Faf duplessis: దినేశ్‌ కార్తీక్‌ కోసం రిటైర్‌ ఔట్‌గా వెళదామనుకున్నా: డుప్లెసిస్

హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకానొక దశలో తాను రిటైర్‌ ఔట్‌గా వెనుదిరిగి.. దినేశ్‌ కార్తీక్‌కు అవకాశం ఇవ్వాలని భావించినట్లు బెంగళూరు కెప్టెన్‌ ఫా డుప్లెసిస్‌ పేర్కొన్నాడు...

Published : 09 May 2022 11:26 IST

ముంబయి: హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ దశలో తాను రిటైర్‌ ఔట్‌గా వెనుదిరిగి.. దినేశ్‌ కార్తీక్‌కు అవకాశం ఇవ్వాలని భావించినట్లు బెంగళూరు కెప్టెన్‌ ఫా డుప్లెసిస్‌ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ జట్టు 192/3 భారీ స్కోర్‌ చేసింది. కోహ్లీ (0) గోల్డన్‌ డకౌట్‌గా వెనుదిరిగినా.. డుప్లెసిస్‌ (73 నాటౌట్‌; 50 బంతుల్లో 8x4, 2x6), రజత్‌ పటిదార్‌ (48; 38 బంతుల్లో 4x4, 2x6) ఇన్నింగ్స్‌ చక్కబెట్టారు. రెండో వికెట్‌కు 105 పరుగుల శతక భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత మాక్స్‌వెల్‌ (33; 24 బంతుల్లో 3x4, 2x6) విలువైన పరుగులు చేసినా 19వ ఓవర్లో ఔటయ్యాడు. ఈ నేపథ్యంలోనే చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ (30 నాటౌట్‌; 8 బంతుల్లో 1x4, 4x6) మరోసారి ధనాధన్‌ బ్యాటింగ్‌ చేశాడు.

ముఖ్యంగా ఫారూఖీ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో వరుసగా మూడు సిక్స్‌లు, ఓ ఫోర్‌ బాది మొత్తం 25 పరుగులతో అదిరే ముగింపునిచ్చాడు. డీకే ప్రస్తుత సీజన్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉండగా ఇదివరకు కూడా ఇలాంటి షినిషింగ్‌ టచ్‌లే ఇచ్చాడు. దీంతో తాను బ్యాటింగ్‌ చేసేటప్పుడు అతడికి అవకాశం ఇవ్వాలనుకున్నట్లు డుప్లెసిస్‌ పేర్కొన్నాడు. ‘డీకే ఇలాగే సిక్సులు కొడుతూ బ్యాటింగ్‌ చేస్తుంటే వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలనుకుంటాం. నిజం చెప్పాలంటే నేను బ్యాటింగ్‌ చేసేటప్పుడు చాలా అలసిపోయా. దాంతో కార్తీక్‌ను క్రీజులోకి తీసుకురావాలనుకున్నా. అప్పుడు నేను రిటైర్‌ ఔట్‌గా వెనుదిరగాలనుకున్నా. అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లో అతడి క్యాచ్‌ వదిలేశారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దంచికొట్టాడు’ అని డుప్లెసిస్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని