IPL Final: చెన్నై పట్టుకుపోయింది.. ఆఖరి బంతికి అద్భుత విజయం
ఐపీఎల్-16 ట్రోఫీ గుజరాత్‌ను ఊరించి.. ఊరించి.. చివరికి చెన్నైకే చిక్కింది. సోమవారం తీవ్ర ఉత్కంఠ మధ్య.. అత్యంత హోరాహోరీగా సాగి ఆఖరి బంతికి ఫలితం తేలిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ధోనీసేన ఖాతాలో అయిదో టైటిల్
15 ఓవర్లలో 171 పరుగుల ఛేదన
సుదర్శన్ మెరుపులు వృథా
ఐపీఎల్ ఫైనళ్లలో మొదట బ్యాటింగ్ జట్లవే మెజారిటీ విజయాలు. అయినా సోమవారం టాస్ గెలిచిన ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు! మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండటంతో.. ఛేదనకే మొగ్గు చూపాడు చెన్నై సారథి. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఏకంగా 214 పరుగులు కొట్టేసరికి.. ధోనీసేనకిక కష్టమే అనుకున్నారంతా! అక్కడి నుంచి మ్యాచ్ యథాప్రకారం కొనసాగి ఉంటే మజానే ఉండేది కాదేమో!
ఆదివారం జరగాల్సిన ఐపీఎల్-16 ఫైనల్‌ను నాటకీయ రీతిలో తర్వాతి రోజుకు వాయిదా వేయించిన వరుణుడు.. సోమవారం మళ్లీ రంగప్రవేశం చేయడం కథలో కీలక మలుపు! రెండున్నర గంటలు ఆగిన ఆట.. అర్ధరాత్రి పునఃప్రారంభమయ్యాక మొదలైంది అసలు మజా!
15 ఓవర్లు.. 171 పరుగులు.. పరుగుల కోసం చెన్నై పోటీ.. వికెట్ల కోసం గుజరాత్ వేట! నువ్వా నేనా అంటూ సాగిన పోరు.. క్లైమాక్స్‌కు చేరుకుంది. ఆఖరి ఓవర్లో 13 పరుగులు కావాలి. 4 బంతుల్లో మోహిత్ ఇచ్చిన పరుగులు మూడే. గుజరాత్‌లో విజయోత్సాహం.. చెన్నైలో నిరాశ! కానీ అయిదో బంతికి జడేజా సిక్సర్ కొట్టి ఉత్కంఠను పతాక స్థాయికి తీసుకెళ్లాడు. చివరి బంతికి పుల్ టాస్‌ను ఫైన్‌లెగ్ వైపు ఇలా కొట్టాడో లేదో.. క్షణాల్లో బంతి బౌండరీని దాటేసింది. స్టేడియంలో పసుపు దళం సంబరాలు అంబరాన్నంటాయి.
అయిదో ఐపీఎల్ ట్రోఫీ వచ్చి చెన్నై ఒళ్లో వాలింది. వరుసగా రెండో టైటిల్ సాధించాలన్న గుజరాత్ ఆశలపై ‘నీళ్లు’ పడ్డాయి. ధోని ఇంకో ఐపీఎల్ ఆడటం అనుమానమే అని భావిస్తున్న నేపథ్యంలో.. 42 ఏళ్ల వయసులో అతను మరో ట్రోఫీ అందుకుని కెరీర్లో పతాక ఘట్టాన్ని చిరస్మరణీయం చేసుకున్నట్లయింది.
అహ్మదాబాద్: ఐపీఎల్-16 ట్రోఫీ గుజరాత్‌ను ఊరించి.. ఊరించి.. చివరికి చెన్నైకే చిక్కింది. సోమవారం తీవ్ర ఉత్కంఠ మధ్య.. అత్యంత హోరాహోరీగా సాగి ఆఖరి బంతికి ఫలితం తేలిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట గుజరాత్.. 4 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. సాయి సుదర్శన్ (96; 47 బంతుల్లో 8×4, 6×6) మేటి ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (54; 39 బంతుల్లో 5×4, 1×6), శుభ్‌మన్ గిల్ (39; 20 బంతుల్లో 7×4) కూడా రాణించారు. ఛేదనలో చెన్నై 0.3 ఓవర్లలో 4/0తో ఉన్న దశలో వర్షం మైదానాన్ని ముంచెత్తింది. తిరిగి ఆట ఆరంభమయ్యాక లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 15 ఓవర్లలో 171గా సవరించారు. చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కాన్వే (47; 25 బంతుల్లో 4×4, 2×6), దూబె (32 నాటౌట్; 21 బంతుల్లో 2×6), రహానె (27; 13 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ (3/36), నూర్ అహ్మద్ (2/17) గొప్పగా బౌలింగ్ చేశారు.
తీవ్ర ఉత్కంఠ: చెన్నై ఇన్నింగ్స్‌లో 3 బంతులు పడ్డాయో లేదో వరుణుడు ప్రతాపం చూపాడు. రెండున్నర గంటలకు పైగా విరామం తర్వాత తిరిగి ఆట ఆరంభం కాగా.. చెన్నై ఓపెనర్లు తొలి బంతి నుంచే విధ్వంసానికి దిగారు. ముఖ్యంగా కాన్వే చెలరేగిపోయాడు. దొరికిన బంతిని దొరికినట్లే బౌండరీకి పంపేశాడు. రుతురాజ్ (26; 16 బంతుల్లో 3×4, 1×6) కూడా సమయోచితంగా షాట్లు ఆడటంతో చెన్నై 4 ఓవర్లకే 52 పరుగులు రాబట్టింది. ప్రమాదకర రషీద్ ఖాన్‌ను హార్దిక్ నాలుగో ఓవర్లోనే దించగా.. అతణ్ని చెన్నై ఓపెనర్లు అలవోకగా ఎదుర్కొన్నారు. అయితే రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న చెన్నైకి స్పిన్నర్ నూర్ అహ్మద్ చెక్ పెట్టాడు. అతను ఒకే ఓవర్లో చెన్నై ఓపెనర్లను పెవిలియన్ చేర్చాడు. అయినా చెన్నై తగ్గలేదు. రహానె (27; 13 బంతుల్లో 2×4, 2×6) సంచలన బ్యాటింగ్‌తో ఆ జట్టును ముందుకు నడిపించాడు. అతను ఔటయ్యాక మళ్లీ టైటాన్స్ పోటీలోకి వచ్చింది. 20 బంతుల్లో 51తో సమీకరణం చెన్నైకి సంక్లిష్టంగా మారింది. ఈ దశలో దూబె, రాయుడు అందుకున్నారు. రషీద్ బౌలింగ్‌లో దూబె వరుసగా రెండు సిక్సర్లు బాదితే.. మోహిత్ బౌలింగ్‌లో రాయుడు వరుసగా 6, 4 6 బాదేయడంతో చెన్నై విజయానికి 15 బంతుల్లో 23 పరుగులే అవసరమయ్యాయి. కానీ మోహిత్ గొప్పగా పుంజుకున్నాడు. వరుస బంతుల్లో రాయుడు (19), ధోని (0)లను ఔట్ చేశాడు. అక్కడి నుంచి గుజరాత్ పట్టు బిగించింది. చివరి ఓవర్లో మోహిత్ తొలి నాలుగు బంతులను కట్టుదిట్టంగా వేయడంతో చెన్నై దాదాపుగా ఆశలు వదులుకున్నట్లే కనిపించింది. కానీ చివరి 2 బంతుల్లో 10 పరుగులు అవసరమైన స్థితిలో జడేజా (15 నాటౌట్) 6, 4 కొట్టి చెన్నైకి చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు.
గిల్ తగ్గినా.. గుజరాత్‌ది అదే జోరు: ఐపీఎల్ ఫైనల్స్‌లో చాలా వరకు మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచినా.. వర్ష సూచన నేపథ్యంలో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోని ఛేదనకే మొగ్గు చూపాడు. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు శతకాలు బాది భీకర ఫామ్‌తో ఫైనల్లో అడుగు పెట్టిన శుభ్‌మన్ మీదే అందరి దృష్టీ నిలవగా.. అతను ఈ మ్యాచ్ ఆరంభంలో తడబడ్డాడు. 3 పరుగుల వద్ద తుషార్ బౌలింగ్‌లో శుభ్‌మన్ ఇచ్చిన తేలికైన క్యాచ్‌ను దీపక్ చాహర్ విడిచిపెట్టాడు. 2 ఓవర్లకు టైటాన్స్ 8 పరుగులే చేయగలిగింది. దీంతో ఫైనల్లో చెన్నైయే పైచేయి సాధిస్తుందేమో అనిపించింది. కానీ మూడో ఓవర్ నుంచి ఆట స్వరూపం మారిపోయింది. దీపక్ బౌలింగ్‌లో సాహా ఓ సిక్సర్, రెండు ఫోర్లు కొట్టగా.. తుషార్ బంతులకు హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు శుభ్‌మన్. దీంతో గుజరాత్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా మెరుపు వేగాన్నందుకుంది. శుభ్‌మన్.. తీక్షణ బౌలింగ్‌లోనూ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లేలో టైటాన్స్ 62/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. గిల్ ఊపు చూస్తే.. అతను మరో భారీ ఇన్నింగ్స్ ఆడతాడేమో అనిపించింది కానీ.. ధోని మెరుపు స్టంపింగ్‌తో అతడి ఇన్నింగ్స్‌కు తెరదించాడు. వికెట్ పడ్డాక గుజరాత్ కొంచెం నెమ్మదించింది. సాహా, సుదర్శన్ ఆచితూచి బ్యాటింగ్ చేశారు. 12 ఓవర్లకు స్కోరు 109/1. ఈ దశలో అర్ధశతకం పూర్తి చేసుకున్న సాహా.. దీపక్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయి వెనుదిరిగాడు. హార్దిక్ క్రీజులోకి రావడంతో ఇక అతను బాదుడు బాధ్యత తీసుకుంటాడనుకుంటే.. అనూహ్యంగా సుదర్శన్ చెలరేగిపోయాడు. 15వ ఓవర్ ఆరంభానికి ముందు 36 పరుగులపై ఉన్న సుదర్శన్.. 19వ ఓవర్ చివరికి 84కి చేరుకున్నాడు. పతిరన వేసిన చివరి ఓవర్లో తొలి రెండు బంతులకు రెండు సిక్సర్లు బాది 96 పరుగులపై నిలిచిన అతను.. సెంచరీ కొట్టడం లాంఛనమే అనిపించింది. కానీ మూడో బంతికి ఎల్బీ అయి వెనుదిరిగాడు. సుదర్శన్ ధాటికి చివరి 6 ఓవర్లలో టైటాన్స్ 83 పరుగులు రాబట్టింది. హార్దిక్ (21 నాటౌట్; 12 బంతుల్లో 2×6)తో మూడో వికెట్‌కు అతను 81 పరుగులు జోడించాడు.
గుజరాత్ ఇన్నింగ్స్: సాహా (సి) ధోని (బి) దీపక్ చాహర్ 54; శుభ్‌మన్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 39; సాయి సుదర్శన్ ఎల్బీ (బి) పతిరన 96; హార్దిక్ నాటౌట్ 21; రషీద్ (సి) రుతురాజ్ (బి) పతిరన 0; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 214; వికెట్ల పతనం: 1-67, 2-131, 3-212, 4-214; బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-38-1; తుషార్ దేశ్‌పాండే 4-0-56-0; తీక్షణ 4-0-36-0; జడేజా 4-0-38-1; పతిరన 4-0-44-2
చెన్నై ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) రషీద్ (బి) నూర్ అహ్మద్ 26; కాన్వే (సి) మోహిత్ (బి) నూర్ అహ్మద్ 47; దూబె నాటౌట్ 32; రహానె (సి) శంకర్ (బి) మోహిత్ 27; రాయుడు (సి) అండ్ (బి) మోహిత్ 19; ధోని (సి) మిల్లర్ (బి) మోహిత్ 0; జడేజా నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (15 ఓవర్లలో 5 వికెట్లకు) 171; వికెట్ల పతనం: 1-74, 2-78, 3-117, 4-149, 5-149; బౌలింగ్: షమి 3-0-29-0; హార్దిక్ 1-0-14-0; రషీద్‌ఖాన్ 3-0-44-0; నూర్ అహ్మద్ 3-0-17-2; లిటిల్ 2-0-30-0; మోహిత్‌శర్మ 3-0-36-3
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World Culture Festival: ఘనంగా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
-
Baby: ‘బేబి’ విజయం.. దర్శకుడికి నిర్మాత బహుమానం.. అదేంటంటే?
-
ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు పాతవే