జకోవిచ్‌కు మళ్లీ షాక్‌

అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో చరిత్ర సృష్టిద్దామనుకున్న నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) ఆశ ఇప్పట్లో తీరేలా లేదు! గ్రాండ్‌స్లామ్‌ విజయాల్లో నాదల్‌, ఫెదరర్‌ (20)తో సమానంగా ఉన్న ఈ ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడికి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడేందుకు దారులు మూసుకు పోయినట్లే కనిపిస్తున్నాయి.

Published : 15 Jan 2022 02:43 IST

వీసా రద్దు చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం
మరోసారి కోర్టుకు నొవాక్‌

మెల్‌బోర్న్‌: అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో చరిత్ర సృష్టిద్దామనుకున్న నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) ఆశ ఇప్పట్లో తీరేలా లేదు! గ్రాండ్‌స్లామ్‌ విజయాల్లో నాదల్‌, ఫెదరర్‌ (20)తో సమానంగా ఉన్న ఈ ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడికి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడేందుకు దారులు మూసుకు పోయినట్లే కనిపిస్తున్నాయి. ఈ టోర్నీ ఆరంభానికి మూడు రోజుల ముందే అతనికి మళ్లీ షాకిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తన వీసాను రెండో సారి రద్దు చేయడమే అందుకు కారణం. జకోవిచ్‌ వీసా రద్దు చేస్తున్నట్లు ఆ దేశ ఇమిగ్రేషన్‌ మంత్రి అలెక్స్‌ హాక్‌ శుక్రవారం ప్రకటించారు. ‘‘దేశ ప్రజల ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకుని వలస చట్టంలోని 133సి(3) సెక్షన్‌ ప్రకారం నా అధికారాన్ని ఉపయోగించి జకోవిచ్‌ వీసా రద్దు చేస్తున్నా. ఈ కొవిడ్‌ సమయంలో ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా. ఆస్ట్రేలియా సరిహద్దు భద్రతా దళం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జకోవిచ్‌ అందించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ నిర్ణయానికి వచ్చా’’ అని అలెక్స్‌ పేర్కొన్నారు. ఈ మహమ్మారి కాలంలో ఆస్ట్రేలియా ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని, వాళ్ల భద్రత కోసమే అలెక్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ దేశ ప్రధాని మోరిస్‌ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జకో మరోసారి ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించాడు. ఒకవేళ కోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే అతను మూడేళ్ల పాటు ఆసీస్‌లో అడుగుపెట్టే అవకాశం ఉండకపోవచ్చు. మరోవైపు జకోవిచ్‌ టోర్నీలో ఆడేలా ఈ వారాంతంలో అతని తరపు న్యాయవాదులు కోర్టు నుంచి తీర్పు పొందడం చాలా కష్టమని మెల్‌బోర్న్‌కు చెందిన ఇమిగ్రేషన్‌ న్యాయవాది కియాన్‌ పేర్కొన్నాడు. జకో న్యాయవాదులు కోర్టు నుంచి రెండు అత్యవసర ఆదేశాలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకటి జకోపై నిషేధాన్ని ఎత్తివేయడం, మరొకటి టోర్నీలో ఆడేందుకు వీసా మంజూరు చేయడం. ప్రస్తుత పరిస్థితుల్లో అది వెంటనే సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

అసలేం జరిగింది..: సోమవారం ఆరంభమయ్యే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనే ప్లేయర్లు తప్పనిసరిగా రెండు డోసుల టీకా వేసుకోవాలని నిర్వాహకులు నిబంధన విధించారు. టీకా వేసుకున్న విదేశీయులనే ఆ దేశ ప్రభుత్వం అనుమతిస్తోంది. కానీ గత నెల 16న తనకు కొవిడ్‌ సోకిందనే కారణంతో 34 ఏళ్ల జకోవిచ్‌ వైద్య మినహాయింపు కోరాడు. అందుకు టోర్నీ నిర్వాహకులు, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. దీంతో టోర్నీ కోసం బుధవారం మెల్‌బోర్న్‌ చేరుకున్న అతణ్ని.. విమానాశ్రయంలోనే సరిహద్దు భద్రతా దళం అడ్డుకుంది. మినహాయింపు కోరేందుకు అతని కారణం సహేతుకంగా లేదని వీసా రద్దు చేసి ఇమిగ్రేషన్‌ నియంత్రణలోని హోటల్‌కు తరలించింది. దీంతో కోర్టును ఆశ్రయించిన జకోకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అతని వీసా పునరుద్ధరించడంతో పాటు ఆ హోటల్‌ నుంచి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. బయటకు వచ్చిన జకో.. ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. టోర్నీ డ్రాలో అతనికి టాప్‌ సీడ్‌ దక్కింది. కానీ తాజాగా ఇమిగ్రేషన్‌ మంత్రి అలెక్స్‌ మాత్రం  తన వ్యక్తిగత అధికారాన్ని ఉపయోగించి ఇప్పుడు మరోసారి అతని వీసా రద్దు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని