Hyderabad vs Chennai: ఖాతా తెరిచేదెవరో..!

డిఫెండింగ్‌ ఛాంపియనే కానీ చెన్నై ఆరంభం పేలవం. ఇంకా పాయింట్ల ఖాతానే తెరవలేదు. కొత్త కెప్టెన్‌ రవీంద్ర జడేజా నేతృత్వంలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. కోల్‌కతా, లఖ్‌నవూ, పంజాబ్‌ చేతిలో ఓటమి

Updated : 09 Apr 2022 06:46 IST

పుణె: డిఫెండింగ్‌ ఛాంపియనే కానీ చెన్నై ఆరంభం పేలవం. ఇంకా పాయింట్ల ఖాతానే తెరవలేదు. కొత్త కెప్టెన్‌ రవీంద్ర జడేజా నేతృత్వంలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. కోల్‌కతా, లఖ్‌నవూ, పంజాబ్‌ చేతిలో ఓటమి చవిచూసిన ఆ జట్టు అన్ని రంగాల్లోనూ మెరుగుపడాల్సివుంది. ఈ నేపథ్యంలో చెన్నై మరో పోరాటానికి సిద్ధమైంది. శనివారం జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొంటుంది. హైదరాబాద్‌  పరిస్థితి కూడా గొప్పగా ఏమీ లేదు. చెన్నై లాగే టోర్నీలో ఇంకా బోణీ కొట్టలేదు. కేన్‌ విలియమ్సన్‌ నాయకత్వంలోని ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. మొదట రాజస్థాన్‌, ఆ తర్వాత లఖ్‌నవూ చేతిలో భంగపడ్డ హైదరాబాద్‌ సీజన్‌లో తొలి విజయం కోసం తహతహలాడుతోంది. మరి చెన్నై, హైదరాబాద్‌ లో ఏ జట్టు బోణీ కొడుతుందో చూడాలి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 16 సార్లు తలపడగా 12 విజయాలతో చెన్నై పైచేయిలో ఉంది. శనివారం జరిగే మరో మ్యాచ్‌లో ముంబయి జట్టు.. డుప్లెసిస్‌ సారథ్యంలోని బెంగళూరును ఢీకొంటుంది. ముంబయి కూడా టోర్నీలో ఇప్పటివరకు విజయాన్నందుకోలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. ముంబయి నెగ్గాలంటే సమష్టిగా రాణించాల్సివుంది. ముఖ్యంగా కెప్టెన్‌ రోహిత్‌ ఫామ్‌ను అందుకోవడం ఆ జట్టుకు చాలా అవసరం. అయితే ఇషాన్‌ కిషన్‌ మంచి ఫామ్‌లో ఉండడం, యువ ఆటగాడు తిలక్‌ వర్మ సత్తా చాటుటుండడం ముంబయికి సానుకూలాంశాలు. మరో వైపు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు నెగ్గిన బెంగళూరు ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ మ్యాచ్‌తో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సెలక్షన్‌కు అందుబాటులో రానుండడం బెంగళూరుకు పెద్ద సానుకూలాంశం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని