Gavaskar - Shane Warne: షేన్‌వార్న్‌ గురించి అలా అనాల్సింది కాదు: గావస్కర్‌

షేన్‌ వార్న్‌ ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్‌ కాదంటూ ఈ సమయంలో తాను వ్యాఖ్యానించాల్సింది కాదని భారత బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. గత శుక్రవారం వార్న్‌ గుండెపోటులో మరణించిన నేపథ్యంలో జరిగిన ఓ టీవీ ఛానెల్‌ చర్చలో సన్నీ పాల్గొన్నాడు.

Updated : 08 Mar 2022 07:21 IST

దిల్లీ: షేన్‌ వార్న్‌ ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్‌ కాదంటూ ఈ సమయంలో తాను వ్యాఖ్యానించాల్సింది కాదని భారత బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. గత శుక్రవారం వార్న్‌ గుండెపోటులో మరణించిన నేపథ్యంలో జరిగిన ఓ టీవీ ఛానెల్‌ చర్చలో సన్నీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీరు చూసిన అత్యుత్తమ స్పిన్నర్‌ వార్న్‌యేనా అని సన్నీని యాంకర్‌ అడగ్గా.. ‘‘నా దృష్టిలో షేన్‌ వార్న్‌ అత్యుత్తమ స్పిన్నర్‌ కాదు. భారత స్పిన్నర్లు, మురళీధరన్‌ అతడికన్నా మెరుగు. ఎందుకంటే భారత్‌లో అతడి రికార్డు చాలా సాధారణంగా ఉంది. భారత్‌లో ఒక్కసారి మాత్రమే అతడు అయిదు వికెట్ల ఘనత సాధించాడు. స్పిన్‌లో బాగా ఆడగల భారత బ్యాట్స్‌మెన్‌పై పెద్దగా విజయవంతం కాని అతణ్ని గొప్ప స్పిన్నర్‌ అని అనలేను’’ అని గావస్కర్‌ చెప్పాడు. సన్నీ వ్యాఖ్యలను చాలామంది తప్పుబట్టారు. వార్న్‌ మరణించిన సమయంలో అతడి గురించి ఈ వ్యాఖ్యలేంటని విమర్శించారు. ఈ నేపథ్యంలో సన్నీ స్పందించాడు. ‘‘నిజానికి ఈ సమయంలో అలాంటి ప్రశ్న అడగాల్సింది కాదు. నేనూ జవాబు చెప్పి ఉండాల్సింది కాదు. పోలికలు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. యాంకర్‌ అడిగిన ప్రశ్నకు నేను నిజాయితీగా నా అభిప్రాయం చెప్పా. వార్న్‌ క్రికెట్‌ చూసిన గొప్ప ఆటగాళ్లలో ఒకడు. రాడ్నీ మార్ష్‌ ఉత్తమ వికెట్‌ కీపర్లలో ఒకడు. వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’’ అని సన్నీ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని