ముంబయి కొద్దిలో...

ఐపీఎల్‌లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్‌కతా-పంజాబ్‌ మధ్య గత మ్యాచ్‌లో కేకేఆర్‌ 261 పరుగులు చేస్తే.. పంజాబ్‌ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది.

Updated : 28 Apr 2024 01:57 IST

లక్ష్యం 258.. 10 పరుగులతో ఓటమి
గట్టెక్కిన దిల్లీ
ఫ్రేజర్‌ విధ్వంసం
విజృంభించిన సలామ్‌, ముకేశ్‌

ఐపీఎల్‌లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్‌కతా-పంజాబ్‌ మధ్య గత మ్యాచ్‌లో కేకేఆర్‌ 261 పరుగులు చేస్తే.. పంజాబ్‌ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది.  తాజాగా ముంబయిపై దిల్లీ 257 పరుగులు చేసి సవాల్‌ విరిసితే... ముంబయి కూడా దాదాపు కొట్టేసినంత పనే చేసింది. కానీ ఆఖర్లో కాస్త తడబడి 10 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది. బ్యాటింగ్‌లో జేక్‌ ఫ్రేజర్‌.. బౌలింగ్‌లో రసిక్‌ సలామ్‌, ముకేశ్‌ కుమార్‌ అదరగొట్టి డీసీ గెలుపులో కీలకమయ్యారు.  

దిల్లీ

పీఎల్‌ ఆరంభ మ్యాచ్‌ల్లో తడబడి పాయింట్ల పట్టిక దిగువకు వెళ్లిపోయిన దిల్లీ బలంగా ముందుకెళ్తోంది. గత అయిదు మ్యాచ్‌ల్లో నాలుగో విజయంతో ఆ జట్టు అయిదో స్థానానికి  ఎగబాకింది. శనివారô డీసీ 10 పరుగుల తేడాతో ముంబయిని ఓడించింది. మొదట ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జేక్‌ ఫ్రేజర్‌ (84; 27 బంతుల్లో 11×4, 6×6) విధ్వంసంతో దిల్లీ 4 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు చేసింది. స్టబ్స్‌ (48 నాటౌట్‌; 25 బంతుల్లో 6×4, 2×6) కూడా రాణించాడు. ఛేదనలో ముంబయి పోరాడినా 247/9కే పరిమితమైంది. తిలక్‌వర్మ (63; 32 బంతుల్లో 4×4, 4×6), హార్దిక్‌ పాండ్య (46; 24 బంతుల్లో 4×4, 3×6) మెరుపులు ఫలితాన్ని ఇవ్వలేదు. రసిక్‌ సలామ్‌ (3/34), ముకేశ్‌ కుమార్‌ (3/59) ప్రత్యర్థిని కట్టడి చేశారు.

తడబాటుతో మొదలై..: ఈ సీజన్లో 200పైన లక్ష్యాలు కూడా సురక్షితం కావు అని ఇప్పటికే తేలడంతో బలమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉన్న ముంబయి.. 258 ఛేదన కోసం ఆరంభం నుంచే గట్టిగానే ప్రయత్నిస్తుందనిపించగా.. ఆ జట్టు ఇన్నింగ్స్‌ అంచనాలకు భిన్నంగా మొదలైంది. 65కే 3 కీలక వికెట్లు పడిపోయాయి. ఓపెనర్‌ రోహిత్‌శర్మ (8)తో పాటు ఉన్నంతసేపు ధాటిగా ఆడిన ఇషాన్‌ కిషన్‌ (20; 14 బంతుల్లో 4×4), ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ (26; 13 బంతుల్లో 3×4, 2×6) వెనుదిరిగారు. ఈ స్థితిలో తిలక్‌వర్మకు తోడైన హార్దిక్‌ దూకుడుగా ఆడాడు. సీజన్లో తొలిసారి హార్దిక్‌ బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. కుల్‌దీప్‌ వేసిన తొమ్మిదో ఓవర్లో ఓ సిక్స్‌, మూడు ఫోర్లు బాది స్కోరు పెంచాడు. తిలక్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో 12 ఓవర్లకు ముంబయి 134/3తో కోలుకుంది. కానీ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రసిక్‌ సలామ్‌ ఒకే ఓవర్లో హార్దిక్‌, వధేరా (4)లను ఔట్‌ చేయడంతో ముంబయి 12.5 ఓవర్లలో 140/5తో ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలోనూ తిలక్‌ పోరాటం ఆపలేదు. టిమ్‌ డేవిడ్‌ (37; 17 బంతుల్లో 2×4, 3×6) తోడుగా ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. 15వ ఓవర్లో తిలక్‌ రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాది ముంబయిలో ఆశలు రేపాడు. 3 ఓవర్లలో 64 పరుగులు చేయాల్సిన స్థితిలో 18వ ఓవర్లో తొలి మూడు బంతుల్లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌ కొట్టిన డేవిడ్‌.. మరో షాట్‌కు పోయి ఔట్‌ కావడంతో ముంబయికి ఏమూలో ఉన్న ఆశలు ఆవిరి అయ్యాయి. ఆఖరి ఓవర్లో 25 పరుగులు అవసరం కాగా.. తిలక్‌ తొలి బంతికే రనౌటయ్యాడు. చావ్లా (10) కొంత పోరాడినా ఫలితం లేకపోయింది. ఆ ఓవర్లో 14 పరుగులే చేయగలిగింది.

కుర్రాడు మళ్లీ..: అంతకుముందు దిల్లీ ఇన్నింగ్స్‌లో జేక్‌ ఫ్రేజర్‌ విధ్వంసమే హైలైట్‌. భీకర ఫామ్‌లో ఉన్న ఈ ఆస్ట్రేలియా కుర్రాడు తొలి బంతి నుంచే బాదుడు మొదలుపెట్టాడు. ల్యూక్‌ వుడ్‌ వేసిన మొదటి ఓవర్లోనే 19 పరుగులు రాబట్టి దిల్లీ ఇన్నింగ్స్‌ను టాప్‌ గేర్‌లో మొదలెట్టాడు. ఈ టోర్నీలో బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్న బుమ్రానూ అతడు వదిలిపెట్టలేదు. ఫ్రేజర్‌ దెబ్బకు బుమ్రా తొలి ఓవర్లోనే 18 పరుగులు ఇచ్చుకున్నాడు. ధనాధన్‌ షాట్లతో 15 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకున్న ఫ్రేజర్‌.. ఆ తర్వాతా దూకుడు కొనసాగించాడు. దీంతో దిల్లీ 7 ఓవర్లకు 113/0తో బలమైన స్థితిలో నిలిచింది. కానీ ఫ్రేజర్‌ను పియూష్‌ చావ్లా బోల్తా కొట్టించడంతో దిల్లీకి తొలి దెబ్బ తగిలింది. అతడితో పాటు అభిషేక్‌ పోరెల్‌ (36) వెనుదిరగడంతో ఆ జట్టు జోరుకు కాస్త బ్రేక్‌ పడింది. ఈ స్థితిలో సిక్స్‌లతో చెలరేగిన షై హోప్‌ (41; 17 బంతుల్లో 5×6) ఇన్నింగ్స్‌కు మళ్లీ ఊపు తెచ్చాడు. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (29; 19 బంతుల్లో 2×4, 2×6) ఓ చేయి వేయడంతో దిల్లీ 14 ఓవర్లకు 181/3తో నిలిచింది. హోప్‌ ఔటైనా.. బాదే బాధ్యత తీసుకున్న స్టబ్స్‌.. ల్యూక్‌ వేసిన 18వ ఓవర్లో చెలరేగి అయిదు ఫోర్లు, ఓ సిక్స్‌తో 26 పరుగులు రాబట్టడంతో స్కోరు దూసుకెళ్లింది. ఈ క్రమంలో అతడు కొట్టిన స్కూప్‌ సిక్స్‌ హైలైట్‌. అదే దూకుడుతో అతడు దిల్లీ స్కోరును 250 దాటించాడు.

దిల్లీ ఇన్నింగ్స్‌: జేక్‌ ఫ్రేజర్‌ (సి) నబి (బి) చావ్లా 84; అభిషేక్‌ పోరెల్‌ (సి) ఇషాన్‌ (బి) నబి 36; షై హోప్‌ (సి) తిలక్‌ (బి) వుడ్‌ 41; పంత్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 29; స్టబ్స్‌ నాటౌట్‌ 48; అక్షర్‌ పటేల్‌ నాటౌట్‌ 11; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 257; వికెట్ల పతనం: 1-114, 2-127, 3-180, 4-235; బౌలింగ్‌: ల్యూక్‌ వుడ్‌ 4-0-68-1; బుమ్రా 4-0-35-1; తుషార 4-0-56-0; చావ్లా 4-0-36-0; హార్దిక్‌ 2-0-41-0; నబి 2-0-20-1

ముంబయి ఇన్నింగ్స్‌: ఇషాన్‌ (సి) అక్షర్‌ (బి) ముకేశ్‌ 20; రోహిత్‌ (సి) హోప్‌ (బి) ఖలీల్‌ 8; సూర్యకుమార్‌ (సి) విలియమ్స్‌ (బి) ఖలీల్‌ 26; తిలక్‌వర్మ రనౌట్‌ 63; హార్దిక్‌ (సి) ముకేశ్‌ (బి) రసిక్‌ 46; వధేరా (సి) పంత్‌ (బి) రసిక్‌ 46; డేవిడ్‌ ఎల్బీ (బి) ముకేశ్‌ 37; నబి (సి) హోప్‌ (బి) రసిక్‌ 7; చావ్లా (సి) హోప్‌ (బి) ముకేశ్‌ 10; ల్యూక్‌ వుడ్‌ నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 247; వికెట్ల పతనం: 1-35, 2-45, 3-65, 4-136, 5-140, 6-210, 7-223, 8-234, 9-247; బౌలింగ్‌: లిజాడ్‌ విలియమ్స్‌ 3-0-34-0; ఖలీల్‌ అహ్మద్‌ 4-0-45-2; ముకేశ్‌ కుమార్‌ 4-0-59-3; కుల్‌దీప్‌ 3-0-47-0; అక్షర్‌ పటేల్‌ 2-0-24-0; రసిక్‌ సలామ్‌ 4-0-34-3

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని