Achinta Sheuli: అచింత స్వర్ణం సాధించాడు.. ఇక సినిమా చూస్తాడేమో..!

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు పతకాల పంట కొనసాగుతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో పురుషుల 73 కేజీల విభాగంలో 20ఏళ్ల అచింత షూలి పసిడి పతకం సాధించాడు. దీంతో భారత్‌ ఖాతాలో

Updated : 17 Aug 2022 16:04 IST

వెయిట్‌లిఫ్టర్ షూలికి ప్రధాని మోదీ ప్రశంసలు

దిల్లీ: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు పతకాల పంట కొనసాగుతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో పురుషుల 73 కేజీల విభాగంలో 20ఏళ్ల అచింత షూలి పసిడి పతకం సాధించాడు. దీంతో భారత్‌ ఖాతాలో మూడో స్వర్ణం చేరింది. ఈ సందర్భంగా అచింతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా అతడిని అభినందిస్తున్నారు. ‘‘అచింత షూలి తన పతకంతో ఈ దేశం గర్వపడేలా చేశాడు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో మన త్రివర్ణ పతాకాన్ని మరింత ఎత్తుకు ఎగరేశాడు. ఒక ప్రయత్నంలో విఫలమైనా.. ఒత్తిడిని అధిగమించి సత్తా చాటాడు. నువ్వో ఛాంపియన్‌. చరిత్ర సృష్టించావ్‌’’ అని రాష్ట్రపతి ముర్ము అభినందించారు.

కామన్వెల్త్‌ గేమ్స్‌లో అచింత స్వర్ణం సాధించడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘‘ఎలాంటి పరిస్థితుల్లో అయినా అచింత చాలా శాంతంగా ఉంటాడు. ఈ పతకం కోసం అతడు ఎంతగానో కష్టపడ్డాడు. భారత ఆటగాళ్ల బృందం కామన్వెల్త్‌ క్రీడలకు వెళ్లే ముందు నేను వారందరితో మాట్లాడాను. తనకు తల్లి, అన్నయ్య సహకారం చాలా ఉందని అచింత నాతో చెప్పాడు. పతకం సాధించాడు కాబట్టి, ఇక అతడు సినిమా చూసేందుకు సయమం దొరుకుతుందని ఆశిస్తున్నా. భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలి’’ అని మోదీ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా కామన్వెల్త్‌కు ముందు అచింతతో మాట్లాడిన వీడియోను కూడా ప్రధాని పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో మోదీ.. అచింతను సినిమాలు చూస్తావా అని ప్రశ్నించగా.. తనకు సమయం దొరకట్లేదని చెప్పాడు. అటు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అచింతను కొనియాడారు.

ఈ పతకం మా అన్నకు అంకితం: అచింత

పతకం సాధించిన అనంతరం అచింత మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘‘ఇదంత సులభంగా రాలేదు. రెండో ప్రయత్నంలో నేను సరైన బరువు ఎత్తలేక విఫలమయ్యా. ఆ తర్వాత పోటీ మరింత కఠినంగా మారింది. అయితే, నా కోచ్‌ నన్ను ప్రోత్సహించారు. నా శాయశక్తులా ప్రయత్నించి సాధించా. ఈ పతకం సాధించడం వెనుక నా తల్లి, సోదరుడి కృషి ఎంతగానో ఉంది. మా అన్నయ్య నాకు ఎల్లప్పుడూ అండగా ఉన్నాడు. ఈ స్వర్ణం అతడికే అంకితం’’ అని అచింత చెప్పుకొచ్చాడు.

పురుషుల 73 కేజీల విభాగంలో అచింత పసిడి పతకం సాధించాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగిసిన ఈ పోటీలో బెంగాల్‌ లిఫ్టర్‌.. మొత్తం 313 కేజీలు ఎత్తి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. దీంతో భారత్‌ ఖాతాలో మూడో పసిడి చేరింది. ఈ పోటీల్లో ఇప్పటి వరకు మన దేశానికి ఆరు పతకాలు రాగా.. అందులో మూడు స్వర్ణ, రెండు రజత, ఒక కాంస్య పతకాలున్నాయి.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు