ఆఖరి మ్యాచ్‌లో టైటిల్‌ వేటలో

గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ను ఘనంగా ముగించేందుకు సానియా మీర్జా అడుగు దూరంలో నిలిచింది. చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతున్న ఆమె.. రోహన్‌ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ దిశగా దూసుకెళ్తోంది.

Updated : 26 Jan 2023 13:25 IST

మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో సానియా జోడీ
ఎదురులేని జకోవిచ్‌.. సెమీస్‌లో అడుగు
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ను ఘనంగా ముగించేందుకు సానియా మీర్జా అడుగు దూరంలో నిలిచింది. చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతున్న ఆమె.. రోహన్‌ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ దిశగా దూసుకెళ్తోంది. సంచలన విజయంతో ఈ భారత జోడీ ఫైనల్లో అడుగుపెట్టింది. అన్‌సీడెడ్‌ సానియా- బోపన్న ద్వయం సెమీస్‌లో 7-6 (7-5), 6-7 (5-7), 10-6 తేడాతో మూడో సీడ్‌ డెజరి క్రాచిక్‌ (అమెరికా)- నీల్‌ (బ్రిటన్‌)పై పోరాడి గెలిచింది. గంటా 52 నిమిషాల పాటు ఉత్కంఠగా సాగిన పోరులో చివరికి భారత జంటకే విజయం దక్కింది. ఎంతో హోరాహోరీగా ఒకేలా సాగిన తొలి రెండు సెట్లలో ఈ జోడీలు చెరో దాంట్లో విజయం సాధించాయి. ప్రత్యర్థి జంటలు రెండూ సర్వీస్‌లు నిలబెట్టుకుంటూ సాగడంతో తొలి సెట్‌ 6-6తో టైబ్రేకర్‌కు దారితీసింది. అందులో సానియా జోడీ పైచేయి సాధించింది. రెండో సెట్‌ తొలి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన భారత జంట ఆపై 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ ఆరో గేమ్‌లో సర్వీస్‌ బ్రేక్‌ చేసిన ప్రత్యర్థి 3-3తో స్కోరు సమం చేసింది. చివర్లో 6-5తో సానియా ద్వయం మ్యాచ్‌ పాయింట్‌ మీద నిలిచింది. కానీ సర్వీస్‌ను నిలబెట్టుకోలేక గేమ్‌ సమర్పించుకుంది. ఈ సారి టైబ్రేకర్‌లో ప్రత్యర్థి గెలిచింది. దీంతో విజేతను తేల్చేందుకు సూపర్‌ టైబ్రేకర్‌ నిర్వహించారు. అందులో విన్నర్లతో సానియా జంట చెలరేగింది. సానియా బ్యాక్‌హ్యాండ్‌ విన్నర్‌తో మ్యాచ్‌ పాయింట్‌కు చేరుకున్న ఈ జోడీ.. ఫోర్‌హ్యాండ్‌ విన్నర్‌తో  పోరు ముగించింది. మ్యాచ్‌లో సానియా ద్వయం 4 ఏస్‌లు, 27 విన్నర్లు కొట్టింది. ఫైనల్లో   స్టెఫాని- రఫెల్‌ (బ్రెజిల్‌)తో భారత జంట తలపడుతుంది.

జకో జోరు: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ అంటే చాలు చెలరేగిపోయే నాలుగో సీడ్‌ జకోవిచ్‌ సెమీస్‌కు అర్హత సాధించాడు. బుధవారం పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఈ సెర్బియా యోధుడు 6-1, 6-2, 6-4 తేడాతో అయిదో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా)ను చిత్తుచేశాడు. చివరి సెట్‌లో మాత్రమే జకోకు కాస్త పోటీ ఎదురైంది.  మ్యాచ్‌లో జకో 14 ఏస్‌లు, 32 విన్నర్లు కొట్టాడు. అతను సెమీస్‌లో టామీ పాల్‌ (అమెరికా)తో తలపడతాడు. మరో క్వార్టర్స్‌లో పాల్‌ 7-6 (8-6), 6-3, 5-7, 6-4తో సహచర ఆటగాడు షెల్టన్‌పై నెగ్గి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌ చేరాడు. ఆండీ రోడిక్‌ (2009లో) తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌ దాటిన తొలి అమెరికా ఆటగాడు పాల్‌. 2007 తర్వాత తొలిసారి ఇద్దరు అమెరికా ఆటగాళ్ల మధ్య జరిగిన ఓ గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్స్‌లో పాల్‌దే పైచేయి. మ్యాచ్‌లో అతను 7 ఏస్‌లు, 43 విన్నర్లు సంధించాడు. 50 అనవసర తప్పిదాలతో షెల్టన్‌ మూల్యం చెల్లించుకున్నాడు.

అలవోకగా..: ఈ ఏడాది జోరు మీదున్న సబలెంక అలవోకగా సెమీస్‌ చేరింది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఈ బెలారస్‌ భామ 6-3, 6-2తో వెకిచ్‌ (క్రొయేషియా) పోరాటానికి తెరదించింది. ఈ పోరులో అయిదో సీడ్‌ సబలెంకకు పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. నాలుగో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి ఆమె 3-1తో నిలిచింది. కానీ వెకిచ్‌ వరుసగా రెండు గేమ్‌లు గెలిచి స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఆమె ఆట గాడితప్పింది. వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి సబలెంక తొలి సెట్‌ దక్కించుకుంది. రెండో సెట్లో మరింత దూకుడుతో విజేతగా నిలిచింది. ఆమె 9 ఏస్‌లు, 38 విన్నర్లు కొట్టింది.మరో క్వార్టర్స్‌లో లినట్‌ (పోలండ్‌) 6-3, 7-5తో రెండు సార్లు గ్రాండ్‌స్లామ్‌ రన్నరప్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను కంగు తినిపించింది. ఈ ఏడాది ముందు వరకూ ఆడిన 29 గ్రాండ్‌స్లామ్‌ల్లో ఎప్పుడూ మూడో రౌండ్‌ దాటని లినట్‌ ఇప్పుడు సెమీస్‌ చేరింది.


ఇదో అద్భుతమైన మ్యాచ్‌. ఎంతో ఒత్తిడి ఎదుర్కొన్నాం. నా చివరి గ్రాండ్‌స్లామ్‌లో బోపన్నతో ఆడడం ప్రత్యేకంగా ఉంది. నా 14 ఏళ్ల వయసులో అతనే నా తొలి మిక్స్‌డ్‌ డబుల్స్‌ భాగస్వామి. ఇప్పుడు నాకు 36 ఏళ్లు. అతనికి 42 ఏళ్లు. మేమింకా ఆడుతున్నాం. మా మధ్య మంచి అనుబంధం ఉంది. నేను సాధారణంగా ఏడ్చేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఆ ఉద్వేగానికి దగ్గర్లో ఉన్నా. ఇక్కడికొచ్చాక గత 18 ఏళ్ల ప్రేమను అనుభూతి చెందుతున్నా. ఇది నాకు ఇల్లు లాంటిది. ఇక్కడో కుటుంబం ఉంది. మద్దతుగా నిలిచే ఎంతోమంది భారతీయులున్నారు.

సానియా


* ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియా జోడీ ఫైనల్‌ చేరడమిది అయిదో సారి. భూపతితో కలిసి 2009లో ఆమె ట్రోఫీ గెలిచింది.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని