Virender Sehwag: అన్ని మ్యాచ్‌లకైతేనే ఎంపిక చేయండి: సెహ్వాగ్‌

అంతర్జాతీయ కెరీర్‌లో తానూ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నట్లు టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ అన్నాడు. ఒకదశలో రిటైరవ్వాలని నిర్ణయించుకున్నా.. దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ సలహా మేరకు ఆలోచనను విరమించుకున్నట్లు

Updated : 03 Jun 2022 08:03 IST

దిల్లీ

అంతర్జాతీయ కెరీర్‌లో తానూ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నట్లు టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ అన్నాడు. ఒకదశలో రిటైరవ్వాలని నిర్ణయించుకున్నా.. దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ సలహా మేరకు ఆలోచనను విరమించుకున్నట్లు తెలిపాడు. ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విరాట్‌ కోహ్లి విమర్శలకు ఎలా స్పందించాలంటూ అడిగిన ప్రశ్నకు వీరూ తన స్వీయానుభవాన్ని పంచుకున్నాడు. 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్‌ బ్యాంక్‌ ముక్కోణపు వన్డే సిరీస్‌లో వీరూ ఘోరంగా విఫలమయ్యాడు. శ్రీలంక కూడా పాల్గొన్న ఈ సిరీస్‌లో మొదటి 4 మ్యాచ్‌ల్లో వీరూ ఒక్క అర్ధ సెంచరీ కూడా సాధించలేదు. దీంతో అయిదో మ్యాచ్‌కు తుది జట్టు నుంచి వీరూను కెప్టెన్‌ ధోని తప్పించాడు. టాప్‌ ఆర్డర్‌లో రోహిత్‌శర్మ, గౌతమ్‌ గంభీర్‌, రాబిన్‌ ఉతప్ప.. మిడిలార్డర్‌లో తాను, యువరాజ్‌సింగ్‌ ఆడాలని నిర్ణయించాడు. ఈ పరిణామంతో కలత చెందిన వీరూ.. స్వదేశం చేరుకున్న తర్వాత వన్డేలకు వీడ్కోలు పలకాలని భావించాడు. అయితే సచిన్‌ సలహా మేరకు వీడ్కోలు ఆలోచనను విరమించుకున్నాడు.

అనంతరం ఆసియా కప్‌ ఎంపిక సమయంలో సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ సంప్రదించినప్పుడు.. ‘నేను అన్ని మ్యాచ్‌లు ఆడేటట్లయితేనే ఎంపిక చేయండి.. లేకపోతే వద్దు’ అని స్పష్టంచేసినట్లు వీరూ తెలిపాడు. ‘‘కొన్ని రోజుల తర్వాత.. ఏం చేయాలని అనుకుంటున్నావ్‌? అని శ్రీకాంత్‌ నన్ను అడిగాడు. ‘మంచి టచ్‌లో ఉన్నప్పటికీ జట్టులో నాకు స్థానం లేదు. నేనేం చేస్తాను. నేను అన్ని మ్యాచ్‌లు ఆడతానని అనుకుంటేనే ఎంపిక చేయండి.. లేకపోతే వద్దు’ అని బదులిచ్చా. దీంతో ఆసియా కప్‌కు ముందు ధోనీతో శ్రీకాంత్‌ మాట్లాడాడు. ‘వీరూ పా నువ్వు ఆడతావు’ అని ధోని అన్నాడు. ఆ తర్వాత నేను చాలా క్రికెట్‌ ఆడా. నేను ఏం చేయాలో నాకు తెలుసు కాబట్టి ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోలేదు’’ అని సెహ్వాగ్‌ వివరించాడు. టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ బరిలో దిగిన ఆసియా కప్‌లో సెహ్వాగ్‌ ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో రాణించాడు. ఆ తర్వాత వీరూ వెనుదిరిగి చూడలేదు. ‘‘కొందరు ఆటగాళ్లు విమర్శల్ని సానుకూలంగా స్వీకరిస్తారు. మరికొందరు మనసు మీదకి తీసుకుంటారు. కొందరు చెవుల చుట్టూ చేతులు పెట్టుకుంటారు. ఇంకొందరు సెల్యూట్‌ చేస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యక్తపరుస్తారు. పరిస్థితుల్ని ఎదుర్కోవడంలో ప్రతి ఒక్కరికి ఒక శైలి ఉంటుంది. విరాట్‌ కోహ్లి చాలా దూకుడుగా కనిపిస్తాడు లేదా ప్రతిస్పందిస్తాడు. అది అతని శైలి. ‘నేను కూడా ఆ విధంగా స్పందించడానికి ప్రయత్నిస్తా. ఫలితంగా కోహ్లి లాంటి ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేసేలా జోష్‌ వస్తుంది’ అంటూ డుప్లెసిస్‌ కూడా వ్యాఖ్యానించాడు’’ అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని