Mumbai: ముంబయి 8/8.. మళ్లీ ఓడిన రోహిత్‌ సేన

పాపం ముంబయి జట్టు! రికార్డు స్థాయిలో అయిదు టైటిళ్లు గెలిచిన ఈ ఛాంపియన్‌ జట్టు ఈసారి బోణీ కోసమే అవస్థ పడుతోంది.  ఈ టీ20 మెగా టోర్నీ సీజన్‌ సగం పూర్తయినా గెలుపు కోసం ఆ

Updated : 25 Apr 2022 06:44 IST

రాహుల్‌ సూపర్‌ సెంచరీ

లఖ్‌నవూకు అయిదో విజయం

ముంబయి

పాపం ముంబయి జట్టు! రికార్డు స్థాయిలో అయిదు టైటిళ్లు గెలిచిన ఈ ఛాంపియన్‌ జట్టు ఈసారి బోణీ కోసమే అవస్థ పడుతోంది.  ఈ టీ20 మెగా టోర్నీ సీజన్‌ సగం పూర్తయినా గెలుపు కోసం ఆ జట్టు నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్‌ రేసుకు దూరమైన రోహిత్‌సేన.. పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ వరుసగా ఎనిమిదో పరాజయాన్ని చవిచూసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అద్భుత శతకానికి, బౌలర్ల మెరుగైన ప్రదర్శన తోడైన వేళ లఖ్‌నవూ జట్టు ముంబయిని మట్టికరిపించింది. టోర్నీలో లఖ్‌నవూకు ఇది అయిదో విజయం.

లఖ్‌నవూ జట్టు అదరగొట్టింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (103 నాటౌట్‌; 62 బంతుల్లో 12×4, 4×6) శతక్కొట్టడంతో ఆదివారం 36 పరుగుల తేడాతో ముంబయి జట్టుని ఓడించింది. రాహుల్‌ మెరుపులతో మొదట లఖ్‌నవూ 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో రాహుల్‌కు ఇది రెండో శతకం. వారం కిందటే అతను ముంబయి మీదే 103 పరుగులతోనే అజేయంగా నిలవడం విశేషం. ఛేదనలో ముంబయి తడబడింది. కృనాల్‌ పాండ్య (3/19), మోసిన్‌ ఖాన్‌ (1/27), బిష్ణోయ్‌ (1/28), చమీర (0/14) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 8 వికెట్లకు 132 పరుగులే చేయగలిగింది. రోహిత్‌ (39; 31 బంతుల్లో 5×4, 1×6), తిలక్‌ వర్మ (38; 27 బంతుల్లో 2×4, 2×6) మాత్రమే రాణించారు. ఈ ఓటమితో ముంబయికి సాంకేతికంగా కూడా ప్లేఆఫ్స్‌ అవకాశాలు లేనట్లే! రాహుల్‌కు కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

ఛేదన కష్టంగా..: లఖ్‌నవూ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఛేదనలో ముంబయికి అత తేలిగ్గా పరుగులు రాలేదు. రోహిత్‌ దూకుడుగానే కనిపించినా... మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ బాగా ఇబ్బంది పడ్డాడు. షాట్లు ఆడలేకపోయాడు. 5 ఓవర్లకు ముంబయి స్కోరు 31 పరుగులు కాగా.. కిషన్‌ 16 బంతుల్లో 5 పరుగులే చేశాడు. హోల్డర్‌ బౌలింగ్‌లో వరుసగా 6, 4తో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు రోహిత్‌. కానీ మోసిన్‌ ఖాన్, రవి బిష్ణోయ్, కృనాల్‌ పాండ్య ఏమాత్రం బ్యాట్‌ ఝుళిపించే అవకాశం ఇవ్వకపోవడంతో 7 నుంచి 12 ఓవర్ల మధ్య ఆ జట్టుకు ఒకే బౌండరీ వచ్చింది. క్రమం తప్పకుండా వికెట్లూ పడ్డాయి. ఇషాన్‌ కిషన్‌ (8), బ్రెవిస్‌ (3), రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ (7) వికెట్లను కోల్పోయి 13 ఓవర్లలో 77/4తో నిలిచింది ముంబయి. సాధించాల్సిన రన్‌ రేట్‌ బాగా పెరిగిపోయింది. అలాంటి స్థితిలో యువ కెరటం తిలక్‌ వర్మ అదిరే బ్యాటింగ్‌తో ముంబయిలో ఉత్సాహం నింపాడు. మరోవైపు పొలార్డ్‌ భారీ షాట్లు ఆడలేకపోతున్నా తిలక మాత్రం చెలరేగిపోయాడు. బిష్ణోయ్‌ బౌలింగ్‌లో లాంగాఫ్, డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా సిక్స్‌లు బాదిన అతడు.. హోల్డర్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు సాధించాడు. అయినా పొలార్డ్‌లో అవసరమైన దూకుడు లేకపోవడంతో లక్ష్యం కష్టమైందిగానే ఉండిపోయింది. 17 ఓవర్లకు స్కోరు 119/4. గెలవాలంటే ముంబయి చివరి మూడు ఓవర్లలో 50 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అప్పటికి పొలార్డ్‌ 16 బంతుల్లో 16 పరుగులే చేశాడు. 18వ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన హోల్డర్‌ ఆరు పరుగులే ఇచ్చి తిలక్‌ను ఔట్‌ చేయడంతో ముంబయి సమీకరణం ఇంకా సంక్లిష్టంగా మారింది. 19వ ఓవర్లో గొప్పగా బౌలింగ్‌ చేసిన చమీర 5 పరుగులే ఇవ్వడంతో లఖ్‌నవూ విజయం ఖాయమైపోయింది. చివరి ఓవర్లో కృనాల్‌ 2 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

కేఎల్‌ ఒక్కడు..: లఖ్‌నవూ జట్టు  పోటీ ఇవ్వదగ్గ స్కోరు సాధించింది అంటే ఏకైక కారణం కేఎల్‌ రాహులే. సరైన ఆరంభం దక్కకున్నా, మిగతా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ రాణించకున్నా పట్టుదలగా ఆడిన అతడు, ఆద్యంతమూ నిలిచి, విలువైన శతకంతో లఖ్‌నవూను నిలబెట్టాడు. లేదంటే లఖ్‌నవూ తక్కువ స్కోరుతో సరిపెట్టుకునేదే. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు ఆరంభంలో పరుగుల కోసం కష్టపడింది. బుమ్రా ఇతర ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పవర్‌ ప్లే ముగిసే సరికి వికెట్‌ నష్టానికి కేవలం 32 పరుగులు చేసింది. అప్పటికే అయిదుగురు బౌలర్లతో బౌలింగ్‌ చేయించాడు రోహిత్‌. రాహుల్‌ కొన్ని బౌండరీలు కొట్టినా.. ఎక్కువ దూకుడుగా ఆడలేదు. మరో ఓపెనర్‌ డికాక్‌ (10)ను నాలుగో ఓవర్లో బుమ్రా వెనక్కి పంపాడు. పవర్‌ ప్లే తర్వాత కూడా ముంబయి బౌలర్లు బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం స్వేచ్ఛనివ్వలేదు. మనీష్‌ పాండే (22; 22 బంతుల్లో 1×6) ధాటిగా ఆడలేకపోయాడు. కానీ క్రమంగా రాహుల్‌ గేర్‌ మార్చడంతో స్కోరో బోర్డు ఊపందుకుంది. ఉనద్కత్‌ స్లో బంతిని మిడ్‌వికెట్లో స్టాండ్స్‌లో పడేసిన అతడు.. మెరిడిత్‌ ఓవరో సిక్స్, రెండు ఫోర్లు దంచాడు. బుమ్రా ఓవర్లో ఓ బంతిని మిడ్‌వికెట్‌ బౌండరీకి పుల్‌ చేశాడు. రాహుల్‌ 37 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. జట్టుకు మంచి స్కోరును అందించాలనే పట్టుదలతో అతడు కనిపించాడు. మిగతా వాళ్ల నుంచి సరైన సహకారం లభించకున్నా.. చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించాడు. పాండేను 12వ ఓవర్లో పొలార్డ్‌ ఔట్‌ చేశాడు. అప్పటికి స్కోరు 82/2. సామ్స్‌ బౌలింగ్‌లో రాహుల్‌ రెండు సిక్స్‌లు అందుకున్నాడు. కానీ స్టాయినిస్‌ (0), కృనాల్‌ పాండ్య (1), దీపక్‌ హుడా (10) త్వరత్వరగా వెనుదిరిగారు. రాహుల్‌ను మాత్రం ముంబయి నిలువరించలేకపోయింది. బుమ్రా బౌలింగ్‌లో రెండు ఫోర్లు దంచిన అతడు.. ఉనద్కత్‌ ఓవర్లో హ్యాట్రిక్‌ ఫోర్లతో 94కు చేరుకున్నాడు. 18 ఓవర్లకు స్కోరు 155/4. 19వ ఓవర్లో బుమ్రా నాలుగు పరుగులే ఇచ్చాడు. మెరెడిత్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో తొలి బంతినే సిక్స్‌గా మలిచి రాహుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో బంతికి బదోని (14) సిక్స్‌ కొట్టాడు. కానీ చివరి మూడు బంతుల్లో ఒక్క పరుగూ రాకపోవడంతో లఖ్‌నవూకు కాస్త అసంతృప్తి తప్పలేదు. నాలుగో బంతికి బదోని ఔట్‌ కాగా.. చివరి రెండు బంతుల్లో హోల్డర్‌ పరుగులు చేయలేపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని