Womens World Cup: మహిళల మహా సంగ్రామం

మహిళల క్రికెట్టా.. హా! అదేం చూస్తాం?.. ఇవీ కొన్నేళ్ల క్రితం వినిపించిన మాటలు! అరె.. అమ్మాయిలు భలే ఆడుతున్నారే.. ఇవీ ఇప్పుడు వినిపిస్తున్న మాటలు! ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత్‌లో అతివల క్రికెట్‌కు కొన్నేళ్లుగా ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. ఇప్పుడు మరోసారి అభిమానులను

Updated : 04 Mar 2022 07:01 IST

వన్డే ప్రపంచకప్‌ ఆరంభం నేడు
తొలి మ్యాచ్‌లో కివీస్‌తో వెస్టిండీస్‌ ఢీ
ఉదయం 6.30 నుంచి 
మౌంట్‌ మాంగనూయి

మహిళల క్రికెట్టా.. హా! అదేం చూస్తాం?.. ఇవీ కొన్నేళ్ల క్రితం వినిపించిన మాటలు! అరె.. అమ్మాయిలు భలే ఆడుతున్నారే.. ఇవీ ఇప్పుడు వినిపిస్తున్న మాటలు! ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత్‌లో అతివల క్రికెట్‌కు కొన్నేళ్లుగా ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. ఇప్పుడు మరోసారి అభిమానులను అలరించేందుకు అమ్మాయిలు సిద్ధమయ్యారు. శుక్రవారమే వన్డే ప్రపంచకప్‌ ఆరంభం. బరిలో ఎనిమిది జట్లు. విజేతగా నిలిచేది మాత్రం ఒక్కరే! మరి ఆ టైటిల్‌ను అందుకునేది ఎవరు? టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టేది ఎవరు? కప్పుకలను భారత అమ్మాయిలు నిజం చేస్తారా? అన్నది చూడాలి.

మహిళల వన్డే మహా సంగ్రామం మళ్లీ తిరిగొచ్చింది. కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడ్డ ప్రపంచకప్‌.. అయిదేళ్ల తర్వాత అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. న్యూజిలాండ్‌ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీకి శ్రీకారం.. శుక్రవారమే. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య కివీస్‌తో వెస్టిండీస్‌ తలపడుతుంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోరుతో భారత్‌ కప్పు వేట మొదలెడుతుంది. 1973 నుంచి మొదలు 2017 వరకూ మొత్తం 11 వన్డే ప్రపంచకప్‌లు జరిగాయి. అందులో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ కలిసి ఏకంగా 10 సార్లు విజేతగా నిలిచాయి. ఈ రెండు జట్లు కాకుండా కప్పు అందుకున్న మూడో జట్టు ఒక్క న్యూజిలాండ్‌ (2000) మాత్రమే. ఆసీస్‌ ఆరు సార్లు విజేతగా నిలవగా.. ఇంగ్లాండ్‌ నాలుగు సార్లు గెలిచింది. ఈ నేపథ్యంలో ఈ సారి కొత్త విజేతను చూస్తామా? అన్నది ఆసక్తికరం. 31 రోజుల పాటు క్రికెట్‌ పండగను అందించే ఈ ప్రపంచకప్‌ ఏప్రిల్‌ 3న ముగుస్తుంది. ఆరు వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్‌ దశలో ఒక్కో జట్టు మిగతా ఏడు దేశాలతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. లీగ్‌ దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌ చేరతాయి. బంగ్లాదేశ్‌ తొలిసారి ఈ టోర్నీలో బరిలో దిగుతుండగా.. గత ఆరు ప్రపంచకప్‌ల్లోనూ ఆడిన శ్రీలంక ఈ సారి టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.
మళ్లీ మునుపటిలా..: కరోనా తగ్గుముఖం పట్టడంతో టోర్నీలో అమ్మాయిలకు ఉపశమనం కలిగించేలా ఐసీసీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ప్రతి రోజు క్రికెటర్లకు వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు. అంతే కాకుండా బబుల్‌ ఆంక్షలు కూడా సులభతరం చేశారు. మరోవైపు కరోనా ప్రభావం చూపినా టోర్నీ ఆగకుండా ఉండేందుకు జట్టుకు తొమ్మిది మంది క్రికెటర్లు అందుబాటులో ఉన్నా ఆడేందుకు ఐసీసీ అవకాశం కల్పించింది. మిగతా ఇద్దరు సబ్‌స్టిట్యూట్‌లను జట్టు మహిళా సిబ్బంది నుంచి కూడా  
తీసుకోవచ్చు. కానీ వాళ్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయకూడదు.

ఈ జట్లపై దృష్టి..: మహిళల వన్డే ప్రపంచకప్‌ అనగానే ముందుకు ఆస్ట్రేలియా పేరే వినిపిస్తుంది. ఇప్పటివరకూ ఆరు సార్లు విజేతగా నిలిచిన ఆ జట్టు.. ఈ సారి కూడా గెలిచి ఏడో టైటిల్‌ను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. ఆ జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉంది. 2017 ప్రపంచకప్‌ తర్వాత ఆడిన 30 వన్డేల్లో ఆ జట్టు కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే ఓడింది. ఈ నేపథ్యంలో మరోసారి ఆసీస్‌ టైటిల్‌ ఫేవరేట్‌ అనడంలో సందేహం లేదు. మరోవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ కూడా కప్పు నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా కూడా బలంగా కనిపిస్తున్నాయి.

ఆ ప్రదర్శన స్ఫూర్తిగా..: వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకూ రెండు సార్లు ఫైనల్‌ (2005, 2017) చేరిన భారత్‌.. కప్పు కలను సాకారం చేయలేకపోయింది. తొలి సారి విశ్వవిజేతగా నిలిచేందుకు పోరాటం చేస్తూనే ఉంది. ఆ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికేందుకు ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. 2017లో ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో అంచనాల్లేకుండా అడుగుపెట్టి.. అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌ చేరి.. దేశాన్ని తమవైపు తిప్పుకున్న అమ్మాయిలు.. ఈ సారి కూడా అదే స్ఫూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉంది. కెప్టెన్‌ మిథాలీకి ఇదే చివరి ప్రపంచకప్‌. తన అసాధారణ కెరీర్‌కు ప్రపంచకప్‌ విజయంతో ముగింపు పలికితే అంతకంటే ఆనందం ఇంకేం ఉంటుంది. మరి కప్పు దిశగా జట్టు ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి.


డీఆర్‌ఎస్‌.. పూర్తిగా

మహిళల వన్డే ప్రపంచకప్‌లో అన్ని మ్యాచ్‌లకూ నిర్ణయ సమీక్ష విధానం (డీఆర్‌ఎస్‌) అందుబాటులో ఉంటుందని ఐసీసీ ప్రకటించింది. అమ్మాయిల ప్రపంచకప్‌లో డీఆర్‌ఎస్‌ను ఉపయోగించడం ఇది రెండోసారి. 2017 ప్రపంచకప్‌లో ఈ విధానాన్ని అమలు చేశారు. కొన్నేళ్లుగా మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రపంచకప్‌కు విస్త్రత ప్రసారం కల్పించేందుకు ఐసీసీ సిద్ధమైంది.


1

ఆరు ప్రపంచకప్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా భారత కెప్టెన్‌ మిథాలీ ఈ టోర్నీతో చరిత్ర సృష్టించనుంది. ఈ టోర్నీలో ఆమె మరో 362 పరుగులు చేస్తే ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నమోదు చేస్తుంది.


4
మహిళల వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచేందుకు భారత వెటరన్‌ పేసర్‌ జులన్‌కు కావాల్సిన వికెట్లు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని