క్లినికల్ స్టాఫ్ కామన్వెల్త్ గేమ్స్‌ ఫెడరేషన్  మ్యాచ్ అధికారులతో సంప్రదించినట్లు ఆసీస్‌ బోర్డు చెప్పినప్పటికీ, నెటిజన్లు ఈ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఆటగాళ్ల భద్రతను పట్టించుకోకుండా కొవిడ్‌తో మ్యాచ్‌ ఎలా ఆడిస్తారని విమర్శిస్తున్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని