Updated : 19 Jan 2022 00:21 IST

IND vs SA : అందరి కళ్లు విరాట్‌పైనే.. ఏం చేస్తాడో మరి.!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల భారత క్రికెట్లో చాలా మార్పులు జరిగాయి. హెడ్‌ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ బాధ్యతలు చేపట్టడం.. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడం.. చకచకా జరిగిపోయాయి. ద్రవిడ్‌ నేతృత్వంలో తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లిన టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పరాజయం పాలైంది. నేటి నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే కసితో ఉంది. కొత్త కోచ్‌, కొత్త నాయకత్వంతో.. 2023 వన్డే ప్రపంచకప్‌ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. మరి దక్షిణాఫ్రికా పర్యటనలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

ఏడేళ్ల తర్వాత ఇప్పుడే...

కెప్టెన్సీకి ముగింపు పలికి పూర్తి స్థాయి బ్యాటర్‌గా మారిన కోహ్లీ ఏ మేరకు రాణిస్తాడన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కోహ్లీ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగినా.. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్‌ చేసినా.. అందరి కళ్లు అతడిపైనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటుతో మునుపటి ఫామ్‌ను అందుకోవాల్సిన అవసరం ఉంది. చాలా రోజులుగా అందుకోలేకపోతున్న శతక దాహాన్ని.. ఈ సారైనా తీర్చుకుంటాడేమో చూడాలి. అంతే కాదు, యువ కెప్టెన్‌ అయిన కేఎల్‌ రాహుల్‌కి మైదానంలో సహకారం అందించాల్సి ఉంది. మొత్తం మీద క్రికెటర్‌గా కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభిస్తున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. యథావిధిగా మూడో స్థానంలోనే కోహ్లీ బ్యాటింగ్‌కు దిగుతాడు. దీంతో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ కోసం సూర్యకుమార్ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఇద్దరిలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. యువ వికెట్ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఐదో స్థానంలో ఆడే అవకాశం ఉంది. ఆరోస్థానంలో వెంకటేశ్ అయ్యర్‌ వన్డే జట్టులోకి అరంగేట్రం చేయనున్నాడు.  

ఇక గాయం కారణంగా దూరమైన రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్థానంలో.. కేఎల్ రాహుల్ జట్టుని నడిపించనున్నాడు. తనలోని నాయకుడిని నిరూపించుకోవడానికి రాహుల్‌కి ఇంతకు మించిన అవకాశం దొరక్కపోవచ్చు. మైదానంలో రాహుల్‌కి సహకారం అందించేందుకు అనుభవజ్ఞుడైన విరాట్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఎలాగూ ఉన్నారు. కాబట్టి టీమ్ఇండియా భవిష్యత్ దృష్ట్యా కెప్టెన్‌గా రాహుల్ సత్తా చాటాలని అభిమానులు ఆశిస్తున్నారు. సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌తో కలిసి రాహుల్ ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది.

ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు, ఇప్పటికే టీ20 జట్టులో స్థానం కోల్పోయిన శిఖర్‌ ధావన్‌.. ఈ సిరీస్‌లో రాణించాల్సిన అవసరం ఉంది. లేదంటే యువ ఆటగాళ్ల నుంచి ముప్పు తప్పకపోవచ్చు. మునుపటి ఫామ్‌ను అందుకుని జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు. సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, యుజువేంద్ర చాహల్‌లకు ఈ సిరీస్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. అశ్విన్‌ 2017లో చివరి సారిగా వన్డే క్రికెట్లో ఆడాడు. అప్పటి నుంచి వన్డే జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నాడు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్ పేస్‌ దళాన్ని నడిపంచనున్నారు. మూడో పేసర్‌ స్థానం కోసం.. దీపక్‌ చాహర్, శార్దూల్ ఠాకూర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ పోటీపడుతున్నారు. ఇదిలా ఉండగా టీమ్ఇండియా గత పర్యటన (2017-18)లో దక్షిణాఫ్రికాను 5-1 తేడాతో ఓడించింది. ప్రస్తుతం అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు.

ఆత్మ విశ్వాసంతో దక్షిణాఫ్రికా.. 

ఇటీవల 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. తెంబా బవుమా జట్టుని ముందుండి నడిపించనున్నాడు. ఇటీవల టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన క్వింటన్‌ డికాక్‌ ఓపెనింగ్ చేయనున్నాడు. టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన పొడగరి మార్కో జాన్సన్‌.. వన్డే సిరీస్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని చూస్తున్నాడు. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భాగంగా.. బోలాండ్ పార్క్‌ వేదికగా తొలి వన్డే బుధవారం (జనవరి 19న) ప్రారంభం కానుంది.

జట్ల వివరాలు.. 

భారత్ ‌: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), బుమ్రా (వైస్‌ కెప్టెన్), శిఖర్‌ ధావన్‌, రుతురాజ్‌ గైక్వాడ్, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, శ్రేయస్‌ అయ్యర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్ కీపర్‌), ఇశాన్ కిషన్‌ (వికెట్ కీపర్‌), యుజువేంద్ర చాహల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, శార్దూల్ ఠాకూర్‌, మహమ్మద్‌ సిరాజ్‌, జయంత్ యాదవ్‌, నవదీప్‌ సైనీ

దక్షిణాఫ్రికా : తెంబా బవుమా (కెప్టెన్‌), కేశవ్‌ మహరాజ్‌, క్వింటన్‌ డి కాక్‌ (వికెట్‌ కీపర్‌), జుబెయిర్‌ హమ్జా, మార్కో జాన్సన్‌, జానెమన్‌ మలన్‌, సిసండ మగల, ఐడెన్ మార్‌క్రమ్‌, డేవిడ్‌ మిల్లర్‌, లుంగి ఎంగిడి, వేన్‌ పార్నెల్, పెహ్లుక్వాయో, డ్వెయిన్‌ ప్రిటోరియస్‌, కగిసో రబాడ, తబ్రెయిజ్‌ షంసి, రస్సీ వాండర్‌ డస్సెన్‌, కైల్ వెరీన్‌

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని