మరమ్మతులు తప్పవు

భారత టెస్టు జట్టుకు మరమ్మతులు తప్పవని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సూచనప్రాయంగా చెప్పాడు. సరైన దృక్పథం ఉన్న సరైన ఆటగాళ్లను జట్టులోకి తెస్తామని అన్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో పరాజయం నేపథ్యంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. కివీస్‌ చేతిలో ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగేనన్న సంగతి తెలిసిందే

Updated : 25 Jun 2021 02:45 IST

సౌథాంప్టన్‌

భారత టెస్టు జట్టుకు మరమ్మతులు తప్పవని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సూచనప్రాయంగా చెప్పాడు. సరైన దృక్పథం ఉన్న సరైన ఆటగాళ్లను జట్టులోకి తెస్తామని అన్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో పరాజయం నేపథ్యంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. కివీస్‌ చేతిలో ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగేనన్న సంగతి తెలిసిందే. కోహ్లి పేర్లు తీయలేదు కానీ... కొందరు ఆటగాళ్లలో పరుగులు చేయడానికి అవసరమైన తపన లోపించిందంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ చెతేశ్వర్‌ పుజారా తొలి ఇన్నింగ్స్‌లో 54 బంతుల్లో కేవలం 8 పరుగులే చేశాడు. 35వ బంతికి కానీ ఖాతా తెరవలేకపోయాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 80 బంతుల్లో 15 పరుగులే చేశాడు. చివరికి 139 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ అలవోకగా ఛేదించింది. ‘‘మా ఆటను సమీక్షించుకుంటాం. జట్టును బలోపేతం చేయడానికి ఏం చేయాలో చర్చించుకుంటాం. ఏదో ఒక విధానానికి పరిమితమైపోం’’ అని ఫైనల్‌ అనంతరం విలేఖర్ల సమావేశంలో కోహ్లి చెప్పాడు. ఇకపై కొందరు సీనియర్లపై నిశిత దృష్టి ఉంటుందని భావించవచ్చు. ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌లో అదిరే ప్రదర్శన చేస్తే తప్ప వారి భవిష్యత్తుకు భరోసా ఉండకపోవచ్చు. ‘‘భవిష్యత్తుపై ప్రణాళికలు రచించడానికి సంవత్సరకాలం ఆగం. మా పరిమిత ఓవర్ల జట్టును చూడండి.. ఎంతో లోతు ఉంది. ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. టెస్టు క్రికెట్లో కూడా అలాంటి పరిస్థితే ఉండాలి’’ అని కోహ్లి చెప్పాడు. ‘‘మా ఆటను మేం తిరిగి విశ్లేషించుకోవాలి. కొత్త ప్రణాళిక రచించుకోవాలి. ఏం చేస్తే, ఎలా చేస్తే జట్టుకు మంచి ఫలితాలో వస్తాయో.. నిర్భీతిగా ఉండాలంటే ఏం చేయాలో అర్థం చేసుకోవాలి. మంచి ప్రదర్శన చేయడానికి సరైన దృక్పథం గల సరైన ఆటగాళ్లను జట్టులోకి  తేవాలి’’ అని వివరించాడు.

పరుగులు చేయాలి

80 బంతుల్లో 15 పరుగుల కన్నా.. 80 బంతుల్లో 50 పరుగులకు ఎక్కువ విలువ అన్నది ప్రస్తుత జట్టు మేనేజ్‌మెంట్‌ ఉద్దేశం. ఓ బ్యాట్స్‌మన్‌ అతి రక్షణాత్మకంగా ఆడడం వల్ల ఆ తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరుగుతుందని జట్టు భావిస్తోంది. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా కేన్‌ విలియమ్సన్‌ ఓ సెషనంతా ఆడి 7 పరుగులే చేశాడు కానీ.. అవసరమైనప్పుడు ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. చివరి సెషన్‌ సందర్భంగా 80పై బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ‘‘పరిస్థితులకు తగినట్లు మారడం, ఆటను మెరుగుపర్చుకోవడం చాలా ముఖ్యం. కొన్నేళ్లుగా అగ్ర జట్టుగా ఉన్న జట్టు ప్రమాణాలు హఠాత్తుగా తగ్గకూడదు’’ అని కోహ్లి అన్నాడు. ఓటమితో అతడు చాలా బాధపడుతున్నట్లు, భవిష్యత్తులో కఠిన నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంతో ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. న్యూజిలాండ్‌ లాంటి నాణ్యమైన బౌలింగ్‌ దళం ఉన్న జట్లపై పరుగులు చేయడానికి మార్గాలను అన్వేషించడంపై కూడా కోహ్లి మాట్లాడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులే చేసిన సంగతి తెలిసిందే. ‘‘పరుగులు చేయడం ఎలా అన్నదాని గురించి మేం తప్పక ఆలోచించాలి. మ్యాచ్‌ ఉరవడికి అనుగుణంగా మా బ్యాటింగ్‌ ఉండాలి. అయితే మాకు సాంకేతిక ఇబ్బందులేమీ లేవు. ఆట సాగుతున్న తీరుపై అవగాహన ఉండి, బౌలర్లను ఒత్తిడికి నెట్టడానికి ధైర్యంగా ఆడగలగడం ముఖ్యం. బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించి 300 పరుగులు చేయగలిగితే.. మనకున్న బౌలర్లతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టొచ్చు’’ అని కోహ్లి చెప్పాడు. ‘‘పరీక్షించే పరిస్థితుల్లో బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడానికి ప్రయత్నించాలే తప్ప ఔట్‌ గురించి ఆందోళన చెందకూడదు. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టే పద్ధతి అదే’’ అని అన్నాడు.
ఫైనల్లో మూడు మ్యాచ్‌లు ఉండాలి: డబ్ల్యూటీసీలో బెస్టాఫ్‌ త్రీ ఫైనల్స్‌ ఉండాలని కోహ్లి అభిప్రాయపడ్డాడు. ‘‘ఒక్క మ్యాచ్‌తో టెస్టు ఛాంపియన్‌షిప్‌ విజేతను నిర్ణయించడం సరికాదు. ఫైనల్లో మూడు టెస్టులు ఉండాలి. కేవలం రెండు రోజుల మంచి క్రికెట్‌తో ఒత్తిడిలో పడడం వల్ల ఓ జట్టు మంచి టెస్టు జట్టు కాకుండా పోకూడదు’’ అని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని