
Sourav Ganguly: అలా ఆడితే మనదే కప్: గంగూలీ
దుబాయ్: భారత క్రికెట్ జట్టులో నైపుణ్యానికి కొదవ లేదని.. పరిణతితో ఆడితే కప్ మనదేనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘ఏ జట్టయినా సులభంగా ఛాంపియన్ అయిపోదు. ఒక టోర్నీలో బరిలో దిగినంత మాత్రాన విజేతగా నిలవలేదు. ఇందుకు పరిణతి ప్రదర్శించాలి. భారత జట్టుకు కూడా ఇదే వర్తిస్తుంది. టీమ్‌ఇండియాలో నైపుణ్యానికి లోటు లేదు. పరుగులు చేసే సామర్థ్యం.. వికెట్లు తీసే సత్తా రెండూ ఉన్నాయి. అయితే ప్రపంచకప్ గెలవాలంటే మానసిక దృఢత్వం అవసరం. ఇప్పుడే టైటిల్ గురించి ఆలోచించడం సరికాదు. కోహ్లీసేన ఒక్కో మ్యాచ్ మీద దృష్టి సారిస్తూ ముందుకెళ్లాలి. ఫలితాల గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి. ప్రపంచకప్ గెలవడం కోసమే వచ్చామన్న సంగతిని గుర్తుంచుకోవాలి’’ అని సౌరభ్ అన్నాడు. వచ్చే ఐపీఎల్ టోర్నీ భారత్‌లో జరుగుతుందని దాదా ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ‘‘ఐపీఎల్ భారత్‌కు చెందిన టోర్నమెంట్. మన దేశంలో లీగ్ జరిగితే వాతావరణమే భిన్నంగా ఉంటుంది. స్టేడియాలు నిండిపోతాయి. వచ్చే కొన్ని నెలల్లో కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రావొచ్చు. అందుకే 2022 ఐపీఎల్ భారత్‌లో జరుగుతుందని ఆశిస్తున్నా’’ అని సౌరభ్ పేర్కొన్నాడు.