WI vs IND: స్పిన్నర్ల మాయ.. ఇషాన్‌ దూకుడు.. తొలి వన్డేలో ఆసక్తికర వీడియోలు మీ కోసం!

విండీస్‌ పర్యటనలో (WI vs IND) సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ.. టీమ్‌ఇండియా మాత్రం విజేతగా నిలుస్తూ వస్తోంది. టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న ఉత్సాహంతో వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది.

Updated : 29 Jul 2023 17:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో (WI vs IND) భారత్ శుభారంభం చేసింది. విండీస్ నిర్దేశించిన 115 పరుగుల టార్గెట్‌ను ఐదు వికెట్లు కోల్పోయి 22.5 ఓవర్లలో ఛేదించింది. తొలుత బౌలింగ్‌లో కుల్‌దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా అదరగొట్టగా.. ఛేదనలో ఇషాన్ కిషన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి వన్డేకి సంబంధించిన ఆసక్తికర వీడియోల సమాహారం మీ కోసం..

తొలి వికెట్‌ అందించాడిలా.. 

టాస్‌ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు హర్దిక్‌ పాండ్య తొలి వికెట్‌ను అందించాడు. ఓపెనర్ కేల్‌ మేయర్స్‌ (2)కు షార్ట్‌పిచ్‌ బంతిని సంధించడంతో రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

ముకేశ్‌ డెబ్యూ వికెట్‌.. 

భారత్‌ తరఫున వన్డే అరంగేట్రం చేసిన ముకేశ్‌ కుమార్‌ ఖాతాలో తొలి వికెట్‌ పడింది. విండీస్ యువ బ్యాటర్ అలిక్ అథనేజ్‌ (22)ను ముకేశ్ ఔట్ చేశాడు. అద్భుతమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతిని కొట్టే క్రమంలో బ్యాక్‌వర్డ్ పాయింట్‌లోని రవీంద్ర జడేజాకు అలిక్‌ క్యాచ్‌ను సూపర్‌గా ఒడిసిపట్టాడు. 

హడలెత్తించిన కుల్‌దీప్‌ 

తొలి మూడు వికెట్లను భారత పేసర్లు పడగొట్టగా.. ఆ తర్వాత నుంచి స్పిన్నర్ల హవా మొదలైంది. మరీ ముఖ్యంగా కుల్‌దీప్‌ యాదవ్‌ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కీలకమైన షైహోప్‌, డొమినిక్‌ డ్రేక్స్‌ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టెయిలెండర్లు కారీ, సీల్స్‌ను ఔట్ చేశాడు. మూడు ఓవర్లు మాత్రమే వేసిన కుల్‌దీప్ ఆరు పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. 

జడ్డూ కాస్త ఎక్కువే.. కానీ

మంచి ఫామ్‌లో ఉన్న విండీస్ బ్యాటర్ హెట్‌మయేర్‌ను జడేజా ఔట్ చేసిన విధానం గుర్తుండిపోతుంది. మిడిల్‌ నుంచి లెగ్‌ వికెట్‌ మీదుగా వేసిన బంతిని కొట్టేందుకు ప్రయత్నించిన హెట్‌మయేర్‌ అంచనా తప్పాడు. దీంతో బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరాడు. రోవ్‌మన్‌ పావెల్ (4) స్లిప్‌లో ఉన్న గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. రొమారియో షెఫెర్డ్‌ (0) వికెట్‌ మాత్రం అదుర్స్‌. షాట్‌కొట్టే ప్రయత్నంలో బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకిన బంతిని సెకండ్‌ స్లిప్‌లో ఉన్న విరాట్ అద్భుతంగా ఒడిసిపట్టాడు. అయితే జడేజా 6 ఓవర్లే వేసి 37 పరుగులు సమర్పించడం గమనార్హం.

సూర్య ‘360’ సిక్స్‌

సీల్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌ రెండో బంతిని సూర్యకుమార్‌ యాదవ్‌ (19) సిక్స్‌గా మలిచాడు. ఐపీఎల్‌లో అద్భుత ఫామ్‌తో పరుగులు రాబట్టిన సూర్య.. విండీస్‌తో తొలి వన్డేలోనూ అదే తరహాలో బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలో లెగ్‌సైడ్‌ కొట్టిన సిక్స్‌ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది.

రోహిత్ ‘రివర్స్‌ స్వీప్’

ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ (12*) జట్టుకు విజయం చేకూర్చాడు. మరో పన్నెండు పరుగులు అవసరమైన క్రమంలో కారీ బౌలింగ్‌లో రివర్స్‌స్వీప్‌తో ఫోర్‌ రాబట్టాడు. మిడిల్‌ వికెట్‌ మీదుగా వచ్చిన బంతిని రివర్స్‌ స్వీప్‌ సాయంతో ఫీల్డర్ల మధ్యలో నుంచి బౌండరీకి పంపడం విశేషం.

పాండ్య రనౌట్‌..

టీమ్‌ఇండియా బ్యాటర్ హార్దిక్‌ పాండ్య రనౌట్‌ విచిత్రంగా జరిగింది. కారీ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌ షాట్‌ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే, బంతి బౌలర్‌ వైపే వెళ్లింది. ఈ క్రమంలో కారీ చేతిని తాకుతూ వెళ్లిన బంతి వికెట్ల వైపుగా వెళ్లింది. నాన్‌స్ట్రైకర్‌ హార్దిక్‌ బ్యాట్‌ను జారవిడవడంతో రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. 

విన్నింగ్‌ షాట్‌ ఇలా..

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మనే విన్నింగ్‌ షాట్‌ కొట్టాడు. అదీనూ స్వీప్‌ చేసినట్లు లెగ్‌సైడ్‌ లాగి మరీ బాదడం విశేషం. డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా ఆడి మరీ జట్టును గెలిపించాడు. విన్నింగ్‌ షాట్‌ వీడియోను మీరూ చూసేయండి..

ఇషాన్‌ ఇన్నింగ్స్‌ అదుర్స్‌

బౌలర్ల హవా కొనసాగిన తొలి వన్డేలో భారత బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ (52) ఇన్నింగ్‌ మాత్రం మ్యాచ్‌కే హైలైట్‌. స్వల్ప స్కోరుకే వికెట్లు పడుతున్నప్పటికీ ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా హాఫ్ సెంచరీ సాధించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని