India vs Pakistan: భారత్‌ తుపాన్‌లో పాక్‌ గల్లంతు

లీగ్‌ దశలో పాకిస్థాన్‌ కొంచెం కంగారు పెట్టింది కానీ.. సూపర్‌-4 దశలో మాత్రం భారత్‌ ధాటికి కుదేలైపోయింది. గెలుపు తేడా 228 పరుగులంటేనే అర్థం చేసుకోవచ్చు పాక్‌ ఎంతటి ఘోర పరాభవం చవిచూసిందో!

Updated : 12 Sep 2023 08:51 IST

రోహిత్‌ సేనకు రికార్డు విజయం
228 పరుగుల తేడాతో ప్రత్యర్థి చిత్తు
కోహ్లి, రాహుల్‌ అజేయ శతకాలు
విజృంభించిన కుల్‌దీప్‌

లీగ్‌ దశలో పాకిస్థాన్‌ కొంచెం కంగారు పెట్టింది కానీ.. సూపర్‌-4 దశలో మాత్రం భారత్‌ ధాటికి కుదేలైపోయింది. గెలుపు తేడా 228 పరుగులంటేనే అర్థం చేసుకోవచ్చు పాక్‌ ఎంతటి ఘోర పరాభవం చవిచూసిందో! వర్షం వల్ల రెండు రోజుల పాటు సాగిన మ్యాచ్‌లో ఆద్యంతం భారత్‌దే ఆధిపత్యం. బ్యాటింగ్‌లో ఓపెనర్లు అర్ధశతకాలు సాధిస్తే.. తర్వాత  వచ్చిన ఇద్దరూ శతక మోత మోగించారు. తర్వాత బౌలింగ్‌లోనూ భారత్‌ జోరుకు ప్రత్యర్థి నిలవలేకపోయింది. ఇన్నింగ్స్‌లో ఒక్కరూ 30 దాటలేదు. ఒక్క 50 భాగస్వామ్యమూ లేదు. మొత్తంగా కొలంబోలో టీమ్‌ఇండియాకు పాక్‌ నుంచి కనీస పోటీ లేదు. చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి మంగళవారం ఆతిథ్య శ్రీలంకతో పోరుకు సిద్ధమైంది రోహిత్‌ సేన.

కొలంబో: ఆసియా కప్‌ సూపర్‌-4 దశలో టీమ్‌ఇండియా సూపర్‌ విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఏకంగా 228 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌ అవకాశాలను గణనీయంగా మెరుగుపరుచుకుంది. ఆదివారం టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి 147/2తో నిలవగా.. రిజర్వ్‌ డే అయిన సోమవారం ఇన్నింగ్స్‌ను కొనసాగించి మరో వికెట్‌ కోల్పోకుండా 356 పరుగుల భారీ స్కోరు సాధించింది. అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన విరాట్‌ కోహ్లి (122 నాటౌట్‌; 94 బంతుల్లో 9×4, 3×6), కేఎల్‌ రాహుల్‌ (111 నాటౌట్‌; 106 బంతుల్లో 12×4, 2×6) శతకాలతో అజేయంగా నిలిచారు. ఛేదనలో స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (5/25) ధాటికి విలవిలలాడిన పాక్‌ 32 ఓవర్లలో కేవలం 128 పరుగులకే పరిమితమైంది. గాయాల కారణంగా హారిస్‌ రవూఫ్‌, నసీమ్‌ షా బ్యాటింగ్‌కు రాకపోవడంతో 8 వికెట్లకే ఆ జట్టు ఇన్నింగ్స్‌ ముగించింది. 27 పరుగులు చేసిన జమానే ఆ జట్టులో టాప్‌స్కోరర్‌. భారత్‌ తన తర్వాతి సూపర్‌-4 మ్యాచ్‌లో మంగళవారం శ్రీలంకను ఢీకొంటుంది.

వారెవా కుల్‌దీప్‌: ఓవైపు వర్షం దోబూచులాడుతోంది. ఆట ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఇలాంటి స్థితిలో ఛేదన ఆరంభించిన పాక్‌.. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి అమల్లోకి వస్తే ముందంజలో నిలిచేందుకు ధాటిగా ఆడుతుందనిపించింది. కానీ ఆ జట్టుకు ఆ అవకాశమే ఇవ్వలేదు భారత బౌలర్లు. బుమ్రా బంతి బంతికీ పరీక్ష పెట్టడంతో పరుగులు చేయడం సంగతటుంచితే వికెట్‌ కాపాడుకోవడం పాక్‌ ఓపెనర్లకు కష్టమైపోయింది. తడబడుతూ సాగిన ఇమాముల్‌ (9).. బుమ్రా వేసిన అయిదో ఓవర్లో స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో జమాన్‌తో కలిసి బాబర్‌ (10) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. కానీ స్కోరు ముందుకు కదల్లేదు. బాబర్‌ను హార్దిక్‌ బౌల్డ్‌ చేయడంతో పాక్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పాక్‌ 44/2తో ఉన్న దశలో వర్షం వల్ల ఆట ఆగింది. గంటన్నర విరామం తర్వాత ఆట తిరిగి మొదలైందో లేదో.. రిజ్వాన్‌ (2)ను పెవిలియన్‌కు పంపించేశాడు శార్దూల్‌. ఆ తర్వాత మొదలైంది కుల్‌దీప్‌ మాయ. బంతి ఎక్కడ పడుతుందో, ఎటు తిరుగుతుందో తెలియనట్లుగా సాగిన అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం పాక్‌ బ్యాటర్లకు శక్తికి మించిన పనే అయింది. జమాన్‌ను అద్భుతమైన బంతితో బౌల్డ్‌ చేసిన కుల్‌దీప్‌.. ఆ తర్వాత పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను సైకిల్‌ స్టాండ్‌లా మార్చేశాడు. నిలబడితే ఎల్బీ లేదా బౌల్డ్‌.. షాట్‌ ఆడితే క్యాచ్‌ అన్నట్లు తయారైంది పరిస్థితి. వరుసగా  8 ఓవర్లు బౌలింగ్‌ చేసిన కుల్‌దీప్‌.. మరో బౌలర్‌కు అవకాశమివ్వకుండా చివరి 5 వికెట్లనూ తన ఖాతాలోనే వేసుకున్నాడు. జమాన్‌ తర్వాత అఘా సల్మాన్‌ (23), ఇఫ్తికార్‌ (23) మాత్రమే ఆ జట్టు చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.

విరాట్‌, రాహుల్‌ పోటాపోటీ..: ఆదివారం అదిరే ఆరంభం తర్వాత వరుస ఓవర్లలో ఓపెనర్లు వెనుదిరిగాక క్రీజులో కుదురుకోవడానికి కోహ్లి, రాహుల్‌ కష్టపడుతున్న దశలో ఆట ఆగగా.. సోమవారం వీళ్లిద్దరూ కాసేపు నెమ్మదిగానే ఆడారు. మూడు ఓవర్ల పాటు బౌండరీనే రాలేదు. అయితే గాయం కారణంగా సోమవారం పేసర్‌ హారిస్‌ రవూఫ్‌ మైదానంలోకి రాకపోవడంతో అతడి కోటా పూర్తి చేయడానికి స్పిన్నర్‌ ఇఫ్తికార్‌ మీద ఆధారపడాల్సి రావడం పాక్‌కు ప్రతికూలమైంది. అతడి రెండో ఓవర్లో 4, 6 బాదిన రాహుల్‌.. స్కోరు బోర్డులో కదలిక తెచ్చాడు. ఇక అక్కడ్నుంచి ఇన్నింగ్స్‌లో ఊపే తగ్గలేదు. మరో స్పిన్నర్‌ షాదాబ్‌ను సైతం రాహుల్‌ అలవోకగా ఎదుర్కోగా.. కోహ్లి తనదైన శైలిలో బౌండరీలు కొడుతూ ముందుకు సాగాడు. రాహుల్‌ 60 బంతుల్లో, కోహ్లి 55 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. 50 తర్వాత కోహ్లి చెలరేగిపోయాడు. విరాట్‌ సైతం తనను లక్ష్యంగా చేసుకోవడంతో ఇఫ్తికార్‌ 5 ఓవర్లలోనే 46 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి ఓవర్లలో విరాట్‌, రాహుల్‌ ఎవ్వరినీ లెక్క చేయలేదు. భారత్‌కు ఎప్పట్నుంచో కొరకరాని కొయ్యలా మారిన షహీన్‌ అఫ్రిది సైతం.. వీరి ప్రతాపానికి బలయ్యాడు. అతను 10 ఓవర్లలో ఏకంగా 79 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. రాహుల్‌ సరిగ్గా వంద బంతుల్లో సెంచరీ చేయగా.. కోహ్లి 84 బంతుల్లోనే ఈ మార్కును అందుకోవడం విశేషం. శతకం తర్వాత కూడా విరాట్‌ తగ్గలేదు. ఫహీమ్‌ బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ చివరి మూడు బంతులను 4, 4, 6గా మలిచాడు విరాట్‌. ముఖ్యంగా పుల్‌టాస్‌గా పడ్డ చివరి బంతికి లాంగాన్‌లో కొట్టిన సిక్సర్‌ మ్యాచ్‌కే హైలైట్‌.


  •  వన్డేల్లో వేగంగా (277 ఇన్నింగ్స్‌ల్లో) 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌ కోహ్లి. సచిన్‌ (321)ను దాటేశాడు.
  •  కోహ్లి ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో 1000 పరుగులు పూర్తి చేశాడు. అందులో 5 శతకాలున్నాయి.
  •  పాక్‌పై తన అత్యుత్తమ వన్డే స్కోరును భారత్‌ సమం చేసింది. 2005లో విశాఖపట్నం వేదికగా 9 వికెట్లకు 356 పరుగులు చేసిన టీమ్‌ఇండియా.. ఇప్పుడు 2 వికెట్ల నష్టానికి సరిగ్గా అంతే స్కోరు సాధించింది.

228
ఈ మ్యాచ్‌లో గెలుపు తేడా. పరుగుల పరంగా పాకిస్థాన్‌పై వన్డేల్లో భారత్‌కిదే అతి పెద్ద విజయం.


4
కొలంబోలో ఆడిన వన్డేల్లో కోహ్లి వరుసగా నాలుగో శతకం సాధించాడు.


భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) ఫహీమ్‌ (బి) షాదాబ్‌ 56; శుభ్‌మన్‌ (సి) అఘా సల్మాన్‌ (బి) షహీన్‌ 58; కోహ్లి నాటౌట్‌ 122; రాహుల్‌ నాటౌట్‌ 111; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (50 ఓవర్లలో 2 వికెట్లకు) 356; వికెట్ల పతనం: 1-121, 2-123; బౌలింగ్‌: షహీన్‌ అఫ్రిది 10-0-79-1; నసీమ్‌ షా 9.2-1-53-0; ఫహీమ్‌ అష్రాఫ్‌ 10-0-74-0; రవూఫ్‌ 5-0-27-0; షాదాబ్‌ 10-1-71-1; ఇఫ్తికార్‌ అహ్మద్‌ 5.4-0-52-0


పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌: జమాన్‌ (బి) కుల్‌దీప్‌ 27; ఇమాముల్‌ (సి) శుభ్‌మన్‌ (బి) బుమ్రా 9; బాబర్‌ (బి) హార్దిక్‌ 10; రిజ్వాన్‌ (సి) రాహుల్‌ (బి) శార్దూల్‌ 2; అఘా సల్మాన్‌ ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 23; ఇఫ్తికార్‌ (సి) అండ్‌ (బి) కుల్‌దీప్‌ 23; షాదాబ్‌ (సి) శార్దూల్‌ (బి) కుల్‌దీప్‌ 6; ఫహీమ్‌ (బి) కుల్‌దీప్‌ 4; షహీన్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (32 ఓవర్లలో ఆలౌట్‌) 128; వికెట్ల పతనం: 1-17, 2-43, 3-47, 4-77, 5-96, 6-110, 7-119, 8-128; బౌలింగ్‌: బుమ్రా 5-1-18-1; సిరాజ్‌ 5-0-23-0, హార్దిక్‌ 5-0-17-1; శార్దూల్‌ 4-0-16-1; కుల్‌దీప్‌ 8-0-25-5; జడేజా 5-0-26-0


47
వన్డేల్లో కోహ్లి శతకాల సంఖ్య. సచిన్‌ పేరిట ఉన్న అత్యధిక శతకాల రికార్డు (49)కు అతను మరింత చేరువయ్యాడు. సచిన్‌ 463 వన్డేలాడగా.. కోహ్లికిది 278వ మ్యాచ్‌ మాత్రమే. మొత్తంగా విరాట్‌కిది 77వ అంతర్జాతీయ శతకం.


‘‘మ్యాచ్‌ ఆరంభానికి అయిదు నిమిషాల ముందు రాహుల్‌కు తుది జట్టులో ఉన్నావంటూ సమాచారం ఇచ్చాం. అయినా అసాధారణంగా ఆడాడు. అది అతడి మానసిక దృఢత్వాన్ని చెబుతోంది. కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో చాలా సానుకూలాంశాలున్నాయి. బుమ్రా, కుల్‌దీప్‌ బంతితో ఆకట్టుకున్నారు’’ 

 రోహిత్‌


ఆసియా కప్‌లో ఈనాడు
భారత్‌ × శ్రీలంక
మధ్యాహ్నం 3 నుంచి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు