Rishabh Pant : పంత్‌ ప్రదర్శన వెనుక రవిశాస్త్రిదీ కీలకపాత్రే: టీమ్‌ఇండియా మాజీ ఫీల్డింగ్‌ కోచ్

ఐదో టెస్టులో భారత్‌ను త్వరగా కుప్పకూలుద్దామని భావించిన ఇంగ్లాండ్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ రిషభ్‌ పంత్ (146) అద్భుత శతకంతో రెచ్చిపోయిన...

Published : 03 Jul 2022 15:21 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐదో టెస్టులో భారత్‌ను త్వరగా కుప్పకూలుద్దామని భావించిన ఇంగ్లాండ్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ రిషభ్‌ పంత్ (146) అద్భుత శతకంతో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. 98 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయిన భారత్‌ను.. రవీంద్ర జడేజా (104)తో కలిసి కీలకమైన భాగస్వామ్యం (222) జోడించి సురక్షిత స్థానంలో ఉంచాడు. అయితే మొన్నటి వరకు అనవసర షాట్లకు యత్నించి పెవిలియన్‌కు చేరుతున్నాడని, జట్టులో నుంచి తప్పించాలనే డిమాండూ వినిపించింది. విమర్శలు ఏమాత్రం పట్టించుకోని రిషభ్‌ తనదైన శైలిలో ఆడేశాడు. వద్దన్నవారితోనే శభాష్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో రిషభ్‌ పంత్‌ ప్రదర్శనపై టీమ్‌ఇండియా మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ ప్రత్యేకంగా విశ్లేషించారు. పంత్ బ్యాటింగ్‌ మెరుగుదల కోసం మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఏ విధంగా సాయపడ్డాడో వివరించారు.

(ఫొటో సోర్స్‌: ఆర్‌.శ్రీధర్‌ ట్విటర్‌)

‘‘కెరీర్‌ ప్రారంభంలో రిషభ్‌ పంత్‌ మరింత దూకుడుగా ఆడేవాడు. టెస్టుల్లోనూ 30-40 పరుగుల్లోపు పెవిలియన్‌కు చేరేవాడు. ఆ సమయంలో అప్పటి కోచ్‌ రవిశాస్త్రి ప్రత్యేకంగా రిషభ్‌తో మాట్లాడటం నాకు ఇప్పటికీ గుర్తే. ‘రిషభ్‌ నువ్వు అంతా బాగానే ఆడుతున్నావు. కానీ కాస్త ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది. బౌండరీ లైన్ల వద్ద ఆరుగురు ఫీల్డర్లు ఉంటారు. బంతిని పైకిలేపడం కంటే సింగిల్స్‌పై దృష్టి పెట్టు. అప్పుడు వారంతా దగ్గరకు వచ్చేస్తారు. ఆ తర్వాత బౌండరీలను బాదొచ్చు’ అని పంత్‌కు రవిశాస్త్రి సూచించాడు’’ అని శ్రీధర్‌ తెలిపారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఇంగ్లాండ్‌ 84/5 స్కోరుతో ఉంది. ఇంకా 332 పరుగులు వెనుకబడిన నేపథ్యంలో ఇవాళ కాకుండా ఇంకో రెండు రోజులపాటు ఆట మిగిలి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు