హద్దులు దాటారు.. ఉక్కు పిడికిలి బిగించాల్సిందే

సిడ్నీ మైదానంలో ఆటగాళ్లకు జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురవ్వడం ఇదేమి కొత్త కాదని, గతంలోనూ పలుసార్లు జరిగాయని టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ తెలిపాడు. భారత ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని...

Updated : 11 Jan 2021 04:08 IST

ఐసీసీ సీరియస్‌.. క్షమాపణలు చెప్పిన సీఏ

ఇంటర్నెట్‌డెస్క్: సిడ్నీ మైదానంలో ఆటగాళ్లకు జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురవ్వడం ఇదేమి కొత్త కాదని, గతంలోనూ పలుసార్లు జరిగాయని టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ తెలిపాడు. భారత ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని దూషించే వారిపై ఉక్కు పిడికిలి బిగించాలని అన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో యువ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌కు మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురైన సంగతి తెలిసిందే. ఈ అవాంఛనీయ సంఘటనపై నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం అశ్విన్‌ మీడియాతో మాట్లాడాడు. అలాంటి సంఘటనలు తమని ‘నిరాశ’కు గురిచేశాయని చెప్పడం చాలా చిన్న మాట అవుతుందని అన్నాడు.

‘‘నేను ఆస్ట్రేలియా పర్యటనకు రావడం ఇది నాలుగోసారి. ముఖ్యంగా సిడ్నీ వేదికగా గతంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. బౌండరీలైన్‌ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఎంతో మంది ఆటగాళ్లు వీక్షకుల వల్ల ఇబ్బందికి గురయ్యారు. ప్లేయర్లని కవ్వించేవారు, దూషించేవారు. దానికి ప్రతిచర్యగా కొందరు ఆటగాళ్లు కూడా సమాధానమిచ్చారు. అయితే ఈసారి కొందరు ప్రేక్షకులు హద్దులు దాటి జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని అశ్విన్‌ తెలిపాడు.

‘‘ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉక్కు పిడికిలి బిగించాలి. అడిలైడ్, మెల్‌బోర్న్‌ మైదానాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదు. కానీ సిడ్నీలో మాత్రం నిరంతరం జరుగుతూనే ఉంటాయి. వ్యక్తిగతంగా అనుభవించాను కూడా. వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. మేం ‘నిరాశ’కు గురయ్యామని చెప్పడం చాలా చిన్న పదం అవుతుంది. మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు నవ్వుతూ హేళన చేస్తుంటారు. వాటిని పట్టించుకోకుండా ఉండటం కోసం బౌండరీ లైన్‌ నుంచి పది మీటర్ల లోపు పీల్డింగ్ చేస్తుంటాం. అయితే అలాంటి సంఘటనలను సహించలేం’’ అని అశ్విన్ పేర్కొన్నాడు.

సిరాజ్‌, బుమ్రాపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని ఐసీసీకి టీమిండియా శనివారం ఫిర్యాదు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నాలుగో రోజు ఆటలోనూ సిరాజ్‌ను కొందరు ఆకతాయిలు దూషించారు. దీంతో ఆ విషయాన్ని అంపైర్లకు తెలియజేయడంతో మ్యాచ్‌ను పది నిమిషాల పాటు నిలిపివేసి.. ఆ ఆకతాయిల్ని బయటకు పంపారు. అయితే సిరాజ్‌ తమ వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పడంతో కెప్టెన్‌ రహానెతో కలిసి అంపైర్‌ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశామని అశ్విన్‌ పేర్కొన్నాడు. వెంటనే వాళ్లని స్టేడియం బయటకు పంపించడం కాస్త సంతోషాన్నిచ్చిందని అన్నాడు. ఆస్ట్రేలియా స్థానిక మీడియా ప్రకారం సెక్యూరిటీ సిబ్బంది అతిగా ప్రవర్తించిన పది మంది ప్రేక్షకులను స్టేడియం బయటకు పంపింది.

కాగా, జాత్యహంకార సంఘటనను ఐసీసీ తీవ్రంగా ఖండించింది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)ను వివరణ కోరింది. ఇలాంటి విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని స్పష్టం చేసింది. అయితే భారత ఆటగాళ్ల ఫిర్యాదుతో సీఏ బృందం, మైదాన సిబ్బంది వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొంది. కాగా, ఈ అవాంఛనీయ సంఘటనపై సీఏ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి

సిరాజ్‌పై మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలు

టీమ్‌ఇండియా గెలవాలంటే 309 కొట్టాలి.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని