సమవుజ్జీల సమరం

11 మ్యాచ్‌లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్‌ రన్‌రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.

Updated : 09 May 2024 00:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: 11 మ్యాచ్‌లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్‌ రన్‌రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి. బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో లఖ్‌నవూ అమీతుమీ తేల్చుకోనుంది. ప్రథమార్ధంలో వరుస విజయాలతో హోరెత్తించిన సన్‌రైజర్స్‌ గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట్లో ఓడింది. ఒకదశలో దుర్భేధ్యంగా కనిపించిన ఆ జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఒక్కసారిగా గాడితప్పాయి. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌శర్మ మెరుపు ఆరంభాలిస్తేనే ఆ జట్టు భారీ స్కోర్లు సాధించగలుగుతోంది. నటరాజన్‌, కమిన్స్‌, భువనేశ్వర్‌ సహా బౌలర్లంతా వికెట్లు తీస్తున్నా.. పరుగుల్ని నియంత్రించలేకపోతున్నారు. ఇక లఖ్‌నవూదీ నిలకడలేని ప్రయాణమే. మొదట్లో వరుస విజయాలతో రాణించి తర్వాత తడబడుతూ సాగుతోంది. ప్లేఆఫ్స్‌ అవకాశాలు మెరుగుపరుచుకోవాలంటే లఖ్‌నవూకూ ఈ మ్యాచ్‌లో విజయం ఎంతో ముఖ్యం. అయితే రెండు జట్లకు కీలకంగా మారిన ఈ మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగించేదే. మంగళవారం హైదరాబాద్‌లో చాలాచోట్ల భారీ వర్షం కురిసింది. ఉప్పల్‌లో కుండపోతగా వర్షం కురవడంతో లఖ్‌నవూ జట్టు సాధన రద్దు చేసుకుంది. బుధవారం కూడా వర్షం పడే అవకాశాలు ఉండటం క్రికెట్‌ అభిమానులకు చేదు వార్తే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు