Gambhir - Dhoni: ధోనీకి ఏ అవసరమొచ్చినా నేను ముందుంటా: గంభీర్‌

ధోనీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా నిలిచేందుకు ముందుంటానని గౌతమ్‌ గంభీర్‌ స్పష్టం చేశాడు. ధోనీ అంటే తనకు ఇష్టముండదనే పుకార్లను కొట్టిపారేశాడు...

Updated : 19 Mar 2022 11:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ధోనీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని గౌతమ్‌ గంభీర్‌ స్పష్టం చేశాడు. ధోనీ అంటే తనకు ఇష్టముండదనే పుకార్లను కొట్టిపారేశాడు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన గంభీర్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవనీ.. మాజీ సారథి అంటే తనకెంతో గౌరవమని చెప్పాడు.

‘అవన్నీ పుకార్లు మాత్రమే. ధోనీ అంటే నాకు అమితమైన గౌరవం. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇదివరకే ఈ విషయాన్ని చెప్పాను. మళ్లీ చెబుతున్నా. ఎక్కడైనా ఈ విషయాన్ని చెప్పగలను. అతడికి ఏ అవసరం వచ్చినా ముందుంటాను. ధోనీకి అలాంటి పరిస్థితి రాదు. కానీ, వస్తే అండగా ఉంటా. అతడు టీమ్‌ఇండియాకు చేసిన సేవలే అందుకు కారణం. మా మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అయితే.. మా మధ్య ఎలాంటి వివాదాలు లేవు. ఇంకో విషయం.. ధోనీ సారథ్యంలో నేనే ఎక్కువకాలం వైస్‌కెప్టెన్‌గా ఉన్నా. ఐపీఎల్‌లో ఆడినప్పుడు మాత్రమే మైదానంలో ప్రత్యర్థుల్లా ఉన్నాం’ అని గంభీర్‌ వివరించాడు.

అలాగే ధోనీ టీమ్‌ఇండియా తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసి ఉంటే అన్ని రికార్డులు బద్దలయ్యేవని మాజీ ఓపెనర్‌ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు నంబర్‌-3లో గొప్ప ఆటగాళ్ల గురించి మాట్లాడుతున్నా.. మహీ ఆ స్థానంలో ఆడితే ప్రతి రికార్డునూ తిరగరాసేవడని చెప్పాడు. కాగా, ధోనీ కెరీర్‌ ఆరంభంలో టీమ్‌ఇండియా తరఫున పలు మ్యాచ్‌ల్లో మూడో స్థానంలో ఆడాడు. అక్కడ అతడు 16 ఇన్నింగ్స్‌లు ఆడి 993 పరుగులు చేశాడు. ఇక 2005లో పాకిస్థాన్‌పై 148, శ్రీలంకపై 183 పరుగులు కూడా ఆ స్థానంలో ఆడినప్పుడు సాధించినవే కావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని