శాంసన్‌ మెరిసినా.. మురిసింది దిల్లీనే

27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్‌ సంజు శాంసన్‌ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్‌ రాయల్స్‌ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే.

Updated : 09 May 2024 00:48 IST

రాజస్థాన్‌ పరాజయం
దిల్లీ

27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్‌ సంజు శాంసన్‌ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్‌ రాయల్స్‌ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. కానీ అంతా తారుమారు కావడానికి ఎంతోసేపు పట్టలేదు. అసాధారణంగా పోరాడుతున్న శాంసన్‌ వివాదాస్పద రీతిలో నిష్క్రమించడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. తమ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తోన్న బ్యాటర్‌ ఔట్‌ కావడంతో పట్టుబిగించిన దిల్లీ.. చివరికి పైచేయి సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయాన్నందుకున్న ఆ జట్టు ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

దిల్లీ క్యాపిటల్స్‌ నిలిచింది. ఆరో విజయంలో ప్లేఆఫ్స్‌ అవకాశాలను కాపాడుకుంది. దిల్లీ మంగళవారం 20 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓడించింది. అభిషేక్‌ పోరెల్‌ (65; 36 బంతుల్లో 7×4, 3×6), జేక్‌ ఫ్రేజర్‌ (50; 20 బంతుల్లో 7×4, 3×6) చెలరేగడంతో మొదట దిల్లీ 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అశ్విన్‌ (3/24) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. కెప్టెన్‌ సంజు శాంసన్‌ (86; 46 బంతుల్లో 8×4, 6×6) అద్భుతంగా బ్యాటింగ్‌ చేసినప్పటికీ ఛేదనలో రాజస్థాన్‌ 8 వికెట్లకు 201 పరుగులే చేయగలిగింది. కుల్‌దీప్‌ యాదవ్‌ (2/25) గొప్పగా బౌలింగ్‌ చేశాడు. ఖలీల్‌, ముకేశ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

వారెవ్వా శాంసన్‌: ఛేదనలో సంజు శాంసన్‌ ఆటే హైలైట్‌. అతడి వీర విధ్వంసంతో రాజస్థాన్‌ ఓ దశలో లక్ష్యాన్ని అందుకునేలానే కనిపించింది. కానీ కీలక సమయంలో దిల్లీ బౌలర్లు పుంజుకున్నారు. ఆరంభంలో రాజస్థాన్‌ చాలా త్వరగానే ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (4)ను కోల్పోయింది. అతడు రెండో బంతికే ఔటయ్యాడు. కానీ దిల్లీకి ఒత్తిడి తెచ్చే అవకాశం ఇవ్వలేదు శాంసన్‌. వచ్చినప్పటి నుంచి బాదుతూనే సాగిపోయాడు. బలమైన షాట్లతో ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు బాదేశాడు. ఖలీల్‌, ఇషాంత్‌ శర్మ, ముకేశ్‌ కుమార్‌ల బౌలింగ్‌ను ఉతికారేశాడు. 5 ఓవర్లలో స్కోరు 57/1. బట్లర్‌ (19) ఔటైనా.. పరాగ్‌తో కలిసి శాంసన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కానీ పరుగుల వేగం కాస్త తగ్గింది. 10 ఓవర్లలో స్కోరు 93/2. పరాగ్‌ (27) నిష్క్రమించినా.. సంజు సిక్స్‌ల మోత మోగించడంతో రాజస్థాన్‌ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. 14 ఓవర్లకు స్కోరు 148/3. శుభమ్‌ దూబె (25) కూడా దూకుడు మీద కనిపించడంతో రాయల్స్‌ అవకాశాలు మెరుగ్గానే కనిపించాయి. కానీ 16వ ఓవర్లో శాంసన్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ ములుపు తిరిగింది. ముకేశ్‌ బౌలింగ్‌లో హోప్‌ తన కాలు దాదాపు బౌండరీ లైన్‌కు తాకుతున్నట్లుగా అందుకున్న క్యాచ్‌కు శాంసన్‌ వెనుదిరిగాడు. అక్కడి నుంచి దిల్లీ పట్టు బిగించింది. 17వ ఓవర్లో ఖలీల్‌ 11 పరుగులిచ్చి దూబెను ఔట్‌ చేయగా.. తర్వాతి ఓవర్లో నాలుగు పరుగులే ఇచ్చిన కుల్‌దీప్‌.. ఫెరీరా, అశ్విన్‌లను ఔట్‌ చేశాడు. 19వ ఓవర్లో రసిక్‌ సలామ్‌ 8 పరుగులే ఇవ్వడంతో ఆఖరి ఓవర్లో రాజస్థాన్‌కు 29 పరుగులు అవసరమయ్యాయి. 20వ ఓవర్‌ తొలి బంతికి ఒక్క పరుగే ఇచ్చిన ముకేశ్‌.. రెండో బంతికి పావెల్‌ (13)ను బౌల్డ్‌ చేయడంతో దిల్లీ విజయం ఖాయమైంది.

ఫ్రేజర్‌, పోరెల్‌ ధనాధన్‌: ఓపెనర్లు జేక్‌ ఫ్రేజర్‌, అభిషేక్‌ల ధనాధన్‌ ఇన్నింగ్స్‌.. ఆఖర్లో స్టబ్స్‌ మెరుపులతో అంతకుముందు దిల్లీ క్యాపిటల్స్‌ పెద్ద స్కోరు సాధించింది. స్పిన్నర్‌ అశ్విన్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మూడు వికెట్లు పడగొట్టినా.. రాజస్థాన్‌ పేసర్లు ధారాళంగా పరుగులిచ్చారు. మిడిల్‌ ఓవర్లలో అశ్విన్‌తో పాటు పరాగ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయకపోతే దిల్లీ మరింత పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించేదే. దిల్లీ టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగగా... ఈ సీజన్‌లో అదిరే బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటోన్న ఫ్రేజర్‌ మరోసారి రెచ్చిపోయాడు. మరో ఓపెనర్‌ పోరెల్‌ కూడా చెలరేగినా మొదట్లో దూకుడంతా ఫ్రేజర్‌దే. బౌల్ట్‌ బౌలింగ్‌లో బౌండరీతో ఆరంభించి, అతడి తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్‌ బాదిన ఫ్రేజర్‌.. ముఖ్యంగా అవేష్‌ ఖాన్‌పై నిర్దయగా విరుచుకుపడ్డాడు. కళ్లు చెదిరే షాట్లతో అవేష్‌ ఓవర్లో వరుసగా 4, 4, 4, 6, 4, 6 బాదిన అతడు.. 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ ఓవర్లో అవేష్‌ ఏకంగా 30 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే బ్యాటర్లకు ఏమాత్రం స్వేచ్ఛనివ్వని అశ్విన్‌ తన తొలి ఓవర్లోనే ఫ్రేజర్‌ను ఔట్‌ చేసి 60 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని విడదీశాడు. దురదృష్టవశాత్తు షై హోప్‌ (1) రనౌటైనా.. గేర్‌ మార్చిన పోరెల్‌ ఫోర్లు, సిక్స్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అక్షర్‌ పటేల్‌ (15)తో 42 పరుగులు జోడించిన అతడు.. పంత్‌ (15)తోనూ విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే 13వ ఓవర్లో అతణ్ని ఔట్‌ చేయడం ద్వారా రాజస్థాన్‌కు అశ్విన్‌ ఊరటనిచ్చాడు. వెంటనే పంత్‌ను చాహల్‌ వెనక్కి పంపడంతో స్కోరు వేగం తగ్గింది. 17 ఓవర్లకు దిల్లీ 168/5. అయితే స్టబ్స్‌ చెలరేగడంతో ఆ జట్టు ఆఖరి మూడు ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు రాబట్టింది. చాహల్‌ ఓవర్లో రెండ[ు ఫోర్లు, సిక్స్‌ బాదిన స్టబ్స్‌.. ఆఖరి ఓవర్లో వెనుదిరిగాడు. భారీగా పరుగులిచ్చుకున్న బౌల్ట్‌, చాహల్‌లు ఒకే రకమైన గణాంకాలు (4-0-48-1) నమోదు చేయడం విశేషం.

సంజు ఔట్‌ వివాదాస్పదం

ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్‌ ఔట్‌ తీవ్ర వివాదాస్పదం అయింది. ముకేశ్‌ కుమార్‌ వేసిన 16వ ఓవర్లో సంజు షార్ట్‌ పిచ్‌ బంతిని లాంగాన్‌ వైపు సిక్సర్‌ బాదేందుకు ప్రయత్నించాడు. బౌండరీ లైన్‌ వద్ద హోప్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అయితే క్యాచ్‌ పట్టాక అతడి ఎడమ పాదం బౌండరీ హద్దును దాదాపుగా తాకినట్లే రీప్లేలో కనిపించింది. షూకి, బౌండరీ హద్దుకు మధ్య ఖాళీ కనిపించలేదు. కానీ రీప్లే పరిశీలించాక మూడో అంపైర్‌ ఔటిచ్చాడు. బంతి బౌండరీ లైన్‌ తాకిందనడానికి స్పష్టమైన ఆధారం కనిపించలేదు. సంతృప్తి చెందని శాంసన్‌ అంపైర్‌తో వాదించినా ఫలితం లేకపోయింది.

దిల్లీ ఇన్నింగ్స్‌: మెక్‌గుర్క్‌ (సి) ఫెరీరా (బి) అశ్విన్‌ 50; పోరెల్‌ (సి) సందీప్‌ (బి) అశ్విన్‌ 65; షై హోప్‌ రనౌట్‌ 1; అక్షర్‌ (సి) పరాగ్‌ (బి) అశ్విన్‌ 15; రిషబ్‌ పంత్‌ (సి) బౌల్ట్‌ (బి) చాహల్‌ 15; స్టబ్స్‌ ఎల్బీ (బి) సందీప్‌ 41; నైబ్‌ (సి) అశ్విన్‌ (బి) బౌల్ట్‌ 19; రసిక్‌ సలామ్‌ రనౌట్‌ 9; కుల్‌దీప్‌ నాటౌట్‌ 5 ఎక్స్‌ట్రాలు 1 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 221; వికెట్ల పతనం: 1-60, 2-68, 3-110, 4-144, 5-150,  6-195, 7-215, 8-221; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-48-1; సందీప్‌ 4-0-42-1; అవేష్‌ 2-0-42-0; అశ్విన్‌ 4-0-24-3; పరాగ్‌ 2-0-17-0; చాహల్‌ 4-0-48-1.

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) అక్షర్‌ (బి) ఖలీల్‌ 4; బట్లర్‌ (బి) అక్షర్‌ 19; శాంసన్‌ (సి) హోప్‌ (బి) ముకేశ్‌ 86; పరాగ్‌ (బి) సలామ్‌ 27; శుభమ్‌ దూబె (సి) స్టబ్స్‌ (బి) ఖలీల్‌ 25; పావెల్‌ (బి) ముకేశ్‌ 13; ఫెరీరా ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 1; అశ్విన్‌ (సి) హోప్‌ (బి) కుల్‌దీప్‌ 2; బౌల్ట్‌ నాటౌట్‌ 2; అవేష్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 15 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201; వికెట్ల పతనం: 1-4, 2-67, 3-103, 4-162, 5-180, 6-181, 7-185, 8-194; బౌలింగ్‌: ఖలీల్‌ 4-0-47-2; ఇషాంత్‌ 3-0-34-0; ముకేశ్‌ 3-0-30-2; అక్షర్‌ 3-0-25-1; కుల్‌దీప్‌ 4-0-25-2; రసిక్‌ 3-0-36-1


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు