Dwayne Bravo: పొట్టి క్రికెట్‌లో ‘600 వికెట్లు’ తీసిన ఒకే ఒక్కడు

వెస్టిండీస్ మాజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో పొట్టి క్రికెట్‌లో అతిగొప్ప రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకాని ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు...

Updated : 12 Aug 2022 11:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెస్టిండీస్ మాజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో పొట్టి క్రికెట్‌లో అతిగొప్ప రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యంకాని ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో ఏకంగా 600 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. బ్రావో గతేడాది టీ20 ప్రపంచకప్‌ సమయంలో విండీస్‌ జట్టుకు రిటైర్మెంట్‌ ప్రకటించగా.. తర్వాత కూడా వివిధ లీగుల్లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు ‘ది హండ్రెడ్‌’ లీగ్‌లోనూ ఆడుతున్నాడు.

అక్కడ నార్తన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్న బ్రావో గతరాత్రి ఓవల్‌ ఇన్విజిబుల్స్‌ జట్టుతో తలపడిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి ఈ రికార్డు నెలకొల్పాడు. తొలుత రిలీ రొస్సౌ(48)ను ఎల్బీడబ్ల్యూగా ఔట్‌ చేసిన అతడు తర్వాత సామ్‌కరన్‌ (60)ను కూడా బౌల్డ్‌ చేశాడు. దీంతో పొట్టి క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. బ్రావో తర్వాత ఈ జాబితాలో అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఉన్నాడు. అతడు మొత్తం 339 మ్యాచ్‌ల్లో 466 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 2006లో న్యూజిలాండ్‌పై తొలి టీ20 మ్యాచ్‌ ఆడిన ఈ విండీస్‌ మాజీ క్రికెటర్‌ మొత్తం 91 అంతర్జాతీయ టీ20ల్లో 78 వికెట్లు తీశాడు. మిగతా 522 వికెట్లు వివిధ లీగుల్లో తీసినవే. మరోవైపు భారత టీ20 లీగ్‌లోనూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. మొత్తం 161 మ్యాచ్‌లు ఆడిన ఈ చెన్నై స్టార్‌ 183 వికెట్లు తీసి నంబర్‌ వన్‌ బౌలర్‌గా ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు