MI vs RCB: రెండొందల లక్ష్యం మళ్లీ ఉఫ్‌..

ఐపీఎల్‌ కీలక దశలో ముంబయి ఇండియన్స్‌ పుంజుకుంది. ఆరో విజయంతో ప్లేఆఫ్స్‌ రేసులో ముందడుగు వేసింది. సూర్యకుమార్‌ వీర విధ్వంసంతో బెంగళూరును మట్టికరిపించిన రోహిత్‌ సేన.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది.

Updated : 10 May 2023 07:30 IST

మెరిసిన సూర్య, వధేరా, ఇషాన్‌
బెంగళూరుపై విజయం

ఐపీఎల్‌ కీలక దశలో ముంబయి ఇండియన్స్‌ పుంజుకుంది. ఆరో విజయంతో ప్లేఆఫ్స్‌ రేసులో ముందడుగు వేసింది. సూర్యకుమార్‌ వీర విధ్వంసంతో బెంగళూరును మట్టికరిపించిన రోహిత్‌ సేన.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో టాప్‌-4లో నిలవడం ముంబయికి ఇదే తొలిసారి. గత నాలుగు మ్యాచ్‌ల్లో ఆ జట్టుకిది మూడో విజయం. రాయల్‌ ఛాలెంజర్స్‌ ఆరో పరాజయంతో తన ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

ముంబయి

ముంబయి ఇండియన్స్‌ అదరగొట్టింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (83; 35 బంతుల్లో 7×4, 6×6) వీరవిహారంతో మంగళవారం 6 వికెట్ల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఓడించింది. మ్యాక్స్‌వెల్‌ (68; 33 బంతుల్లో 8×4, 4×6), డుప్లెసిస్‌ (65; 41 బంతుల్లో 5×4, 3×6)ల మెరుపులతో మొదట బెంగళూరు 6 వికెట్లకు 199 పరుగులు చేసింది. బెరెన్‌డార్ఫ్‌ (3/36) బంతితో రాణించాడు. సూర్యతోపాటు నేహల్‌ వధేరా (52 నాటౌట్‌; 34 బంతుల్లో 4×4, 3×6), ఇషాన్‌ కిషన్‌ (42; 21 బంతుల్లో 4×4, 4×6) మెరవడంతో లక్ష్యాన్ని ముంబయి కేవలం 16.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

సూర్య ధనాధన్‌

భారీ లక్ష్య ఛేదనలో ఇషాన్‌ కిషన్‌ ముంబయికి మెరుపు ఆరంభాన్నిస్తే.. నేహాల్‌ వధేరాతో కలిసి సూర్యకుమార్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. ఇషాన్‌ విధ్వంసంతో ముంబయి 4.3 ఓవర్లలోనే 51/0తో నిలిచింది. కానీ ఒక్క పరుగు తేడాతో ఇషాన్‌, రోహిత్‌ (7)లను ఔట్‌ చేయడం ద్వారా ముంబయిని హసరంగ డిసిల్వా దెబ్బతీశాడు. కానీ మ్యాచ్‌లో ఆర్సీబీకి అవే చివరి ఆనంద క్షణాలు. సూర్య, వధేరా ధాటైన బ్యాటింగ్‌తో స్కోరు వేగం తగ్గకుండా చూశారు. తగ్గనివ్వకపోవడమే కాదు క్రమంగా విధ్వంసాన్ని పెంచారు. సూర్య తనదైన శైలిలో స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేస్తూ ముచ్చటైన సిక్స్‌లతో అలరించాడు. వధేరా కూడా తగ్గలేదు. ఇన్నింగ్స్‌లో ఏ దశలోనూ బౌండరీల రాక ఆగలేదు. 13 ఓవర్లలో ముంబయి స్కోరు 141/2. 26 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన సూర్య ఆ తర్వాత హసరంగ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లతో అలరించాడు. ఆ వెంటనే వైశాఖ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్లో వరుసగా 6, 4, 6 బాదేశాడు. తర్వాతి బంతికే అతడు ఔటైనా.. ముంబయికి ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. ఎందుకంటే అప్పటికి స్కోరు 192. విజయం ఖరారైపోయింది. డేవిడ్‌ (0) వెంటనే ఔటైనా.. గ్రీన్‌ (2 నాటౌట్‌)తో కలిసి వధేరా లాంఛనం పూర్తి చేశాడు. సూర్య, వధేరా మూడో వికెట్‌కు 66 బంతుల్లోనే 140 పరుగులు జోడించారు.

ఆ ఇద్దరు దంచేశారు

బెంగళూరు ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌వెల్‌, కెప్టెన్‌ డుప్లెసిస్‌ల ఆటే హైలైట్‌. విధ్వంసక విన్యాసాలతో ప్రత్యర్థి బౌలింగ్‌ను తుత్తునియలు చేసిన ఈ జోడీ రాయల్‌ ఛాలెంజర్స్‌ భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించింది. బెంగళూరు ఇంకా ఎక్కువ స్కోరు చేసేలా కనిపించింది. ఆలస్యంగానైనా కాస్త పుంజుకున్న ముంబయి బౌలర్లు ఆ జట్టును కాస్త నియంత్రించగలిగారు. నిజానికి ఆరంభంలో బెంగళూరు తడబడింది.  16 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది. కోహ్లి (1), అనుజ్‌ రావత్‌ (6)ను ఔట్‌ చేయడం ద్వారా బెరెన్‌డార్ఫ్‌ ఆ జట్టును దెబ్బతీశాడు. కానీ ముంబయి సంతోషం కొద్దిసేపే. రెచ్చిపోయి ఆడిన డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌ ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఏ బౌలర్‌నూ వదల్లేదు .చక్కని స్ట్రోక్‌ ప్లేతో అలరించిన మ్యాక్స్‌వెల్‌.. జోర్డాన్‌ ఓవర్లో రెండు కళ్లు చెదిరే సిక్స్‌లు బాదాడు. చావ్లా బౌలింగ్‌లోనూ సిక్స్‌ బాదిన అతడు జోరును కొనసాగిస్తూ కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో అతడికి నాలుగో అర్ధశతకం కావడం విశేషం. మరోవైపు డుప్లెసిస్‌ కూడా చక్కని షాట్లు ఆడాడు. ఖాతా అయినా తెరవకముందే వధేరా క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన అతడు.. అవకాశాన్ని ఉపయోగించుకుంటూ 30 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా తన అగ్రస్థానాన్ని డుప్లెసిస్‌ (12 మ్యాచ్‌ల్లో 576) మరింత బలోపేతం చేసుకున్నాడు. బెంగళూరు 12 ఓవర్లలో 131/2తో తిరుగులేని స్థితిలో నిలిచింది. బ్యాటర్ల జోరు చూస్తుంటే 220 వరకు కూడా వెళ్లగలదనిపించింది. కానీ పుంజుకున్న ముంబయి బౌలర్లు ఆర్సీబీని రెండొందల లోపు స్కోరుకే పరిమితం చేశారు. 13వ ఓవర్లో మ్యాక్స్‌వెల్‌ను ఔట్‌ చేయడం ద్వారా 120 పరుగుల భాగస్వామ్యాన్ని బెరెన్‌డార్ఫ్‌ విడదీయడంతో ముంబయి పోటీలోకి వచ్చింది. చివరి ఏడు ఓవర్లలో 68 పరుగులిచ్చిన ఆ జట్టు లొమ్రార్‌ (1), డుప్లెసిస్‌, దినేశ్‌ కార్తీక్‌ (30; 18 బంతుల్లో 4×4, 1×6)లను ఔట్‌ చేసింది. ఆర్సీబీ 15 ఓవర్లలో 152/5తో నిలవగా.. కార్తీక్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. కేదార్‌ జాదవ్‌ (12 నాటౌట్‌), హసరంగ (12 నాటౌట్‌) అజేయంగా నిలిచారు.

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) బెరెన్‌డార్ఫ్‌ 1; డుప్లెసిస్‌ (సి) విష్ణు (బి) గ్రీన్‌ 65; అనుజ్‌ రావత్‌ (సి) గ్రీన్‌(బి) బెరెన్‌డార్ఫ్‌ 6; మ్యాక్స్‌వెల్‌ (సి) వధేరా (బి) బెరెన్‌డార్ఫ్‌ 68; లొమ్రార్‌ (బి) కార్తికేయ 1; దినేశ్‌ కార్తీక్‌ (సి) వధేరా (బి) జోర్డాన్‌ 30; కేదార్‌ జాదవ్‌ నాటౌట్‌ 12; హసరంగ డిసిల్వా నాటౌట్‌ 12; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 199; వికెట్ల పతనం: 1-2, 2-16, 3-136, 4-143, 5-146, 6-185; బౌలింగ్‌: బెరెన్‌డార్ఫ్‌ 4-0-36-3; పియూష్‌ చావ్లా 4-0-41-0; గ్రీన్‌ 2-0-15-1; జోర్డాన్‌ 4-0-48-1; కుమార్‌ కార్తికేయ 4-0-35-1; ఆకాశ్‌ మధ్వాల్‌ 2-0-23-0

ముంబయి ఇన్నింగ్స్‌: ఇషాన్‌ (సి) అనుజ్‌ (బి) హసరంగ 42; రోహిత్‌ ఎల్బీ (బి) హసరంగ 7; సూర్యకుమార్‌ (సి) జాదవ్‌ (బి) వైశాఖ్‌ 83; వధేరా నాటౌట్‌ 52; డేవిడ్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) వైశాఖ్‌ 0; గ్రీన్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (16.3 ఓవర్లలో 4 వికెట్లకు) 200; వికెట్ల పతనం: 1-51, 2-52, 3-192, 4-192; బౌలింగ్‌: సిరాజ్‌ 3-0-31-0; హేజిల్‌వుడ్‌ 3-0-32-0; హసరంగ 4-0-53-2; వైశాఖ్‌ 3-0-37-2; హర్షల్‌ 3.3-0-41-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని