IND vs SA: టీమ్‌ఇండియా కష్టంగా 202

షరా మామూలే. ఈ బ్యాటింగ్‌ బాగుపడేదెప్పుడో! పేసర్ల అద్భుత బౌలింగ్‌ వల్ల, ఓపెనర్లు రాణిస్తుండడం వల్ల సమస్య తీవ్రత తెలియట్లేదు కానీ.. బ్యాటింగ్‌లో టీమ్‌ఇండియా తడబాటు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మిడిల్‌ ఆర్డర్‌ తేలిపోతూనే ఉంది. మరీ ముఖ్యంగా సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా, రహానె నిరాశపరుస్తూనే ఉన్నారు

Updated : 04 Jan 2022 08:28 IST

బ్యాటుతో తడబాటు
రాణించిన రాహుల్‌, అశ్విన్‌
విజృంభించిన జాన్సన్‌, అలివీర్‌, రబాడ
రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 35/1
జొహానెస్‌బర్గ్‌

షరా మామూలే. ఈ బ్యాటింగ్‌ బాగుపడేదెప్పుడో! పేసర్ల అద్భుత బౌలింగ్‌ వల్ల, ఓపెనర్లు రాణిస్తుండడం వల్ల సమస్య తీవ్రత తెలియట్లేదు కానీ.. బ్యాటింగ్‌లో టీమ్‌ఇండియా తడబాటు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మిడిల్‌ ఆర్డర్‌ తేలిపోతూనే ఉంది. మరీ ముఖ్యంగా సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా, రహానె నిరాశపరుస్తూనే ఉన్నారు. పుజారా ముక్కీ మూలిగి ఓ మూడు చేస్తే.. రహానె ఖాతానే తెరవలేకపోయాడు. ఫలితంగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ తక్కువ స్కోరుతో సరిపెట్టుకుంది. దక్షిణాఫ్రికా పేసర్ల ధాటికి దెబ్బతిన్న టీమ్‌ఇండియా అతికష్టంగా రెండొందల పరుగులు చేయగలిగింది. అదైనా అశ్విన్‌  ఆదుకోవడం వల్లే. నిలకడ కొనసాగిస్తూ ఓపెనర్‌ రాహుల్‌ అర్ధశతకం సాధిస్తే.. ఆఖర్లో అశ్విన్‌ బ్యాట్‌ ఝుళిపించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అనంతరం భారత పేస్‌ దాడిని తట్టుకుంటూ దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో ఒక్క వికెట్టే కోల్పోయింది. అయితే చూడ్డానికి.. స్కోరు తక్కువగానే అనిపిస్తున్నా బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై ఆట ఆతిథ్య జట్టుకు కూడా అంత తేలిక కాదు.

సెంచూరియన్‌ టెస్టులో విజయంతో రెండో టెస్టులో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌.. తొలి రోజు తడబడింది. మిడిల్‌ ఆర్డర్‌ పేలవ ప్రదర్శన కొనసాగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌటైంది. రాహుల్‌ (50; 133 బంతుల్లో 9×4), అశ్విన్‌ (46;  50 బంతుల్లో 6×4) రాణించారు. పుజారా (3), రహానె (0)  మళ్లీ విఫలమయ్యారు. జాన్సన్‌ (4/31), అలివీర్‌ (3/64),  రబాడ (3/64) భారత్‌ పతనాన్ని శాసించారు. సోమవారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 35 పరుగులు చేసింది. ఇంకా 167 పరుగులు వెనుకబడి ఉంది. కఠిన పరిస్థితుల్లో పదునైన భారత పేస్‌ను ఎదుర్కొని పైచేయి సాధించాలంటే ఆ జట్టు చాలా కష్టపడాల్సిందే. రెండో రోజు ఉదయం తొలి గంట ఆట చాలా కీలకం కానుంది. కెప్టెన్‌ కోహ్లి వెన్ను నొప్పి కారణంగా మ్యాచ్‌కు దూరం కావడంతో కేల్‌ రాహుల్‌ భారత జట్టుకు నేతృత్వం వహిస్తున్నాడు.

మిడిల్‌ మళ్లీ: అనుకూలిస్తున్న పరిస్థితుల్లో విజృంభించిన దక్షిణాఫ్రికా పేస్‌ దళం భారత బ్యాట్స్‌మెన్‌కు పెను సవాలే విసిరింది. ఓపెనర్‌ రాహుల్‌ సహనంతో నిలిస్తే.. ఆఖర్లో అశ్విన్‌ బ్యాట్‌ ఝుళిపించి విలువైన పరుగులు సాధించాడు. ఈ మధ్యలో అంతా వైఫల్యమే. బౌన్సీ, సీమింగ్‌ పిచ్‌పై జాన్సన్‌, అలివీర్‌, రబాడ టీమ్‌ఇండియాను కట్టడి చేశారు. ఇన్నింగ్స్‌లో భారీ భాగస్వామ్యాలు నమోదు కానివ్వలేదు .అయితే ఓపెనర్‌ రాహుల్‌ మరోసారి చక్కని ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. విలువైన అర్ధశతకం సాధించాడు. కఠినమైన పిచ్‌పై ఎంతో పట్టుదలగా నిలిచాడు. చివరికి లంచ్‌ తర్వాత ఓ పుల్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో నిష్క్రమించాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది బౌండరీలు ఉన్నాయి. రాహుల్‌ షార్ట్‌ పిచ్‌ బంతులను చాలా వరకు బాగానే ఆడాడు. పుల్‌ షాట్లను గాల్లోకి లేవకుండా కొట్టాడు. బ్యాక్‌ఫుట్‌పై చక్కని డ్రైవ్‌లూ ఆడాడు. ముచ్చటైన కట్‌ షాట్లూ కొట్టాడు. ఎంతో సంయమనంతో క్రీజులో నిలిచిన అతడు.. ఎలాంటి పేలవ షాట్‌ ఆడేలా కనిపించలేదు. కానీ కీలక సమయంలో జాన్సన్‌ బౌంతిని పుల్‌ చేసి ఫైన్‌ లెగ్‌లో రబాడకు చిక్కాడు. అయిదో వికెట్‌గా నిష్క్రమించిన రాహుల్‌.. అంతకుముందు హనుమ విహారి (20; 53 బంతుల్లో 3×4)తో నాలుగో  వికెట్‌కు విలువైన 42 పరుగులు జోడించాడు. లేదంటే అలివీర్‌ ధాటికి 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‌ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేదే. ఆ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన విహారి.. కాసేపు రాహుల్‌కు సహకరించినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బవుమా క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన అతడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కుదురుకుని మంచి ఇన్నింగ్స్‌ ఆడేలా కనిపించిన విహారి.. రబాడ బౌలింగ్‌లో షార్ట్‌ లెగ్‌లో వాండెర్‌డసెన్‌ అందుకున్న చక్కని క్యాచ్‌కు నిష్క్రమించాడు. ఓ దశలో 91/3తో సాఫీగా సాగిపోతున్న భారత్‌.. విహారి, రాహుల్‌ కొద్ది తేడాలో నిష్క్రమించడంతో మళ్లీ ఇబ్బందుల్లో పడింది. అసలు మ్యాచ్‌ ఆరంభానికి ముందే   భారత్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. వెన్ను నొప్పి   కారణంగా కెప్టెన్‌ కోహ్లి మ్యాచ్‌కు దూరంగా కాగా..తాత్కాలిక కెప్టెన్‌ రాహుల్‌ కఠిన పరిస్థితుల్లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

అశ్విన్‌ అదరహో..: ఉదయం భారత ఓపెనర్లు బాగానే ఆరంభించారు. సెంచూరియన్‌లో లాగే మంచి ఆరంభాన్నిచ్చేలా కనిపించారు. తొలి గంటలో సాధికారికంగా బ్యాటింగ్‌ చేసిన మయాంక్‌ (26) అయిదు ఫోర్లు కొట్టాడు. కానీ జాన్సన్‌ బంతిని డ్రైవ్‌ చేయబోయిన అతడు ఎడ్జ్‌తో వికెట్‌కీపర్‌ వెరినెకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. పేలవ ఫామ్‌తో జట్టులో స్థానం నిలబెట్టుకోవడం కోసం తంటాలు పడుతున్న ఉన్న సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా, రహానె మరోసారి నిరాశపరిచారు. బౌన్స్‌తో దూసుకొస్తున్న బంతులకు ఇబ్బంది పడ్డ పుజారా.. చివరికి అలివీర్‌ వేసిన ఓ షార్ట్‌ లెంగ్త్‌ బంతిని ఆడబోయి పాయింట్లో తేలికైన క్యాచ్‌ ఇచ్చాడు. తర్వాతి బంతికే రహానె కథ ముగిసింది. ఆఫ్‌స్టంప్‌ ఆవల దూరంగా వెళ్తున్న బంతిని ఆడిన అతడు స్లిప్స్‌లో చిక్కాడు. ఆ తర్వాత కోలుకున్నట్లే కనిపించిన భారత్‌.. విహారి, రాహుల్‌ నిష్క్రమించడంతో 5/116తో మళ్లీ కష్టాల్లో చిక్కుకుంది. అయినా 200 దాటింది అంటే అది అశ్విన్‌ చలవే. అలవోకగా, సాధికారికంగా బ్యాటింగ్‌ చేసిన అశ్విన్‌.. చక్కని షాట్లతో చకచకా ఫోర్లు కొడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. పంత్‌ (17)తో ఆరో  వికెట్‌కు 40 పరుగులు జోడించిన అతడు.. షమి (9)తో ఎనిమిదో వికెట్‌కు 28 పరుగులు జోడించి చివరికి 9వ వికెట్‌ రూపంలో నిష్క్రమించాడు. ఈ ఇన్నింగ్స్‌లో పంత్‌ కూడా నిరాశ పరిచాడు. తన నుంచి జట్టుకు పెద్ద ఇన్నింగ్స్‌ అవసరమైన స్థితిలో అతడు జాన్సన్‌ బౌలింగ్‌లో ఎడ్జ్‌తో క్యాచ్‌ ఔటై ఆరో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. బ్యాటింగ్‌తో సామర్థ్యం వల్ల తుది జట్టులో ఆడే అవకాశం దక్కించుకున్న శార్దూల్‌ ఠాకూర్‌ కూడా విఫలమయ్యాడు. ఖాతా కూడా తెరవకుండానే నిష్క్రమించాడు. చివర్లో బుమ్రా (14 నాటౌట్‌; 11 బంతుల్లో 2×4, 1×6) కాస్త బ్యాట్‌ ఝుళిపించాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) రబాడ (బి) జాన్సన్‌ 50; మయాంక్‌ అగర్వాల్‌ (సి) వెరినె (బి) జాన్సన్‌ 26; పుజారా (సి) బవుమా (బి) అలివీర్‌ 3; రహానె (సి) పీటర్సన్‌ (బి) అలివీర్‌ 0; హనుమ విహారి (సి) వాండర్‌డసెన్‌ (బి) రబాడ 20; పంత్‌ (సి) వెరినె (బి) జాన్సన్‌ 17; అశ్విన్‌ (సి) పీటర్సన్‌ (బి) జాన్సన్‌ 46; శార్దూల్‌ ఠాకూర్‌ (సి) పీటర్సన్‌ (బి) అలివీర్‌ 0; షమి (సి) అండ్‌ (బి) రబాడ 9; బుమ్రా నాటౌట్‌ 14; సిరాజ్‌ (సి) వెరినె (బి) రబాడ 1; ఎక్స్‌ట్రాలు 16

మొత్తం: (63.1 ఓవర్లలో ఆలౌట్‌) 202;

వికెట్ల పతనం: 1-36, 2-49, 3-49, 4-91, 5-116, 6-156, 7-157,  8-185, 9-187;  

బౌలింగ్‌: రబాడ 17.1-2-64-3; అలివీర్‌ 17-1-64-3; ఎంగిడి 11-4-26-0; జాన్సన్‌ 17-5-31-4; కేశవ్‌ మహరాజ్‌ 1-0-6-0

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: ఎల్గర్‌ బ్యాటింగ్‌ 11; మార్‌క్రమ్‌ ఎల్బీ (బి) షమి 7; కీగన్‌ పీటర్సన్‌ బ్యాటింగ్‌ 14; ఎక్స్‌ట్రాలు 3

మొత్తం: (18 ఓవర్లలో) 35/1; వికెట్ల పతనం: 1-14;

బౌలింగ్‌: బుమ్రా 8-3-14-0; షమి 6-2-15-1; సిరాజ్‌ 3.5-2-4-0; శార్దూల్‌ ఠాకూర్‌ 0.1-0-0-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు