వెళ్లి ఆటో నడుపుకో అన్నారు

2019 ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున చెత్త ప్రదర్శన చేసిన తర్వాత క్రికెట్‌ వదిలేసి మీ నాన్నతో కలిసి ఆటో నడుపుకోమని చాలామంది వ్యంగ్యంగా వ్యాఖ్యానించారని భారత యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ గుర్తు చేసుకున్నాడు. ‘‘2019

Published : 09 Feb 2022 02:55 IST

దిల్లీ

2019 ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున చెత్త ప్రదర్శన చేసిన తర్వాత క్రికెట్‌ వదిలేసి మీ నాన్నతో కలిసి ఆటో నడుపుకోమని చాలామంది వ్యంగ్యంగా వ్యాఖ్యానించారని భారత యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ గుర్తు చేసుకున్నాడు. ‘‘2019 ఐపీఎల్‌ సీజన్లో నా ప్రదర్శన ఏమంత బాగోలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో వరుసగా రెండు బీమర్లు వేయడంతో కెప్టెన్‌ కోహ్లి బౌలింగ్‌ నుంచి తప్పించాడు. దీంతో నాపై విమర్శలు వర్షం కురిసింది. వెళ్లి మీ నాన్నతో కలిసి ఆటో నడుపుకోమన్నారు. ఇదొక్కటే కాదు చాలా మాటలు పడాల్సి వచ్చింది. నా ఐపీఎల్‌ కెరీర్‌ ముగిసినట్లే అని భావించా. అయితే జనాల విమర్శలను ఎక్కువగా పట్టించుకోవద్దని ధోని భాయ్‌ అన్న మాటలు స్ఫూర్తినిచ్చాయి. అప్పుడు తిట్టిన అభిమానులే ఇప్పుడు పొగుడుతున్నారు. ఉత్తమ బౌలర్‌ అంటున్నారు. అందుకే ఏ సందర్భాన్నీ తీవ్రంగా తీసుకోకూడదు’’ అని సిరాజ్‌ అన్నాడు. 2019 ఐపీఎల్‌ సీజన్లో దారుణంగా బౌలింగ్‌ చేసిన సిరాజ్‌ 10పైన ఎకానమీ రేట్‌తో తొమ్మిది మ్యాచ్‌ల్లో 7 వికెట్లే తీశాడు. ముఖ్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో 2.2 ఓవర్లలోనే అయిదు సిక్స్‌లతో సహా 36 పరుగులు ఇచ్చుకున్నాడు. కానీ ఈ సీజన్‌ తర్వాత అనూహ్యంగా మెరుగైన సిరాజ్‌ 2020 సీజన్లో సత్తా చాటాడు. అంతేకాదు అదే ఏడాది ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికై జట్టు చారిత్రాత్మక విజయంలో కీలకపాత్ర పోషించాడు.

నాన్న గురించి చెప్పలేదు

నాన్న పరిస్థితి విషమంగా ఉందన్న సంగతి కూడా తనకు తెలియదని.. ఆస్ట్రేలియా పర్యటన సమయంలో ఆయన్ని కోల్పోవడం ఎంతో వేదనకు గురి చేసిందని సిరాజ్‌ అన్నాడు. ‘‘2020లో నాన్న అనారోగ్యానికి గురయ్యారు. నేనెప్పుడు ఫోన్‌ చేసినా ఏడుస్తూనే మాట్లాడేవారు. నేను కన్నీళ్లు ఆపులేకలేకపోయేవాడిని. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత నాన్నకు సీరియస్‌గా ఉందని ఎవరూ చెప్పలేదు ఎప్పుడు ఆయనికి ఫోన్‌ ఇవ్వమన్నా విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పేవాళ్లు. ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన తర్వాత కానీ ఆయన పరిస్థితి విషమంగా ఉందని సంగతి తెలియలేదు. ముందుగానే నాకెందుకు ఈ విషయం చెప్పలేదని కుటుంబ సభ్యులతో గొడవపడ్డాను. ముందే తెలిస్తే ఆస్ట్రేలియా వెళ్లకముందే ఆయన్ని కలిసేవాడినని అన్నా. కానీ నా కెరీర్‌ ఎక్కుడ దెబ్బ తింటుందోనని నాన్న గురించి చెప్పలేదని వాళ్లు నాతో అన్నారు’’ అని సిరాజ్‌ పేర్కొన్నాడు. ఈ ఆసీస్‌తో సిరీస్‌లో రెండో టెస్టు ద్వారా అరంగేట్రం చేయకముందే ముందే సిరాజ్‌ నాన్న మహ్మద్‌ గౌస్‌ మరణించారు. తండ్రి అంత్యక్రియలకు స్వదేశానికి వెళ్లకుండా జట్టుతోనే ఉన్న సిరాజ్‌.. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లు తీసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని