సంక్షిప్త వార్తలు (2)

డేవిస్‌ కప్‌లో  ప్రపంచ గ్రూప్‌-1 నుంచి భారత్‌ గ్రూప్‌-2కు పడిపోయింది. 2019లో కొత్త ఫార్మాట్‌ ప్రకటించిన తర్వాత గ్రూప్‌-2కు దిగజారడం భారత్‌కిదే తొలిసారి. గ్రూప్‌-1 ప్లేఆఫ్స్‌ తొలి రౌండ్‌లో డెన్మార్క్‌ చేతిలో 2-3తో ఓటమి భారత్‌ను దెబ్బతీసింది.

Updated : 05 Feb 2023 12:36 IST

గ్రూప్‌-2కు పడిపోయిన భారత్‌

డేవిస్‌ కప్‌లో డెన్మార్క్‌ చేతిలో ఓటమి 

హిలెరాడ్‌ (డెన్మార్క్‌): డేవిస్‌ కప్‌లో  ప్రపంచ గ్రూప్‌-1 నుంచి భారత్‌ గ్రూప్‌-2కు పడిపోయింది. 2019లో కొత్త ఫార్మాట్‌ ప్రకటించిన తర్వాత గ్రూప్‌-2కు దిగజారడం భారత్‌కిదే తొలిసారి. గ్రూప్‌-1 ప్లేఆఫ్స్‌ తొలి రౌండ్‌లో డెన్మార్క్‌ చేతిలో 2-3తో ఓటమి భారత్‌ను దెబ్బతీసింది. శుక్రవారం సింగిల్స్‌లో యుకి బాంబ్రి ఓటమి, సుమిత్‌ నగాల్‌ విజయంతో 1-1తో భారత్‌ పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. కానీ శనివారం వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమే ఎదురైంది. మొదట డబుల్స్‌లో యుకి- బోపన్న జోడీ 2-6, 4-6తో జొహానెస్‌- హోల్గర్‌ చేతిలో తలవంచింది. అనంతరం తొలి రివర్స్‌ సింగిల్స్‌లో సుమిత్‌ 5-7, 3-6తో హోల్గర్‌ చేతిలో ఓడడంతో 1-3తో భారత ఓటమి ఖాయమైంది. నామమాత్రమైన చివరి రివర్స్‌ సింగిల్స్‌లో ప్రజ్ఞేశ్‌ 6-4, 7-6 (7-1)తో ఎల్మర్‌పై గెలిచి జట్టుకు కాస్త ఊరట కలిగించాడు.


రంజీ సెమీస్‌లో సౌరాష్ట్ర

రాజ్‌కోట్‌: రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ఆ జట్టు 71 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. 252 పరుగుల ఛేదనలో శనివారం, చివరిదైన ఐదో రోజు పంజాబ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. పార్థ్‌ భట్‌ (5/89), ధర్మేంద్ర జడేజా (3/56) ధాటికి ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 303.. పంజాబ్‌ 431 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 379కి ఆలౌటైంది. బుధవారం ఆరంభమయ్యే సెమీఫైనల్లో కర్ణాటకతో సౌరాష్ట్ర.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మధ్యప్రదేశ్‌తో బెంగాల్‌ తలపడనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని