Carlos Alcaraz: వచ్చేస్తున్నాడు.. నయా నాదల్‌

చిన్నతనంలో ఆ పిల్లాడు చూసిన తొలి టెన్నిస్‌ టోర్నీ అది.. అప్పుడు దిగ్గజం నాదల్‌ టైటిల్‌ గెలిచాడు.. అది చూసి తన ఆరాధ్య ఆటగాడి లాగే ఆ ట్రోఫీని సొంతం చేసుకోవాలని ఆ పిల్లాడు నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు 19 ఏళ్ల వయసులో ఆ లక్ష్యాన్ని

Updated : 10 May 2022 06:55 IST

ఈనాడు క్రీడావిభాగం

చిన్నతనంలో ఆ పిల్లాడు చూసిన తొలి టెన్నిస్‌ టోర్నీ అది.. అప్పుడు దిగ్గజం నాదల్‌ టైటిల్‌ గెలిచాడు.. అది చూసి తన ఆరాధ్య ఆటగాడి లాగే ఆ ట్రోఫీని సొంతం చేసుకోవాలని ఆ పిల్లాడు నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు 19 ఏళ్ల వయసులో ఆ లక్ష్యాన్ని సాధించాడు. అది కూడా నాదల్‌, జకోవిచ్‌లపై నెగ్గి విజేతగా నిలిచాడు. ఆ టోర్నీ మాడ్రిడ్‌ ఓపెన్‌.. ఇప్పుడు కుర్రాడిగా మారిన ఆ పిల్లాడి పేరు కార్లోస్‌ అల్కరస్‌. టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో ఈ టీనేజర్‌ ఇప్పుడు నయా సంచలనం. అగ్రశ్రేణి ఆటగాళ్లకు షాక్‌లిస్తూ.. వరుస విజయాలతో భవిష్యత్‌ తారగా వెలిగే దిశగా ఈ స్పెయిన్‌ కుర్రాడు సాగుతున్నాడు.  

ఫెల్‌ నాదల్‌.. రోజర్‌ ఫెదరర్‌.. నొవాక్‌ జకోవిచ్‌.. టెన్నిస్‌లో పురుషుల సింగిల్స్‌లో కొన్ని దశాబ్దాలుగా ఈ దిగ్గజ త్రయానిదే ఆధిపత్యం. ఇప్పటివరకూ మొత్తం 61 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను ఈ ముగ్గురు పంచుకున్నారు. అత్యధికంగా 21 టైటిళ్లతో నాదల్‌ అగ్రస్థానంలో ఉండగా.. ఫెదరర్‌, జకోవిచ్‌ చెరో 20 సార్లు విజేతలుగా నిలిచారు. ఇదీ టెన్నిస్‌లో వీళ్ల ఆధిపత్యానికి నిదర్శనం. మరి ఈ ముగ్గురి తర్వాత ఎవరు? అనేది కొంత కాలంగా వినిపిస్తున్న ప్రశ్న. ఆ సందేహాలకు సమాధానంగా నిలిచేలా.. సంచలన ప్రదర్శనతో దూసుకొస్తున్నాడు కార్లోస్‌ అల్కరస్‌. అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న అతను తాజాగా మాడ్రిడ్‌ ఓపెన్‌లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఈ టోర్నీ గెలిచిన అతి పిన్న వయస్సు ఆటగాడిగా, రెండు మాస్టర్స్‌ 1000 టైటిళ్లు నెగ్గిన రెండో (నాదల్‌ తర్వాత) తక్కువ వయస్సు ఆటగాడిగా అతను నిలిచాడు. ఈ విజయం అతనికి సులభంగా ఏమీ దక్కలేదు. క్వార్టర్స్‌లో నాదల్‌ను, సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ జకోవిచ్‌ను, ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జ్వెరెవ్‌ను ఓడించి మరీ సగర్వంగా ట్రోఫీని ముద్దాడాడు. నాదల్‌తో పోరులో తన కుడి చీలమండకు గాయమైంది. అది వాచింది. అయినా అలాగే పోరాడి జకోవిచ్‌, జ్వెరెవ్‌పై నెగ్గడం ఆటపై తనకున్న తపనకు అద్దం పడుతోంది. ఈ ఏడాది ఇప్పటికే ఫైనల్‌ చేరిన నాలుగు టోర్నీల్లోనూ అతను గెలిచాడు.  

నాదల్‌ బాటలో..: తన దేశానికి చెందిన నాదల్‌ అంటే కార్లోస్‌కు ఎనలేని అభిమానం. చిన్నప్పుడు అతని ఆట చూసే టెన్నిస్‌ రాకెట్‌ పట్టాడు. ఇప్పుడు అతని రికార్డులనే బద్దలు కొడుతున్నాడు. ఎర్రమట్టి కోర్టు రారాజుగా పేరు తెచ్చుకున్న నాదల్‌ను మాడ్రిడ్‌ ఓపెన్‌లో ఓడించిన కార్లోస్‌.. క్లేకోర్టులో నాదల్‌పై గెలిచిన తొలి టీనేజర్‌గా చరిత్ర సృష్టించాడు. నిరుడు యుఎస్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌ చేరి ఓపెన్‌ శకంలో ఆ ఘనత సాధించిన అతిపిన్న వయస్సు (18 ఏళ్లు) ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది మియామి ఓపెన్‌లో నెగ్గి ఈ టోర్నీ చరిత్రలోనే టైటిల్‌ అందుకున్న తక్కువ వయస్సు ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. బార్సిలోనా ఓపెన్‌ గెలిచి తొలిసారి ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో అడుగుపెట్టిన అతను.. నాదల్‌ తర్వాత ఆ ఘనత సాధించిన పిన్న వయస్సు ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడీ విజయంతో ఆరో ర్యాంకుకు దూసుకెళ్లాడు. ఇలా చెప్పుకుంటూ పోతే టీనేజీలోనే ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. వేగంగా దూసుకెళ్లే సర్వీస్‌, ప్రత్యర్థిని కోర్టుకు ఇరు వైపులా తిప్పే ర్యాలీలు, శక్తిమంతమైన షాట్లు, ఉన్నట్లుండి బంతిని నెమ్మదిగా స్పిన్‌ చేసి ప్రత్యర్థిని బోల్తా కొట్టించే నైపుణ్యాలు, తిరుగులేని ఫోర్‌హ్యాండ్‌, బ్యాక్‌హ్యాండ్‌ షాట్లు, కండలు తిరిగిన దేహం, ఉరకలెత్తే యువ రక్తం.. ఇవన్నీ కలగలిసి అతను వరుస విజయాలతో సాగుతున్నాడు. గాయం నుంచి కోలుకోవడం కోసం ఇటాలియన్‌ ఓపెన్‌కు దూరమైన అతను.. ఈ నెల 16న ఆరంభమయ్యే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నెగ్గి గ్రాండ్‌స్లామ్‌ బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. అతను నిలకడగా ఇదే జోరు కొనసాగిస్తే గ్రాండ్‌స్లామ్‌లు అతనికి సలామ్‌ కొడతాయనడంలో సందేహం లేదు.


‘‘ప్రపంచంలో ఇప్పుడు కార్లోస్‌ అత్యుత్తమ ఆటగాడు. ఈ వయసులోనే అతను దిగ్గజ ఆటగాళ్లను ఓడిస్తున్నాడు. ఇలాంటి సూపర్‌స్టార్‌ రావడం టెన్నిస్‌కు మంచిది’’

- జ్వెరెవ్‌


‘‘టెన్నిస్‌ చరిత్రలోనే దిగ్గజాలైన నాదల్‌, జకోవిచ్‌ను ఓడించడం గొప్పగా ఉంది. ప్రపంచ నంబర్‌ 3 జ్వెరెవ్‌పైనా నెగ్గడం మంచి అనుభూతి. నా జీవితంలోనే ఈ వారం అత్యుత్తమమైంది. 19 ఏళ్ల నేను శారీరకంగా ఫిట్‌గా ఉన్నా. సుదీర్ఘ మ్యాచ్‌లు ఆడడంలో అదే కీలకం. నేను చూసిన తొలి టోర్నీలోనే ఇప్పుడు విజేతగా నిలవడం ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ నాదల్‌ విజేతగా నిలవడం చూసి స్ఫూర్తి పొందా’’

- కార్లో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని